dhana kishor
-
ఫోన్ లిఫ్ట్ చేయమని చెప్పండి: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : నగర మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రావు, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్, డిప్యూటి మేయర్ ఫసియొద్దిన్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరైయ్యారు. ముందుగా దివంగత కేంద్ర మంత్రులు జైపాల్ రెడ్డి, సుష్మా స్వరాజ్, ముఖేష్ గౌడ్లతో పాటు ప్రమాదంలో మరణించిన ఇద్దరు బల్దియా ఉద్యోగుల ఆత్మ శాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ప్రారంభమైన సమావేశంలో ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారులకు ముందు ఫోన్ లిఫ్ట్ చేయమని చెప్పాలని, కనీసం ప్రోటోకాల్ పాటించాలని మేయర్‌కు సూచించారు. అధికారులను సరెండర్ చేసే అధికారం సభకు ఉందని, సభ్యులు ఆ విశిష్ట అధికారాలను పాటించాలని తెలిపారు. బక్రీద్, గణేష్ నిమజ్జనం వంటి పండుగల ముందే సమావేశాలు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. గచ్చిబౌలిలో ఎమ్మార్ ప్రాపెర్టీ అక్రమ నిర్మాణలపై చర్యలు తీసుకోవాలని కోరారు. నగరంలో ఎక్కడచూసినా గుంతలే కనిపిస్తున్నాయని, వాటితో ప్రజలు ఇబ్బందులకు అనేక గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాంతీయ సమస్యలను వెంటనే పరిష్కరించారాలని హెచ్చరించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ప్రదేశాలు బాగుంటాయని అందరూ అనుకుంటున్నారు, కానీ అవి కూడా ప్రస్తుతం అధ్వానంగా మారాయని పేర్కొన్నారు. నగరంలో ముఖేష్ గౌడ్, జైపాల్ రెడ్డి, సుష్మా స్వరాజ్ విగ్రహాలను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కమిషనర్ దానకిషోర్ మాట్లాడుతూ.. కొంతమంది అధికారులు పని ఒత్తిడివల్ల కలవకపోయి ఉండవచ్చని అయితే అందరూ తప్పనిసరిగా ప్రజాప్రతినిధులను కలవాలని తెలిపారు. నగరంలో డెంగ్యూ కేసులు ఎక్కువయ్యాయని, వాటి నివారణకు చర్యలు చేపడతామన్నారు. -
రోడ్లపై గుంతలు పూడుస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: వర్షాకాలం నేపథ్యంలో వాహనదారులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోడ్లపై ఉన్న గుంతలను పూడుస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ తెలిపారు. రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రేటర్ హైదరాబాద్‌ని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరగడం, రోడ్లు గుంతలమయం కావడంతో క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తున్నామని కమిషనర్ తెలిపారు. శనివారం ఆయన బేగంపేట, పరేడ్ గ్రౌండ్, సికింద్రాబాద్, కవాడిగూడ, ఆర్టీసీ క్రాస్‌రోడ్ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ.. 48 గంటలుగా ఎడతెరపి లేకుండా వర్షం పడుటం వల్ల రోడ్లు డ్రై అవడానికి అవకాశం లేదని అన్నారు. రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చడానికి ప్రత్యేక మెటీరియల్ షెల్మాక్ బీటీ మిశ్రమాన్ని వాడుతున్నామన్నారు. వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌లో తాజా పరిస్థితులపై ఉదయమే అధికారుల అందరితో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు కమిషనర్ వెల్లడించారు. ప్రతి జోన్‌కు ఇద్దరు సీనియర్ అధికారులను మానిటరింగ్ ఆఫీసర్లుగా నియమించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని, 150 ఎమర్జెన్సీ బృందాలు కూడా పనులు చేస్తున్నాయని దాన కిషోర్ తెలిపారు. -
‘ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తాం’
సాక్షి, హైదరాబాద్ : తాజాగా కురిసిన వర్షానికి ఐటీ కారిడర్ మొత్తం స్తంభించింది. చిన్న పాటి వర్షానికే మాదాపూర్, హైటెక్‌సిటీ, శిల్పారామం ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు ఐదు గంటలపాటు ఐటీ ఉద్యోగులు ట్రాఫిక్‌లోనే చిక్కుకున్నారు. శిల్పారామం వద్ద గల ఓ నాలా పొంగిపొర్లడంతో ఈ సమస్య తలెత్తిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి ఘటన మరోసారి పునరావృతం కాకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ కమీషనర్ దానకిషోర్ చర్యలు చేపట్టారు. ఈ విషయంపై అధికారులతో నేడు సమావేశమయ్యారు. భారీ వర్షాలు కురిసినప్పుడు ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ సమస్య చాలా ఇబ్బంది ఉంటుందని అన్నారు. 2.5 లక్షలు నుండి ఇప్పుడు 5.5 లక్షలు కి ఉద్యోగుల సంఖ్య పెరిగిందని తెలిపారు. ఒకేసారి 3.5 లక్షలు వాహనాలు రోడ్ల పైకి వచ్చినప్పుడు ఇబ్బంది కరంగా మారుతుందని పేర్కొన్నారు. వర్షం ఎంత సమయం పడుతుంది , ఎంత స్థాయిలో వర్షం కురిసింది అనేది ఐటీ కారిడార్ కి సమాచారం లేకుండా పోతోందని అన్నారు. ఇక నుండి ఐటీ కంపనీలకు వర్ష సూచన, ట్రాఫిక్ సమస్య పై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని తెలిపారు. ఎస్ఎమ్ఎస్, మెయిల్స్ ద్వారా అందరికి సమాచారం ఇస్తామన్నారు. ఇప్పటికే 80 శాతం నాలాలను క్లీనింగ్ చేశామని తెలిపారు. -
కోటి మొక్కలకు ఏర్పాట్లు
సాక్షి, సిటీబ్యూరో: హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్‌లో కోటి మొక్కలను నాటాలన్న లక్ష్యానికి అనుగుణంగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 60లక్షల మొక్కలను జీహెచ్ఎంసీ నర్సరీల ద్వారా, మరో 40లక్షల మొక్కలను ప్రైవేట్ నర్సరీల్లో పెంచుతున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ తెలిపారు. హరితహారం నిర్వహణ పై జోనల్, డిప్యూటీ కమిషనర్లు, అర్బన్ బయోడైవర్సిటీ అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మొక్కల పెంపకం చేపట్టిన నర్సరీలను తనిఖీ చేసి పెంపకం వివరాలపై నివేదిక అందజేయాలని జోనల్, డిప్యూటి కమిషనర్లను ఆదేశించారు. ఈ తనిఖీలకు డిప్యూటి కమిషనర్లు, జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలో వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హరితహారం విజయవంతం చేయడానికి కాలనీ సంక్షేమ సంఘాలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, కార్యాలయాలు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీ స్థలాలను గుర్తించి వాటిలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాలన్నారు. రహదారులు, కాలనీల్లో నాటే మొక్కల సంరక్షణకు ట్రీ గార్డ్లు అవసరమని, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబిలిటీ కింద కనీసం లక్ష ట్రీగార్డులను సమకూర్చుకోవాలని జోనల్ కమిషనర్లకు సూచించారు. నగరంలో జీహెచ్ఎంసీకి చెందిన 616 బహిరంగ ప్రదేశాల్లో హరితహారం మొక్కలను నాటడం ద్వారా పార్కులుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. పదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన 331 ట్రీ పార్కుల్లో ఉన్న ఖాళీ స్థలాల్లో, శ్మశానవాటిల్లోని ఖాళీ స్థలాల్లో కూడా హరితహారం మొక్కలను నాటాలని సూచించారు. అర్బన్ బయోడైవర్సిటీకి పార్కుల్లో క్రీడా పరికరాల నిర్వహణ గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు మేజర్ పార్కుల్లో చిన్న పిల్లలకు ఏర్పాటు చేసిన క్రీడా పరికరాల నిర్వహణ బాధ్యతలను అర్బన్ బయోడైవర్సిటీ విభాగానికి అప్పగిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. వీటి వార్షిక నిర్వహణకు ఏజెన్సీలను ఖరారు చేయాలని అర్బన్ బయోడైవర్సిటీ అధికారులను ఆదేశించారు. రంజాన్ తోఫాలకు ఏర్పాట్లు రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి వార్డులో రెండు మసీదులను గుర్తించి రంజాన్ బహుమతులను అందజేయనున్నట్లు తెలిపారు. నగరంలోని 150 వార్డులకుగాను 300 మసీదులను ఎంపికచేసి దుస్తుల పంపిణీ, ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయాలని డిప్యూటి కమిషనర్లను ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్లు అమ్రపాలి , జయరాజ్ కెనెడీ, జోనల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల పనులు వేగవంతం
సాక్షి, సిటీబ్యూరో: లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల పర్వంనేటినుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుంది. దీంతో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పనులు వేగవంతమయ్యాయి. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఎన్నికల సిబ్బందికి శిక్షణ, ప్రవర్తనానియమావళి అమలు తదితర కార్యక్రమాలను హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఏప్రిల్ 5లోగాఉచితంగా ఓటరు కార్డులు.. కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వారి పేర్ల జాబితా ఈ నెల 25వ తేదీన వెలువడుతుంది. వారితోపాటు ఇటీవల నమోదు చేసుకున్న కొత్త ఓటర్లందరికీ ఉచితంగానే ఓటరు కార్డులు ఏప్రిల్ 5వ తేదీలోగా అందజేస్తాం. పకడ్బందీగా ప్రవర్తనా నియమావళి ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలు చేస్తున్నాం. ఇప్పటికే రూ.90 లక్షలకుపైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు జాబితాలో పేర్లు నమోదైన వారితో మదర్ రోల్ సోమవారం వెలువడుతుంది. ఈ నెల 15వ తేదీవరకు దరఖాస్తు చేసుకున్న వారి పేర్ల నమోదు జాబితా ఈ నెల 25న వెలువడనుంది. పోలింగ్ శాతం పెంపునకు చర్యలు.. గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో 49 శాతం పోలింగే నమోదైంది. పోలింగ్ శాతం పెంచేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. దివ్యాంగులను పోలింగ్ కేంద్రాల దాకా తీసుకువచ్చేందుకు అవసరమైర రవాణా సదుపాయం కల్పిస్తాం. వారు వాదా యాప్ ద్వారా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ర్యా ంప్లు ఏర్పాటు చేస్తున్నాం. ఇంటింటికీ ఓటరు స్లిప్‌ల పంపిణీ.. ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీలోగా ఇంటింటికీ ఓటరు స్లిప్‌లను అందజేసేందుకు చర్యలు చేపడతాం. అసెంబ్లీ ఎన్నికల అనుభవంతో ఈసారి అందరికీ అందేలా చర్యలు తీసుకుంటాం. వీటి పంపిణీకి సంబంధించి ప్రతి రెండు గంటలకోసారి సమాచారం అప్డేట్ అవుతుంది. తద్వారా ఎన్ని కుటుంబాలకు చేరిందన్నది సులభంగా తెలుస్తుంది. ఇళ్ల వద్ద లేని వారి పోల్ స్లిప్‌లను భద్రపరచి సీల్డ్ కవర్లో సంబంధిత ఎన్నికల అధికారులకు అందజేస్తాం. పన్నెండు రకాలైన గుర్తింపు పత్రాల్లో దేన్నయినా చూపించి ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న పోలింగ్ కేంద్రాలు 3,976ఓటర్ల పెరుగుదలను బట్టివీటి సంఖ్యను పెంచుతాం నామినేషన్ల స్వీకరణ ఇలా.. హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్, సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి జాయింట్ కలెక్టర్ రిటర్నింగ్ అధికారులుగా ఉన్నారు. వారి కార్యాలయాల్లోనే నామినేషన్లు స్వీకరిస్తారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆ ఈవీఎంలను వినియోగించం గత అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. సంబంధిత ఈవీఎంలను లోక్‌సభ ఎన్నికలకు వినియోగించం. వాటిని పటిష్ట భద్రతలో ఉంచాం. ఓట్ల లెక్కింపు కేంద్రాలు అవే.. ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ల రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలుగా గత అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించిన ప్రాంతాలనే దాదాపుగా వినియోగించనున్నాం. ఓట్ల లెక్కింపు కేంద్రాలు సైతం దాదాపుగా అసెంబ్లీ ఎన్నికలనాటివే ఉంటాయి. ఈవీఎంల సంఖ్య.. బ్యాలెట్ యూనిట్లు : 6,483 కంట్రోల్ యూనిట్లు: 4,802 వీవీ ప్యాట్లు : 5,141 వీటి తొలిదశ తనిఖీ పూర్తయింది ఎన్నికల విధుల్లో24 వేల సిబ్బంది ఎన్నికల విధుల నిర్వహణకు దాదాపు 24 వేల మంది సిబ్బంది అవసరం. వారిని సమకూర్చుకుంటున్నాం. ఇప్పటికే నియమితులైన వారికి ఆదివారం శిక్షణ ప్రారంభమైంది. మలి దశ శిక్షణ వచ్చే నెల 1, 2, 3వ తేదీల్లో ఇస్తాం నోడల్ అధికారి నియామకం.. ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈసారి ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియమించాం. జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ జయరాజ్ కెనెడీ విధులు నిర్వర్తిస్తారు. ఎన్నికలవిధుల్లో ఉన్నవారందరికీ పోస్టల్ బ్యాలెట్ అందేలా ఏర్పాట్లు చేశాం. శిక్షణ సమయంలోనే వారికి సంబంధిత ఫారం– 12 అందజేసి, వాటిని భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. సువిధ యాప్‌తో.. ఎన్నికల ర్యాలీలు, ఎన్నికల కార్యాలయాల ఏర్పాటు, ప్రచార వాహనాలు, లౌడ్ స్పీకర్లు, హెలికాప్టర్లు, హెలిపాడ్లు తదితర అనుమతుల కోసం సువిధ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే సంబంధిత రిటర్నింగ్ అధికారులు అనుమతులు జారీ చేస్తారు. వీటి కోసం దరఖాస్తు చేసుకునేందుకు రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలకు వెళ్లనవసరంలేదు. ప్రజల భాగస్వామ్యం అవసరం.. ఎంత నిఘా ఉంచినా ఎన్నికల నియమావళి ఉల్లంఘనలన్నీ అధికారుల దృష్టికి రావు. ప్రజా భాగస్వామ్యంతోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో కేసులు నమోదయ్యాయి. ఉల్లంఘనల దృశ్యాలు ఫొటోలు, వీడియోలు తీసి సీ విజిల్ యాప్‌లో అప్లోడ్ చేస్తే వెంటనే చర్యలు ప్రారంభమవుతాయి. -
పోరుకు సన్నద్ధం
సాక్షి, సిటీబ్యూరో: లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. పోలింగ్ విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ సిద్ధమయ్యారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో శిక్షణ ఇచ్చినప్పటికీ, కొందరు అధికారులు, సిబ్బంది అవగాహన లోపంతో పొరపాట్లు చేశారు. తిరిగి అలాంటి ఘటనలు లోక్‌సభ ఎన్నికల్లో పునరావృతం కాకుండా పూర్తిస్థాయి శిక్షణనివ్వాలని భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే దాదాపు పదివేల మంది పోలింగ్ అధికారులు, అసిస్టెంట్ పోలింగ్ అధికారులకు ఆది, సోమవారాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. మొత్తం ఎనిమిది కేంద్రాల్లో రోజుకు రెండు షిఫ్టుల్లో ఈ శిక్షణ ఉంటుంది. అందరూ విధుల్లో పాల్గొనాల్సిందే.. ఎన్నికల విధులకు నియమించిన వారిలో కొందరు వ్యక్తిగత కారణాలతో మినహాయింపు కోరుతున్నారని, అయితే, అందుకు అవకాశం ఉండదని దానకిశోర్ శుక్రవారం స్పష్టం చేశారు. ఎన్నికల విధులు నిర్వహించాల్సిందేనని, ఆరోగ్యపరమైన కారణాలతో మాత్రం మినహాయింపు ఇచ్చేందుకు అవకాశం ఉన్నప్పటికీ, అందుకుగాను వైద్యపర కేసులను పరిశీలించేందుకు ప్రత్యేకంగా మెడికల్ బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఆరోగ్యపర అంశాలు, వారికి అవసరమైన వైద్యం, ఇప్పటికే తీసుకున్న చికిత్స వంటి అంశాలను పరిశీలించి మెడికల్ బోర్డు అనుమతిస్తే.. వారికి మాత్రం ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. వైద్యపరంగా ఎన్నికల విధులకు మినహాయింపు పొందేంత వరకు మాత్రం అందరూ ఎన్నికల శిక్షణ తరగతులకు హాజరుకావాల్సిందేనన్నారు. ఎన్నికల విధులకు నియమితులైన సిబ్బంది హాజరయ్యేలా సంబంధిత శాఖాధిపతులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లేనిపక్షంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి మేరకు వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధులకు గైర్హాజరయ్యే ఉద్యోగులపై ప్రజా ప్రాతినిధ్య చట్టం మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు ప్రాసిక్యూషన్ చేయాల్సి వస్తుందన్నారు. విధుల మినహాయింపుల కోసం ఎవరూ తన కార్యాలయానికి రావద్దని సూచించారు. -
పార్కులకు సొబగులు అద్దండి
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లోని 20 ప్రధాన జంక్షన్లు, ప్రధాన రహదారుల్లోని మీడియన్లను కొత్తగా ముస్తాబు చేయాలని, గన్‌పార్క్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ అధికారులను ఆదేశించారు. అర్బన్ బయోడైవర్సిటీ విభాగంపై గురువారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్‌లో 236 కిలోమీటర్ల విస్తీర్ణంలో 153 రోడ్లపై సెంట్రల్ మీడియన్లు ఉన్నాయని, వీటిలో వంద కిలోమీటర్ల మీడియన్లను మరింత ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలన్నారు. ముఖ్యంగా 20 ప్రధాన జంక్షన్లను సీఎస్సార్ నిధులతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని సూచించారు. 873 ల్యాండ్ స్కేప్ పార్కులు, 331 ట్రీ పార్కులు ఉన్నాయని, మరో 616 ఖాళీ స్థలాల్లో పార్కులు, ప్లాంటేషన్ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయన్నారు. పార్కుల అభివృద్దికి టెండర్ల ప్రక్రియ పూర్తయిన వాటి పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. ఇందిరా పార్కు, జూబ్లీహిల్స్‌లోని రాక్ గార్డెన్‌ను ఆధునిక రీతిలో అభివృద్ధి చేయాలని సూచించారు. ఇకపై ‘హరిత శుక్రవారం’ జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతి శుక్రవారం హరిత దినోత్సవంగా పాటిస్తున్నట్టు దానకిశోర్ తెలిపారు. ఇందులో భాగంగా జోనల్, డిప్యూటీ కమిషనర్లు విధిగా తమ పరిధిలోని పార్కులను సందర్శించి కాలనీ సంక్షేమ సంఘాలతో సమావేశమై వాటి అభివృద్ధిపై చర్చించాలని ఆదేశించారు. హరిత శుక్రవారంలో వివిధ వర్గాల నుంచి వచ్చే సలహాలు, సూచనలు పాటిస్తామన్నారు. హరితహారంలో భాగంగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 60 లక్షల మొక్కలను 56 నర్సరీల్లో పెంచుతున్నట్టు తెలిపారు. ఈసారి హరితహారంలో జీహెచ్ఎంసీకి 3 కోట్ల మొక్కల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిందని, నగరంలో ఉన్న 331 ట్రీ పార్కుల్లో విస్తృతంగా> మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్లు దాసరి హరిచందన, ఆమ్రపాలి, కృష్ణ, జోనల్ కమిషనర్లు శంకరయ్య, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇదిగో డిజైన్
సాక్షి,సిటీబ్యూరో: ప్రజా సమస్యల పరిష్కారానికి ‘సాక్షి’ చేపట్టిన జీహెచ్ఎంసీ కమిషనర్‌తో ‘ఫోన్ ఇన్’కు నగర పౌరుల నుంచి అనూహ్య స్పందన లభించింది. గురువారం నిర్ణీత సమయం కంటే ముందునుంచే నిర్విరామంగా ప్రజల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. అందరి ఫిర్యాదులు శ్రద్ధగా విన్న కమిషనర్ దానకిశోర్.. ఒకటికి రెండుసార్లు అడిగి వారి ప్రాంతం, ఫోన్ నంబర్ వంటి వివరాలు రాసుకున్నారు. తక్షణ చర్యల కోసం అవసరమైన పీటీఐఎన్, ఇతరత్రా రశీదుల నంబర్లూ అడిగారు. ఓవైపు ఫిర్యాదులు స్వీకరిస్తూనే మరోవైపు నిర్లక్ష్యం కనబరచిన ఇద్దరు అధికారులపై ఆయన చర్యలు తీసుకున్నారు. కాగా, 500 గజాల్లోపు స్థలంలో ఇళ్లు నిర్మించాలనుకునే యజమానుల కోసం ప్రత్యేక డిజైన్లు రూపొందించినట్లు చెప్పారు. ఇంటి నిర్మాణానికి పూనుకునేవారు జీహెచ్ఎంసీని సంప్రదించి సదరు విస్తీర్ణంలో ఎన్ని అంతస్తుల్లో ఇల్లు కట్టాలనుకుంటున్నారో చెబితే పలు రకరకాల డిజైన్లతో నమూనాలను అందజేస్తారన్నారు. వాటిలోతమకు నచ్చిన దాన్ని ఎంచుకునే వెసులుబాటు కల్పిస్తారు. ఆ మేరకు దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల్లోగా ఇంటి నిర్మాణ అనుమతి జారీ చేస్తారు. నిర్మాణం ప్రారంభించేటప్పుడు భూసార పరీక్షల కోసం మాత్రమే ఆర్కిటెక్ట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీ మొత్తం 4 వేల డిజైన్లు అందుబాటులోకి తేనుండగా తొలిదశలో 500 డిజైన్లు అందుబాటులో ఉంచనున్నారు. అంతే కాదు.. తమ దరఖాస్తు పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ‘ఫైల్ ట్రాకింగ్’ అవకాశం కూడా కల్పించనున్నారు. అందుకు త్వరలోనే ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తేనున్నట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం. దానకిశోర్ ‘సాక్షి’ ఫోన్ ఇన్ సందర్భంగా తెలిపారు. అక్రమ నిర్మాణాలు, టౌన్‌ప్లానింగ్‌లో రెడ్టేపిజంపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందడంపై స్పందించిన ఆయన ఈ విషయం వెల్లడించారు. ఈ యాప్ పనితీరు, డిజైన్లు, అనుమతులపై ప్రజలకు తగిన అవగాహన కల్పించేందుకు అన్ని జోన్లలో నెలలో ఒకరోజు అవగాహన దినం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీసీపీ, తదితర అధికారులు పాల్గొంటారని తెలిపారు. యాప్‌లో తమ దరఖాస్తు పరిస్థితి ఏంటో ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చునన్నారు. సంబంధిత జోనల్, డిప్యూటీ కమిషనర్లకు కూడా డ్యాష్‌బోర్డు ద్వారా ఫైల్ ట్రాకింగ్ తెలుస్తుందన్నారు. ‘ఫీడ్ ద నీడ్’ కు మరో యాప్ నగరంలో పేదల ఆకలి తీర్చేందుకు చేపట్టిన‘ఫీడ్ ద నీడ్’ను మరింత విస్తృతంగా అమలు చేసేందుకు ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తేనున్నట్లు కమిషనర్ దానకిశోర్ తెలిపారు. ఈ యాప్ ద్వారా ఆహారం అందజేయాలనుకునే వారు తమకు వివరాలు అందిచవచ్చన్నారు. దాంతోపాటు ఆకలితో అలమటించే అన్నార్తులు ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉన్నారో కూడా ప్రజలు తెలియజేయవచ్చునన్నారు. యాప్ ద్వారా అందే ఈ సమాచారంతో ప్రజలకు అవసరమైన ప్రాంతాల్లో ‘ఫీడ్ ది నీడ్’ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు మ్యాపింగ్ చేస్తామన్నారు. తద్వారా ఈ కేంద్రాలు ఎక్కడున్నాయో కూడా తెలుసుకోవచ్చునని ఆయన తెలిపారు. అవగాహనలో భాగంగా.. నగరంలో కొత్తగా ఇల్లు నిర్మించేవారికి.. ఫ్లాట్ కొనుగోలు చేసేవారికి.. ఎంత విస్తీర్ణంలో ఎన్ని అంతస్తుల భవనం నిర్మించవచ్చో అవగాహన సదస్సులో సందేహాలు తీరుస్తారు. భవన నిర్మాణ అనుమతుల కోసం ఎలాంటి డాక్యుమెంట్లు అందజేయాలి.. ఎంతమేర సెట్బ్యాక్లు వదలాలి వివరాలతో పాటు, ఫ్లాట్ కొనుగోలు సందర్భంగా జీహెచ్ఎంసీ నిర్దేశించిన నిబంధనలను సదస్సులో వివరిస్తారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈనెల 23వ తేదీన జరిగే సదస్సుకు 500 గజాలలోపు స్థలంలో ఇల్లు నిర్మించ దలచుకున్నవారు, 2 వేల చ.అ.లోపు ఫ్లాట్ కొనుగోలు చేసేవారు హాజరు కావచ్చన్నారు. నగరంలో ఏటా దాదాపు 16 వేల భవన నిర్మాణ అనుమతులు జారీ అవుతుండగా, వీటిలో 13 వేలు ఇండిపెండెంట్ ఇళ్లే ఉంటున్నాయి. ఆన్లైన్ ద్వారా అనుమతులతో పారదర్శకత పాటిస్తున్నప్పటికీ నియమ నిబంధనల గురించి తెలియజేసే వ్యవస్థ లేకపోవడంతో పాటు ప్రజల అవగాహన లోపంతో 10 శాతానికి పైగా దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయని కమిషనర్ దానకిశోర్ తెలిపారు. మధ్యవర్తులు, బ్రోకర్లను ఆశ్రయిస్తుండటంతో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయన్నారు. సదస్సులో భాగంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి సందేహాలను నివృత్తి చేస్తామన్నారు. ఇంటి నిర్మాణాలు చేయాలనుకునేవారు తమ స్థల వైశాల్యం, ఎన్ని అంతస్తులు నిర్మించే విషయం, సమర్పించే డాక్యుమెంట్లు తదితర అంశాలకు సంబంధించి ఆసక్తి పత్రాన్ని ఈ అవగాహన సదస్సులో అందజేస్తే వారికి నియమిత సమయంలోగా మార్గదర్శకాలు అందజేయనున్నట్టు చెప్పారు. 23వ తేదీన ఉదయం 10 గంటలకు ఈ అవగాహన సదస్సును మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభిస్తారని కమిషనర్ తెలిపారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం దేశంలో ఇదే ప్రథమమన్నారు. -
ఇంటింటికీ లెక్క
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్లో అధిక ఓటర్లు ఉన్న ఇళ్లను అధికారులు సర్వే చేయనున్నారు. ఒకే ఇంట్లో భారీ సంఖ్యలో ఓటర్లు ఉండడం.. అనేక ప్రాంతాల్లో బోగస్ ఓటర్ల నమోదు.. వీటిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు తొలగించలేదని రాజకీయ పార్టీల విమర్శల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం. దానకిశోర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఒకే ఇంట్లో అధిక సంఖ్యలో ఓటర్లున్న నివాసాలను ప్రత్యేకంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఒకే ఇంటి నంబర్‌పై 30 మంది, అంతకన్నా ఎక్కువగా ఉన్న ఓటర్లపై విచారణ చేయనున్నట్టు గురువారం ఓటరు నమోదు అధికారులు(ఈఆర్ఓ), సూపర్వైజర్లు, ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన తెలిపారు. జిల్లాలో కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితా సవరణ తదితర అంశాలను ఈ సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా దానకిషోర్ మాట్లాడుతూ.. నగరంలో ఒకే ఇంట్లో 30 మంది కన్నా ఎక్కువ మంది ఓటర్లున్న ఇళ్లను మరోమారు పరిశీలించాలన్నారు. తహసీల్దార్లతో ఈ సర్వే చేయనున్నట్టు తెలిపారు. బీఎల్ఓలు ఇంటింటినీ సర్వే చేస్తున్నప్పటికీ, ప్రతిసారి ఫిర్యాదులు వస్తున్నాయని, ఇకపై వాటికి ఆస్కారం లేకుండా చేయాలని తహసీల్దార్లకు బాధ్యతలు అప్పగిస్తున్నామన్నారు. 23నుంచి 25 వరకు ప్రచార కార్యక్రమం.. హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ, నూతన ఓటర్ల నమోదుకు అన్ని పోలింగ్ లొకేషన్లలో ఈనెల 23, 24, 25 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రతి పోలింగ్ కేంద్రంలో బూత్ స్థాయి అధికారులు సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉంటారని దానకిషోర్ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఈ నెల 20వ తేదీ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రచారం రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు బీఎల్ఓలు అందుబాటులో ఉంటారన్నారు. జిల్లా పరిధిలోని 84 మున్సిపల్ వార్డు కార్యాలయాల్లో క్లెయిమ్స్, కొత్త ఓటర్లు దరఖాస్తుల స్వీకరణకు సిబ్బందిని నియమించామన్నారు. 2019 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులన్నారు. ఆయా వార్డు కార్యాలయాల్లో జనవరి 25 వరకు ఏర్పాట్లు ఉంటాయన్నారు. అయితే, ఈ కేంద్రాల ద్వారా ఒకే వ్యక్తి అధిక సంఖ్యలో దరఖాస్తులు అందజేస్తే స్వీకరించరని స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల్లో 18 సంవత్సరాలు నిండిన వారిని ఓటర్లుగా నమోదు చేసేందుకు ఈఆర్ఓలు చైతన్య సమావేశాలను నిర్వహించాలని ఆదేశించారు. డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలతో పాటు మాల్స్‌లోను నూతన ఓటర్ల నమోదు దరఖాస్తులు వేసేందుకు డ్రాప్ బాక్స్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అవి జనవరి 20వ తేదీ వరకు ఉంటాయన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్లు ఆమ్రపాలి, అద్వైత్‌కుమార్ సింగ్, జయరాజ్ కెనెడీ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు. -
డంప్‌యార్డ్ క్యాపింగ్ రెండోదశ పనులు షురూ..
సాక్షి,సిటీబ్యూరో: జవహర్‌నగర్ క్యాపింగ్ రెండో దశపనులు ప్రారంభమయ్యాయి. జియోసింథటిక్ క్లేలైనర్ వేసే పనులు కొనసాగుతున్నాయి. 135 ఎకరాల విస్తీర్ణంలో 14మిలియన్ టన్నులకు పైగా ఘన వ్యర్థాలున్న జవహర్‌నగర్ డంప్‌యార్డ్ క్యాపింగ్ పనులను శుక్రవారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్, ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్ కల్యాణ్‌చక్రవర్తి, అడిషనల్ కమిషనర్ రవికిరణ్, రిటైర్డ్ సీసీఎఫ్ చటర్జీ తదితరులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా క్యాపింగ్ పనుల పురోగతి, చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ నిర్మాణం, డంపింగ్ యార్డ్‌లో ఎరువుల తయారీ, ప్లాస్టిక్ రీసైక్లింగ్, కాలుష్య జలాల (లీచెట్) శుద్ధి, క్యాపింగ్ పనులు, విద్యుత్ ప్లాంట్ ఏర్పాటులో ఎదురయ్యే సమస్యలు తదితర అంశాలపై రాంకీ ప్రతినిధి గౌతమ్‌రెడ్డి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమిషనర్‌కు వివరించారు. అతిపెద్ద డంపింగ్ యార్డు.. దేశంలోనే అతి పెద్దదైన డంప్‌యార్డ్ క్యాపింగ్ పనులు ఇప్పటి వరకు ఏ నగరంలోనూ చేపట్టలేదు. 625 చ.కి.మీ విస్తీర్ణం కలిగిన గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఉత్పత్తయ్యే చెత్తను మొత్తం 2002 నుంచి జవహర్‌నగర్‌లో వేస్తున్నారు. దీంతో జల, వాయు కాలుష్యాలు ఏర్పడి జవహర్‌నగర్‌తో పాటు పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు రోడ్లపై బైఠాయించి ఆందోళనలు కూడా చేపట్టారు. జవహర్‌నగర్ కాలుష్యంపై కొందరు గ్రీన్ ట్రిబ్యునల్‌లో కూడా కేసులు కూడా వేశారు. ప్రస్తుతం జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ నుంచి కాలుష్యం వెలువడకుండా చేసేందుకు మాజీ మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రూ. 144 కోట్లతో డంపింగ్‌యార్డ్ క్యాపింగ్ పనులకు అనుమతిఇస్తూ 2018 మార్చి లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మొ త్తం ఆరు దశల్లో చేపట్టే ఈ క్యాపింగ్ పనుల్లో మొ దటి దశ మట్టితో కప్పే ప్రక్రియ పూర్తయ్యింది. పరిసర గ్రామాలకు చెందిన చెరువుల నుంచి దాదాపు 6వేల టన్నుల బంకమట్టిని డంపింగ్‌యార్డ్‌పై కప్పివేయడంతో ఈ డంపింగ్‌యార్డ్ నుండి వచ్చే దుర్వాసన దాదాపు 90శాతం తగ్గింది. రెండో దశలో క్యాపింగ్‌లో రెండవ దశలో భాగంగా మట్టిపొరపై జియోసింథటిక్ క్లే లైనింగ్ పనులు ప్రారంభమయ్యాయి. 2019 జూన్ మాసాంతంలోగా క్యాపింగ్ పనులను పూర్తి చేయడం ద్వారా ఘన వ్యర్థపదార్థాల నిర్వహణ (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్) రంగంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దేశానికే మార్గదర్శకంగా నిలవనుంచి. హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సంస్థ ఈ పనులు నిర్వహిస్తోంది. డంపింగ్ యార్డ్ నుంచి వెలువడే విషద్రవాలు(లీచెట్)ను, మీథెన్ వాయువును బయటకు తీసేందుకు 152 బోరుబావులను వేయాల్సి ఉండగా వంద బోరుబావుల తవ్వకం పూర్తిచేశారు. 300 ఎంఎం వ్యాసార్థం గల పైపులతో కూడిన ఈ బోరుబావుల నుండి లీచెట్, విషవాయువులను వెలికి తీసి వాటిని కంటైనర్ల ద్వారా విద్యుత్ తయారీ, కాలుష్య జలాలను శుద్ధి చేయడం జరుగుతుందన్నారు. అనంతరం చెత్త ద్వారా ఎరువుల తయారీ యూనిట్, ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ లీచెట్ శుద్ధి మిషన్లు తదితర యూనిట్లను కమిషనర్ పరిశీలించారు. చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తిచేసే 20మెగా వాట్ల సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్ దసరాలోగా పూర్తి చేస్తామని రాంకీ ప్రతినిధులు పేర్కొన్నారు. క్యాపింగ్ ప్రక్రియ ఇలా అంతర్జాతీయ ప్రమాణాలు, శాస్త్రీయ పద్దతిలో డంప్‌యార్డు క్యాపింగ్ పనులను ఆరుదశల్లో చేపడతారు. తొలుత డంపింగ్ యార్డ్‌పై పూర్తిగా మట్టితో కవర్‌చేస్తారు. ఇదే సమయంలో డంపింగ్‌లోని విషవాయువులను బయటికి పంపడానికి 300ఎం.ఎం వ్యాసార్థం కల పైపులతో 20 మీటర్లలోతులో బోరుబావులను తవ్వుతారు. డంప్‌యార్డ్ నుండి వర్షపు నీటిని నేరుగా కిందికి జారేలా ఏటవాలుగా ఏర్పాటు చేస్తారు. అనంతరరం మట్టి పొరపై జియోసింథటిక్ క్లే లైనర్ ఏర్పాటు చేస్తారు. అనంతరం దానిపై నుంచి జియో కంపోజిట్ లేయర్‌ను ఏర్పాటు చేస్తారు. చివరగా 45 సెంటిమీటర్ల (ఒకటిన్నర అడుగు)మందంతో తిరిగి మట్టితో కూడిన పొరను ఏర్పాటు చేస్తారు. ఈ తుది మట్టి పొరపై గడ్డి, ఇతర మొక్కలు నాటడం జరుగుతుంది. మొత్తం డంపింగ్ క్రింది బాగం నుండి విషవాయువులు బయటికి రావడానికి వీలుగా క్యాపింగ్ అనంతరం డంప్‌యార్డ్‌పై బోరు బావుల మాదిరిగా పైపులైను చొప్పించి పై నుంచి సులభంగా వాయువులు వెళ్లేవిధంగా ఏర్పాట్లు చేస్తారు. అనంతరం వెలువడే వాయువులు, డంపింగ్ యార్డ్ నుండి వచ్చే విషద్రవాలు (లీచెట్)ను శుభ్రపరిచే వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. -
‘ప్రవర్తన’ అతిక్రమిస్తే చర్యలు తప్పవు
కొత్తగా ఓటర్లుగా నమోదైన వారికి ఉచితంగా ఎపిక్ కార్డుల పంపిణీ, మరో వైపు ఇంటింటికి ఓటరు స్లిప్‌ల పంపిణీ జరుగుతోంది. ఇప్పటికే లక్ష ఎపిక్ కార్డులు పంపిణీ చేశాం. మిగతా 1.71 లక్షల మందికి రెండుమూడు రోజుల్లో పంపిణీ చేస్తాం. సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఎన్నికల ప్రచారపర్వం ఊపందుకుంది. నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. అభివృద్ధి పథకాల మాటేమోగాని ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలనే ఎక్కువగా ఎక్కుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో నిబంధనలను ఉల్లంఘించి ఎవరు వ్యవహరించినా ఊరుకునే ప్రసక్తే లేదని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం. దానకిశోర్ స్పష్టం చేశారు. ప్రవర్తన నియమావళి నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఉల్లంఘనలకు సంబంధించి ఇప్పటికే దాదాపు 120 కేసులు నమోదు చేశామన్నారు. వీటిలో నిర్ణీత సమయం ముగిశాక ప్రచారం, ప్రసంగాలు కొనసాగించినవి.. ప్రసంగాల్లో ప్రత్యర్థులపై వ్యతిరేకంగా చేసినవి, నిరాధార ఆరోపణలు వంటివాటితో పాటు అనుమతి లేని పోస్టర్లు తదితరమైనవి ఉన్నాయన్నారు. ఎన్నికలకు సంబంధించి బుధవారం ‘సాక్షి’తో ఆయన ముఖాముఖి మాట్లాడారు. ఆ వివరాలు ఇవీ.. పెరిగిన అభ్యర్థులు..అదనంగా ఈవీఎంలు.. హైదరాబాద్ జిల్లాలో 15 నియోజకవర్గాలుండగా, పోటీ చేస్తున్న అభ్యర్థులు 15 మంది కంటే ఎక్కువ ఉన్న నియోజకవర్గాల్లో ఒక ఈవీఎం (బ్యాలెట్ యూనిట్) కంటే ఎక్కువ యూనిట్లు అవసరం. ఒక బ్యాలెట్ యూనిట్లో నోటా కాక 15 మంది అభ్యర్థుల వరకు అవకాశం ఉంటుంది. అలా ఖైరతాబాద్ నియోజకవర్గంలోని దాదాపు 240 పోలింగ్ కేంద్రాల్లో మూడేసి బ్యాలెట్ యూనిట్లు వాడాల్సి ఉంది. సనత్‌నగర్, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా మినహా మిగతా 11 నియోజకవర్గాల్లో రెండేసి బ్యాలెట్ యూనిట్లు వాడాలి. దీంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈవీఎంలు కాక అదనంగా దాదాపు 2,500 ఈవీఎంలు కావాల్సి ఉంది. 10 లక్షల గైడ్లు ♦ వెబ్ కెమెరాలతో పోలింగ్ ప్రత్యక్ష ప్రసారానికి దాదాపు 6500 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. ♦ దివ్యాంగుల రవాణా సదుపాయానికి150– 170 వాహనాలు వినియోగిస్తాం. ♦ ఎన్నికల విధుల్లోని వివిధ స్థాయిల్లోని వారికి ఒక విడత శిక్షణ పూర్తయింది. రెండో విడత శిక్షణ ఈ నెల 30, డిసెంబర్ 1న నిర్వహిస్తాం. ♦ బీఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో లేని దాదాపు 700 కేంద్రాల నుంచి ప్రసారానికి ఇంటర్నెట్ డాంగిల్స్ వినియోగిస్తాం. ♦ ఓటు ఎలా వేయాలో తెలియజేసే 10 లక్షల గైడ్లను త్వరలో పంపిణీ చేస్తాం. గుర్తింపు పత్రంతోనూ ఓటేయొచ్చు కొత్త నిబంధనలు, నిర్దిష్ట కార్యాచరణకనుగుణంగా డిసెంబర్ 2వ తేదీ వరకే ఓటరు స్లిప్‌ల పంపిణీ పూర్తి చేస్తాం. ఓటరు స్లిప్ అందని వారు, తమ ఓటరుకార్డుతో పోలింగ్ కేంద్రానికి వెళ్లవచ్చు. అదీ లేకపోయినా ఓటరు జాబితాలో పేరుంటే ఎన్నికల సంఘం నిర్ణయించిన గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకటి తీసుకువెళితే పోలింగ్‌కు అనుమతిస్తారు. ఓటరు కార్డు కావాలనుకునేవారు మీ సేవ కేంద్రాల్లో నిర్ణీత ఫీజు చెల్లించి వీటిని పొందవచ్చు, జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాల్లోనూ ఓటరుకార్డుల జారీని చేపట్టాలనుకున్నప్పటికీ, దాన్ని విరమించుకున్నాం. నిబంధనల ఉల్లంఘనలివీ.. మొత్తం కేసులు: 122 (107 ఎఫ్ఐఆర్, 13 పెట్టీ,మరో రెండింటికి కోర్టు ఉత్తర్వులు రావాల్సి ఉంది)మద్యం పట్టివేత : 14 కేసులు (రూ. 2,91,035 విలువైన1634.91 లీటర్లు.) నగదుకు సంబంధించి: 60 కేసులు (రూ.19,92,89,970 పట్టివేత.)ఇతరత్రా: 4 కేసులు. (సౌండ్స్పీకర్లు, 29 కిలోల వెండి, రూ, 2,90,000 విలువైన గుట్కా/పాన్‌మసాలా పట్టివేత.)తొలగించిన బ్యానర్లు, పోస్టర్లు : 54,370 సీ విజిల్ కేసులు.. మొత్తం ఫిర్యాదులు : 724 రిటర్నింగ్ ఆఫీసర్లు ఉపసంహరించినవి: 207 రిటర్నింగ్ ఆఫీసర్లు చర్యలు తీసుకున్నవి: 418 పురోగతిలో ఉన్నవి: 97 స్పష్టత కోసం పై అధికారులకు పంపించినవి: 2 -
బాస్ సీరియస్
సాక్షి, సిటీబ్యూరో: టౌన్‌ప్లానింగ్ విభాగంలో అక్రమాలు, నగరంలో ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై సిబ్బంది చర్యలు తీసుకోకపోవడంపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం. దానకిశోర్ సీరియస్ అయ్యారు. అక్రమ నిర్మాణం జరుగుతుందని తెలిసినప్పటికీ ఎందుకు అడ్డుకోవడంలేదని టౌన్‌ప్లానింగ్ ఉద్యోగులను ప్రశ్నించారు. పిల్లర్లు వేశాక శ్లాబ్ వేసేందుకు ఎంతో సమయం పడుతుందని, ఆలోగా ఎందుకు నిలువరించలేకపోతున్నారని నిలదీశారు. నిర్మాణం మొత్తం పూర్తయ్యేంతదాకా చోద్యం చూస్తూ మొక్కుబడి తంతుగా నోటీసులిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ‘ఎన్నికల వేళ.. అక్రమాల లీల’ శీర్షికతో ఇటీవల ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన అక్రమ నిర్మాణాలపై ఆయన స్పందించారు. గురువారం టౌన్‌ప్లానింగ్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన కమిషనర్ అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ సర్కిల్లో అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోలేకపోవడాన్ని ప్రస్తావించారు. సంబంధిత సెక్షన్ ఆఫీసర్ కోర్టు పనులంటూ చెప్పడంతో ‘రోజంతా కోర్టులోనే ఉంటారా?’ అంటూ దానకిశోర్ ప్రశ్నించారు. అదనపు అంతస్తుకు పిల్లర్లు వేశాక శ్లాబ్ పూర్తయ్యేలోపునే అడ్డుకోనందుకు మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేయవద్దంటూ ప్రశ్నించారు. తొలి సమావేశం కావడంతో ప్రస్తుతానికి మెమో జారీ చేయాల్సిందిగా సీసీపీకి సూచించారు. ఇకపై ఎవరు నిర్లక్ష్యం ప్రదర్శించినా సహించేది లేదని, అక్రమాలను అడ్డుకోవాల్సిన బాధ్యత టౌన్‌ప్లానింగ్ విభాగానిదేనని స్పష్టం చేశారు. టౌన్‌ప్లానింగ్ విభాగం నుంచే తనకు అత్యధిక ఫిర్యాదుల వస్తున్నాయంటూ అసహనం వ్యక్తం చేశారు. రోజుకు తనకు 30 ఫిర్యాదులు అందితే, వాటిలో 27 టౌన్‌ప్లానింగ్‌వే నంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై అక్రమ నిర్మాణాలు జరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. నిర్ణీత వ్యవధుల్లో తనిఖీలు చేయాల్సిందే.. భవననిర్మాణ అనుమతులు జారీ కాగానే, నిర్ణీత వ్యవధుల్లోగా తనిఖీలు చేసేందుకు తగిన విధానాన్ని రూపొందించాలని, తనిఖీలకు ఎప్పుడు వెళ్లాలనేది కూడా ఆన్లైన్లోనే ఆటోమేటిక్‌గా జనరేట్ అయ్యేలా తగిన ఏర్పాట్లు చేయాలని దానకిశోర్ సిబ్బందికి సూచించారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించి నోటీసుల జారీని కూడా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. తద్వారా ఎప్పుడు నోటీసులిచ్చారు.. తదుపరి ఏం చర్యలు తీసుకున్నారు.. అనే విషయాలు తెలుస్తాయన్నారు. మార్టిగేజ్ నిబంధనల్లేని 200 చ.మీ. లోపు నిర్మాణాల్లోనే అదనపు అంతస్తులు ఎక్కువగా వెలుస్తుండటాన్ని పరిగణనలోకి తీసుకొని వాటిపై ప్రత్యేక నిఘా వేయాలన్నారు. ఎన్నికల తరుణాన్ని ఆసరా చేసుకొని అక్రమనిర్మాణాలు జరుగకుండా తనిఖీ చేపట్టాలని, కూల్చివేతలకు వెనుకాడవద్దని స్పష్టం ఆయన చేశారు. అక్రమ నిర్మాణాలపై విజిలెన్స్ అస్త్రం ఇప్పటికే జరిగిన అక్రమ నిర్మాణాలు, అదనపు అంతస్తుల వివరాలను ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ విభాగానికి అందజేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. టౌన్‌ప్లానింగ్ సిబ్బందితో కలిసి విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు అక్రమ నిర్మాణాలను తొలగిస్తాయని పేర్కొన్నారు. అయితే నిరుపేదలు, చిరు వ్యాపారుల జోలికి పోవద్దని స్పష్టం చేశారు. కొంతమంది టౌన్‌ప్లానింగ్ అధికారులు, సిబ్బంది వల్లే సిటీలో అక్రమ నిర్మాణాలు వస్తున్నాయని పత్రికల్లో వస్తుండటాన్ని ప్రస్తావించారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించి సర్కిళ్ల వారీగా ఎన్ని అక్రమ నిర్మాణాలు, డీవియేషన్లు ఉన్నాయో, ఎన్నింటికి నోటీసులు జారీచేశారో, కోర్టు కేసులెన్ని ఉన్నాయో వివరాలను ఏరోజుకారోజు నమోదు చేసేందుకు సాఫ్ట్వేర్ రూపొందించి, ప్రతిరోజూ ఈ సమాచారం పొందుపరచాలన్నారు. సమావేశంలో చీఫ్ సిటీ ప్లానర్లు దేవేందర్‌రెడ్డి, శ్రీనివాసరావు, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి తదితరులు పాల్గొన్నారు. నిర్ణయాలు ఓకే.. అమలు సంగతి? అక్రమ నిర్మాణాలను ఆదిలోనే అడ్డుకోవాలని దాదాపు ఏడాది క్రితమే నిర్ణయించారు. అందులో భాగంగా అక్రమ నిర్మాణాలను ఎప్పటికప్పుడు కూల్చివేసేందుకు సర్కిల్, జోన్ల స్థాయిలో టౌన్‌ప్లానింగ్, విజిలెన్స్, తదితర విభాగాలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని భావించారు. కానీ అమలుకు నోచుకోలేదు. -
అది అమలు చేస్తే జలమండలికి భారం తగ్గుతుంది
సాక్షి, హైదరాబాద్ : విద్యుత్ బిల్లుల తగ్గింపు అమలు చేస్తే జలమండలికి భారం తగ్గుతుందని జీహెచ్ఎంసీ కమిషనర్, జలమండలి ఎండీ దాన కిషోర్ అన్నారు. గురువారం జలమండలిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గణేష్ నిమజ్జనం, మొహరం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. రూపాయి కనెక్షన్లు 35వేలు ఇచ్చామని, కనెక్షన్లు ఇవ్వటం ప్రస్తుతం ఆపేశామని తెలిపారు. పైపులైన్ వేయడానికి జీహెచ్ఎంసీ పర్మీషన్ అపేసిందని అన్నారు. అక్టోబర్ నుంచి మళ్లీ కనెక్షన్లను ఇస్తామని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న183 గ్రామాలకు జలమండలి ద్వారా నిరందిస్తామని చెప్పారు. తద్వారా జలమండలికి 128 లక్షల రూపాయలు ఆదాయం వస్తోందని అన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు వేస్తున్నామని పేర్కొన్నారు. కొన్నిచోట్ల భూవివాదాలు ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. అక్రమ నల్లా కనెక్షన్లపై విజిలెన్స్ దాడులు కొనసాగుతున్నాయని అన్నారు. ఇప్పటికే కేసులు బుక్ చేశామని తెలిపారు. కమర్షియల్ కనెక్షన్లపై దృష్టి పెట్టామని అన్నారు. 30 నుంచి 40 శాతానికి ట్యాంకర్లను తగ్గించామన్నారు. కేశవ పూర్ రిజర్వాయర్ టెండర్ పూర్తయిందని తెలిపారు. -
స్మార్ట్ పాలన... ‘బిగ్’ ప్లాన్
సాక్షి, సిటీబ్యూరో: ‘తెలంగాణ రాష్ట్రానికి గుండెలాంటి హైదరాబాద్‌ను ఇక్కడ సమృ ద్ధిగా ఉన్న వనరులు, ప్రజల సహకారంతో అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్తా. ప్రజా సమస్యల పరిష్కారానికి, నగర అభివృద్ధికి, పారదర్శక సేవలకు అధునాతన సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగిస్తా. అభివృద్ధి చెందిన దేశాల్లో వినియోగంలో ఉన్న బిగ్ డేటా అనలిటిక్స్‌తో సమస్య ఎక్కడ ఉందో సులభంగా గుర్తించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటా..’ అని జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ అన్నారు. బాధ్యతలు స్వీకరించాక తొలిసారి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వేగంగా అభివృద్ధి చెందుతున్న, వలసలతో పెరిగిపోతున్న హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు క్షేత్రస్థాయిలో తక్షణ సేవలందేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది నైపుణ్యాన్ని పెంచాల్సిన అవసరముందన్నారు. పౌర సేవలు, ఫిర్యాదుల పరిష్కారంలో అవినీతికి అస్కారం లేకుండా చూడటం ప్రధాన కర్తవ్యమని స్పష్టం చేశారు. ప్రజలకు ఆహ్లాదంగా.. ఎస్సార్డీపీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు తనముందున్న పెద్దప్రాజెక్టులు కాగా, చెరువుల సుందరీకరణ, ప్లేగ్రౌండ్స్, పార్కుల్ని ప్రజలకు ఆహ్లాదం కలిగించేలా తీర్చిదిద్దడంపై శ్రద్ధ వహిస్తానన్నారు. రహదారులపై గుంతల సమస్యపైనా దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. ఎంపిక చేసిన 23 చెరువుల సుందరీకరణకు ముంబైకి చెందిన కన్సల్టెంట్ నివేదిక అందాక పనులు చేపడతామన్నారు. టాయ్లెట్ల నిర్వహణలో సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్‌లకు భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పారు. పారిశుధ్య కార్యక్రమాల్లో జాతీయస్థాయితో పోలిస్తే మెరుగ్గానే ఉన్నప్పటికీ, మరింత మెరుగయ్యేందుకు తగిన చర్యలు తీసుకుంటానన్నారు. చెత్తను తడిపొడిగా వేరు చేయడం జాతీయస్థాయిలో దాదాపు 25 శాతం మాత్రమే ఉండగా, నగరంలో 50 శాతం ఉందన్నారు. ఈ–వేస్ట్, ప్లాస్టిక్ వ్యర్థాలు, వరదకాలువలపై శ్రద్ధ చూపుతానని చెప్పారు. సహకరించే పాలకవర్గం, అనుభవజ్ఞులైన అధికారులు, యువ ఐఏఎస్‌ల సమన్వయం, సహకారాలతో తగిన ప్రణాళికతో మెరుగైన ఫలితాలు సాధించగలనన్న ధీమా వ్యక్తం చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో ‘ప్రజావాణి’ ‘మైజీహెచ్ఎంసీ’ యాప్, తదితరమైన వాటిని మెరుగు పరుస్తానన్నారు. జీహెచ్ఎంసీ ద్వారా అందే ప్రజాసేవల్లో గడచిన నాలుగేళ్లలో ఎంతో మార్పు వచ్చినప్పటికీ,మరింత మెరుగుపరచేందుకు కృషి చేస్తానన్నారు. గత కమిషనర్ జ నార్దన్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగిస్తానని దానకిశోర్ పేర్కొన్నారు. థర్డ్‌పార్టీ ఫీడ్‌బ్యాక్.. వాటర్‌బోర్డులో మాదిరిగా సమస్య పరిష్కారమైందీ లేనిదీ, థర్డ్‌పార్టీ ద్వారా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటామన్నారు. చదివే అలవాటు పెంచేందుకు కాఫీషాప్స్లో బుక్స్ ఏర్పాటుపై దృష్టిసారిస్తానని పేర్కొన్నారు. చెత్త సమస్యలు తీవ్రం.. ప్రతి నగరానికీ చెత్త సమస్య తీవ్రంగా ఉందంటూ, ప్రస్తుతం ఒక్కో వ్యక్తి సగటున రోజుకు 500 గ్రాముల చెత్త వెలువరిస్తుండగా, భవిష్యత్‌లో ఇది 1500 గ్రాములకు పెరగనుందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఎక్కడికక్కడ ఖాళీ ప్రదేశాల్లో చెత్త నిర్వహణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చెత్తనుంచి విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యతనిస్తామన్నారు. -
జీహెచ్ఎంసీ కమిషనర్‌గా దానకిశోర్
సాక్షి, హైదరాబాద్ : రాజధానిలో పనిచేస్తున్న ముగ్గురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎండీగా పనిచేస్తున్న ఎం.దానకిశోర్‌ను జీహెచ్ఎంసీ కమిషనర్‌గా, జీహెచ్ఎంసీ కమిషనర్‌గా పనిచేస్తున్న బి.జనార్ధన్‌రెడ్డిని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) కమిషనర్‌గా నియమించారు. హెచ్ఎండీఏ కమిషనర్‌గా పని చేస్తున్న టి.చిరంజీవులును రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్ కమిషనర్‌గా బదిలీ చేశారు. దానకిశోర్‌కు అదనంగా ప్రస్తుతం పనిచేస్తున్న హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎండీ బాధ్యతలతో పాటు మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బాధ్యతలు కూడా అప్పగించారు. -
నీటి కష్టాలకు ‘యాప్’ చెక్
► 2న లాంఛనంగా ప్రారంభం.. ► 9 సమస్యల తక్షణ పరిష్కారానికి శ్రీకారం ► గ్రేటర్లో 24 గంటల నీటిసరఫరా! ► నల్లాల క్రమబద్ధీకరణకు ఆగస్టు 31 వరకు గడువు ► 1 నుంచి మీటర్ల ఏర్పాటుపై డ్రైవ్.. ► ‘మీట్‌ది ప్రెస్’లో జలమండలి ఎండీ దానకిశోర్ సాక్షి,సిటీబ్యూరో: కలుషిత జలాలు.. పైప్లైన్లు, వాల్వ్ లీకేజీ, మురుగు.. ఇలా తొమ్మిది రకాల సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు ఆగస్టు రెండు నుంచి ప్రత్యేక ‘మొబైల్ యాప్’ అందుబాటులోకి రానుందని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ తెలిపారు. దీనికి ‘ఆపరేషన్స్ అండ్ మెయిన్టెనెన్స్ మానిటరింగ్ మొబైల్ యాప్’గా నామకరణం చేశామన్నారు. శనివారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ‘మీట్‌ది ప్రెస్’లో ఆయన వివరాలు వెల్లడించారు. సమావేశంలో బోర్డు డైరెక్టర్లు సత్యనారాయణ, రామేశ్వర్రావు, శ్రీధర్‌బాబు, రవీందర్‌రెడ్డి, ఎల్లాస్వామి ఉన్నారు. ఎండీ మాట్లాడుతూ.. ఈ యాప్ గ్రేటర్ పరిధిలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సుమారు 3 వేల మంది లైన్మెన్ల చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్లలో ఉంటుందన్నారు. వారు రోజువారీగా తాము పనిచేస్తున్న పరిధిలో తమ పరిశీలనకు వచ్చిన సమస్యలు, వినియోగదారులు తెలిపిన సమస్యలను తమ వద్దనున్న మొబైల్ఫోన్లలో ఫొటో తీసి ఈ యాప్‌లో కనిపించే 9 బటన్స్‌లో సంబంధిత ఫిర్యాదు బటన్‌పై ప్రెస్ చేస్తారన్నారు. దీని ద్వారా ఏకకాలంలో ఈ సమాచారం సంబంధిత సెక్షన్ మేనేజర్, డీజీఎం, జీఎం, సీజీఎం, ఎండీ, కేంద్ర కార్యాలయంలో ఉండే కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రానికి తక్షణం తెలుస్తుందన్నారు. తద్వారా కొన్ని గంటల వ్యవధిలో ఆ సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. పరిష్కరించే సమస్యలివే.. మొబైల్ యాప్ తెరపై 9 రకాల సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా బటన్స్ ఉం టాయి. అవి.. 1. క్లోరిన్ లేని నీళ్లు 2.వాల్వ్ లీకేజీలు, 3.పైపులైన్ల లీకేజీ, 4.కలుషిత జలాలు, 5. పొంగుతున్న మురుగు, 6.మూతలు లేని మ్యాన్‌హోళ్లు, 7.నీటి బిల్లు అందకపోవడం, 8. మీటర్ కావాలని వినియోగదారుడు కోరడం/మీటర్ లేకపోవడం, 9. అక్రమ న ల్లా కనెక్షన్. పరిశీలనలో 24 గంటల నీటిసరఫరా.. ప్రస్తుతం కృష్ణా మూడు దశలు, గోదావరి పథకం, సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటి నిల్వలు పెరిగినందున నీటి లభ్యత 600 మిలియన్ గ్యాలన్లుగా ఉందని ఎండీ తెలిపారు. అయితే 24 గంటల పాటు నీటిసరఫరా అందించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. మహానగరంలో అన్ని ప్రాంతాలకు 24 గంటల పాటు నీరందించేందుకు అవసరమైన పైప్‌లైన్ వ్యవస్థ అందుబాటులో లేదని, నగరంలో వెయ్యి కిలోమీటర్ల మార్గంలో పురాతన మంచినీటి పైపులైన్లను మార్చాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు. నల్లాల క్రమబద్ధీకరణకు అవకాశం గ్రేటర్ పరిధిలో అక్రమ నల్లాల క్రమబద్ధీకరణకు ఆగస్టు 31 వరకు అవకాశం కల్పించినట్టు ఎండీ దానకిషోర్ తెలిపారు. ఈ గడువులోగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి కేవలం నల్లా కనెక్షన్ చార్జీలు చెల్లించి తమ కనెక్షన్‌ను క్రమబద్ధీకరించుకోవచ్చని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో సెప్టెంబరు 1 నుంచి కనెక్షన్ చార్జీలు రెట్టింపు చేస్తామని స్పష్టం చేశారు. అక్రమ నల్లాలపై సమాచారం అందించిన పౌరులకుSఅక్రమార్కుల నుంచి వసూలు చేసే రెట్టింపు కనెక్షన్ చార్జీల్లో 25 శాతం ప్రోత్సాహకంగా అందజేస్తామన్నారు. 80 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకుని, రూ.2 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన బీపీఎల్ కుటుంబాలకు కేవలం ఒక్క రూపాయి చెల్లిస్తే వారి నల్లా కనెక్షన్‌ను క్రమబద్దీకరిస్తామని తెలిపారు. మీటర్లు లేని నల్లాలు 6 లక్షలు.. గ్రేటర్ పరిధిలో 8.76 లక్షల నల్లా కనెక్షన్లు ఉండగా ఇందులో 6 లక్షల నల్లాలకు మీటర్లు లేవని ఎండీ తెలిపారు. ప్రతి నల్లాకు మీటర్ ఏర్పాటు ద్వారా బోర్డు రెవెన్యూ ఆదాయం గణనీయంగా పెంచుకోవడంతో పాటు వినియోగదారులకు అధిక నీటి బిల్లుల మోత లేకుండా చూసేందుకు ఆగస్టు ఒకటి నుంచి మీటర్ల ఏర్పాటుకు నగర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్టు తెలిపారు. ఒకసారి రూ.1500 చెల్లించి మీటర్ ఏర్పాటు చేసుకుంటే నాలుగేళ్లపాటు వాడుకున్న నీటికే బిల్లు చెల్లించే వెసులుబాటు వినియోగదారులకు దక్కుతుందన్నారు. సెప్టెంబరు 30 లోగా నీటి మీటర్లు ఏర్పాటు చేసుకుంటే నెలవారీ నీటిబిల్లులో 5 శాతం రాయితీ లభిస్తుందని, లేకుంటే అక్టోబరు నుంచి రెట్టింపు బిల్లు చెల్లించాలన్నారు.