సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్‌లో అధిక ఓటర్లు ఉన్న ఇళ్లను అధికారులు సర్వే చేయనున్నారు. ఒకే ఇంట్లో భారీ సంఖ్యలో ఓటర్లు ఉండడం.. అనేక ప్రాంతాల్లో బోగస్ ఓటర్ల నమోదు.. వీటిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు తొలగించలేదని రాజకీయ పార్టీల విమర్శల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం. దానకిశోర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఒకే ఇంట్లో అధిక సంఖ్యలో ఓటర్లున్న నివాసాలను ప్రత్యేకంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఒకే ఇంటి నంబర్‌పై 30 మంది, అంతకన్నా ఎక్కువగా ఉన్న ఓటర్లపై విచారణ చేయనున్నట్టు గురువారం ఓటరు నమోదు అధికారులు(ఈఆర్‌ఓ), సూపర్‌వైజర్లు, ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన తెలిపారు. జిల్లాలో కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితా సవరణ తదితర అంశాలను ఈ సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా దానకిషోర్ మాట్లాడుతూ.. నగరంలో ఒకే ఇంట్లో 30 మంది కన్నా ఎక్కువ మంది ఓటర్లున్న ఇళ్లను మరోమారు పరిశీలించాలన్నారు. తహసీల్దార్లతో ఈ సర్వే చేయనున్నట్టు తెలిపారు. బీఎల్‌ఓలు ఇంటింటినీ సర్వే చేస్తున్నప్పటికీ, ప్రతిసారి ఫిర్యాదులు వస్తున్నాయని, ఇకపై వాటికి ఆస్కారం లేకుండా చేయాలని తహసీల్దార్లకు బాధ్యతలు అప్పగిస్తున్నామన్నారు.
23నుంచి 25 వరకు ప్రచార కార్యక్రమం..
హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ, నూతన ఓటర్ల నమోదుకు అన్ని పోలింగ్ లొకేషన్లలో ఈనెల 23, 24, 25 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రతి పోలింగ్ కేంద్రంలో బూత్ స్థాయి అధికారులు సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉంటారని దానకిషోర్ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఈ నెల 20వ తేదీ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రచారం రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు బీఎల్‌ఓలు అందుబాటులో ఉంటారన్నారు. జిల్లా పరిధిలోని 84 మున్సిపల్ వార్డు కార్యాలయాల్లో క్లెయిమ్స్, కొత్త ఓటర్లు దరఖాస్తుల స్వీకరణకు సిబ్బందిని నియమించామన్నారు.
2019 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులన్నారు. ఆయా వార్డు కార్యాలయాల్లో జనవరి 25 వరకు ఏర్పాట్లు ఉంటాయన్నారు. అయితే, ఈ కేంద్రాల ద్వారా ఒకే వ్యక్తి అధిక సంఖ్యలో దరఖాస్తులు అందజేస్తే స్వీకరించరని స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల్లో 18 సంవత్సరాలు నిండిన వారిని ఓటర్లుగా నమోదు చేసేందుకు ఈఆర్‌ఓలు చైతన్య సమావేశాలను నిర్వహించాలని ఆదేశించారు. డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలతో పాటు మాల్స్‌లోను నూతన ఓటర్ల నమోదు దరఖాస్తులు వేసేందుకు డ్రాప్ బాక్స్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అవి జనవరి 20వ తేదీ వరకు ఉంటాయన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్లు ఆమ్రపాలి, అద్వైత్‌కుమార్ సింగ్, జయరాజ్ కెనెడీ హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment