సాక్షి, సిటీబ్యూరో: లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. పోలింగ్ విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ సిద్ధమయ్యారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో శిక్షణ ఇచ్చినప్పటికీ, కొందరు అధికారులు, సిబ్బంది అవగాహన లోపంతో పొరపాట్లు చేశారు. తిరిగి అలాంటి ఘటనలు లోక్‌సభ ఎన్నికల్లో పునరావృతం కాకుండా పూర్తిస్థాయి శిక్షణనివ్వాలని భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే దాదాపు పదివేల మంది పోలింగ్ అధికారులు, అసిస్టెంట్ పోలింగ్ అధికారులకు ఆది, సోమవారాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. మొత్తం ఎనిమిది కేంద్రాల్లో రోజుకు రెండు షిఫ్టుల్లో ఈ శిక్షణ ఉంటుంది.
అందరూ విధుల్లో పాల్గొనాల్సిందే..
ఎన్నికల విధులకు నియమించిన వారిలో కొందరు వ్యక్తిగత కారణాలతో మినహాయింపు కోరుతున్నారని, అయితే, అందుకు అవకాశం ఉండదని దానకిశోర్ శుక్రవారం స్పష్టం చేశారు. ఎన్నికల విధులు నిర్వహించాల్సిందేనని, ఆరోగ్యపరమైన కారణాలతో మాత్రం మినహాయింపు ఇచ్చేందుకు అవకాశం ఉన్నప్పటికీ, అందుకుగాను వైద్యపర కేసులను పరిశీలించేందుకు ప్రత్యేకంగా మెడికల్ బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఆరోగ్యపర అంశాలు, వారికి అవసరమైన వైద్యం, ఇప్పటికే తీసుకున్న చికిత్స వంటి అంశాలను పరిశీలించి మెడికల్ బోర్డు అనుమతిస్తే.. వారికి మాత్రం ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. వైద్యపరంగా ఎన్నికల విధులకు మినహాయింపు పొందేంత వరకు మాత్రం అందరూ ఎన్నికల శిక్షణ తరగతులకు హాజరుకావాల్సిందేనన్నారు. ఎన్నికల విధులకు నియమితులైన సిబ్బంది హాజరయ్యేలా సంబంధిత శాఖాధిపతులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లేనిపక్షంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి మేరకు వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధులకు గైర్హాజరయ్యే ఉద్యోగులపై ప్రజా ప్రాతినిధ్య చట్టం మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు ప్రాసిక్యూషన్ చేయాల్సి వస్తుందన్నారు. విధుల మినహాయింపుల కోసం ఎవరూ తన కార్యాలయానికి రావద్దని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment