సాక్షి, హైదరాబాద్: వర్షాకాలం నేపథ్యంలో వాహనదారులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోడ్లపై ఉన్న గుంతలను పూడుస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ తెలిపారు. రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రేటర్ హైదరాబాద్‌ని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరగడం, రోడ్లు గుంతలమయం కావడంతో క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తున్నామని కమిషనర్ తెలిపారు.
శనివారం ఆయన బేగంపేట, పరేడ్ గ్రౌండ్, సికింద్రాబాద్, కవాడిగూడ, ఆర్టీసీ క్రాస్‌రోడ్ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ.. 48 గంటలుగా ఎడతెరపి లేకుండా వర్షం పడుటం వల్ల రోడ్లు డ్రై అవడానికి అవకాశం లేదని అన్నారు. రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చడానికి ప్రత్యేక మెటీరియల్ షెల్మాక్ బీటీ మిశ్రమాన్ని వాడుతున్నామన్నారు. వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌లో తాజా పరిస్థితులపై ఉదయమే అధికారుల అందరితో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు కమిషనర్ వెల్లడించారు. ప్రతి జోన్‌కు ఇద్దరు సీనియర్ అధికారులను మానిటరింగ్ ఆఫీసర్లుగా నియమించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని, 150 ఎమర్జెన్సీ బృందాలు కూడా పనులు చేస్తున్నాయని దాన కిషోర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment