డంప్‌యార్డ్‌ క్యాపింగ్‌ రెండోదశ పనులు షురూ.. | GHMC Works Speedup on Jawahar Nagar Dumping Cap | Sakshi
Sakshi News home page

డంప్‌యార్డ్‌ క్యాపింగ్‌ రెండోదశ పనులు షురూ..

Published Sat, Jan 12 2019 10:30 AM | Last Updated on Sat, Jan 12 2019 10:30 AM

GHMC Works Speedup on Jawahar Nagar Dumping Cap - Sakshi

క్యాపింగ్‌ పనులను పరిశీలిస్తున్న జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌

సాక్షి,సిటీబ్యూరో:  జవహర్‌నగర్‌ క్యాపింగ్‌ రెండో దశపనులు ప్రారంభమయ్యాయి. జియోసింథటిక్‌ క్లేలైనర్‌ వేసే పనులు కొనసాగుతున్నాయి. 135 ఎకరాల విస్తీర్ణంలో 14మిలియన్‌ టన్నులకు పైగా ఘన వ్యర్థాలున్న జవహర్‌నగర్‌ డంప్‌యార్డ్‌ క్యాపింగ్‌ పనులను శుక్రవారం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిషోర్, ఈపీటీఆర్‌ఐ  డైరెక్టర్‌ జనరల్‌ కల్యాణ్‌చక్రవర్తి, అడిషనల్‌ కమిషనర్‌ రవికిరణ్, రిటైర్డ్‌ సీసీఎఫ్‌ చటర్జీ తదితరులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా క్యాపింగ్‌ పనుల పురోగతి, చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ నిర్మాణం, డంపింగ్‌ యార్డ్‌లో ఎరువుల తయారీ, ప్లాస్టిక్‌ రీసైక్లింగ్, కాలుష్య జలాల (లీచెట్‌) శుద్ధి, క్యాపింగ్‌ పనులు, విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటులో ఎదురయ్యే సమస్యలు తదితర అంశాలపై రాంకీ  ప్రతినిధి గౌతమ్‌రెడ్డి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా కమిషనర్‌కు వివరించారు.  

అతిపెద్ద డంపింగ్‌ యార్డు..
దేశంలోనే అతి పెద్దదైన డంప్‌యార్డ్‌ క్యాపింగ్‌ పనులు ఇప్పటి వరకు ఏ నగరంలోనూ చేపట్టలేదు.  625 చ.కి.మీ విస్తీర్ణం  కలిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో ఉత్పత్తయ్యే చెత్తను మొత్తం 2002 నుంచి జవహర్‌నగర్‌లో వేస్తున్నారు. దీంతో జల, వాయు కాలుష్యాలు ఏర్పడి జవహర్‌నగర్‌తో పాటు పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు రోడ్లపై బైఠాయించి  ఆందోళనలు కూడా చేపట్టారు. జవహర్‌నగర్‌ కాలుష్యంపై కొందరు గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో కూడా కేసులు కూడా వేశారు.  ప్రస్తుతం జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డ్‌ నుంచి కాలుష్యం వెలువడకుండా చేసేందుకు మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.  ఈ నేపథ్యంలో  రూ. 144 కోట్లతో డంపింగ్‌యార్డ్‌ క్యాపింగ్‌ పనులకు అనుమతిఇస్తూ 2018 మార్చి లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మొ త్తం ఆరు దశల్లో చేపట్టే ఈ క్యాపింగ్‌ పనుల్లో మొ దటి దశ మట్టితో కప్పే ప్రక్రియ పూర్తయ్యింది. పరిసర గ్రామాలకు చెందిన చెరువుల నుంచి దాదాపు 6వేల టన్నుల బంకమట్టిని డంపింగ్‌యార్డ్‌పై కప్పివేయడంతో ఈ డంపింగ్‌యార్డ్‌ నుండి వచ్చే దుర్వాసన దాదాపు 90శాతం తగ్గింది.

రెండో దశలో
 క్యాపింగ్‌లో రెండవ దశలో భాగంగా మట్టిపొరపై జియోసింథటిక్‌ క్లే లైనింగ్‌ పనులు ప్రారంభమయ్యాయి. 2019 జూన్‌ మాసాంతంలోగా క్యాపింగ్‌ పనులను పూర్తి చేయడం ద్వారా ఘన వ్యర్థపదార్థాల నిర్వహణ (సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌) రంగంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ దేశానికే మార్గదర్శకంగా నిలవనుంచి.  హైదరాబాద్‌ ఇంటిగ్రేటెడ్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ ఈ పనులు నిర్వహిస్తోంది. డంపింగ్‌ యార్డ్‌ నుంచి వెలువడే విషద్రవాలు(లీచెట్‌)ను, మీథెన్‌ వాయువును బయటకు తీసేందుకు 152 బోరుబావులను వేయాల్సి ఉండగా వంద బోరుబావుల తవ్వకం పూర్తిచేశారు. 300 ఎంఎం వ్యాసార్థం గల పైపులతో కూడిన ఈ బోరుబావుల నుండి లీచెట్, విషవాయువులను వెలికి తీసి వాటిని కంటైనర్ల ద్వారా విద్యుత్‌ తయారీ, కాలుష్య జలాలను శుద్ధి చేయడం జరుగుతుందన్నారు. అనంతరం చెత్త ద్వారా ఎరువుల తయారీ యూనిట్, ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ యూనిట్‌ లీచెట్‌ శుద్ధి మిషన్లు తదితర యూనిట్లను కమిషనర్‌ పరిశీలించారు. చెత్త నుండి విద్యుత్‌ ఉత్పత్తిచేసే 20మెగా వాట్ల సామర్థ్యం గల విద్యుత్‌ ప్లాంట్‌ దసరాలోగా పూర్తి చేస్తామని రాంకీ  ప్రతినిధులు పేర్కొన్నారు.  

 క్యాపింగ్‌ ప్రక్రియ ఇలా
అంతర్జాతీయ ప్రమాణాలు, శాస్త్రీయ పద్దతిలో డంప్‌యార్డు క్యాపింగ్‌ పనులను ఆరుదశల్లో చేపడతారు. తొలుత డంపింగ్‌ యార్డ్‌పై పూర్తిగా మట్టితో కవర్‌చేస్తారు. ఇదే సమయంలో డంపింగ్‌లోని విషవాయువులను బయటికి పంపడానికి 300ఎం.ఎం వ్యాసార్థం కల పైపులతో 20 మీటర్లలోతులో బోరుబావులను తవ్వుతారు. డంప్‌యార్డ్‌ నుండి వర్షపు నీటిని నేరుగా కిందికి జారేలా ఏటవాలుగా ఏర్పాటు చేస్తారు.  అనంతరరం మట్టి పొరపై జియోసింథటిక్‌ క్లే లైనర్‌ ఏర్పాటు చేస్తారు. అనంతరం దానిపై నుంచి జియో కంపోజిట్‌ లేయర్‌ను ఏర్పాటు చేస్తారు. చివరగా 45 సెంటిమీటర్ల (ఒకటిన్నర అడుగు)మందంతో తిరిగి మట్టితో కూడిన పొరను ఏర్పాటు చేస్తారు. ఈ తుది మట్టి పొరపై గడ్డి, ఇతర మొక్కలు నాటడం జరుగుతుంది. మొత్తం డంపింగ్‌ క్రింది బాగం నుండి విషవాయువులు బయటికి రావడానికి వీలుగా క్యాపింగ్‌ అనంతరం డంప్‌యార్డ్‌పై బోరు బావుల మాదిరిగా పైపులైను చొప్పించి పై నుంచి సులభంగా వాయువులు వెళ్లేవిధంగా ఏర్పాట్లు చేస్తారు. అనంతరం వెలువడే  వాయువులు,  డంపింగ్‌ యార్డ్‌ నుండి వచ్చే విషద్రవాలు (లీచెట్‌)ను శుభ్రపరిచే వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement