సాక్షి, సిటీబ్యూరో: ఇంతలో ఎంత మార్పు..ఆరు నెలల్లోనే ఓటరు మనోగతం మారిందా అంటే..అవుననే అన్పిస్తోంది గురువారం నాటి లోక్‌సభ ఎన్నికల ఫలితాలను గమనిస్తే. గత అక్టోబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఏకపక్ష ఓటు వేసిన నగర ఓటరు..సరిగ్గా ఆర్నెళ్ల తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పుతో రాజకీయ నేతలందరినీ ఆశ్చర్యపరిచారు. నగరంలోని నాలుగు లోక్‌సభ స్థానాల పరిధిలోనూ శాసనసభ–లోక్‌సభ ఫలితాలన్నీ తారుమారయ్యాయి. మంత్రుల నియోజకవర్గాల్లోనూ టీఆర్‌ఎస్ కారు జోరు ఒక్కసారిగా తగ్గిపోయింది.
మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో టీఆర్‌ఎస్ విజయం సునాయాసమేనని భావించినా ఎల్బీనగర్, మల్కాజిగిరి, ఉప్పల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు మెజారిటీ రావటంతో ఆ పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖరరెడ్డి ఓటమి పాలయ్యారు. ఈ మూడు నియోజకవర్గాల్లో కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు భారీ మెజారిటీలతో విజయం సాధించినా లోక్‌సభకు వచ్చే సరికి సీన్ రివర్స్ అయింది. ఎల్బీనగర్‌లో కాంగ్రెస్‌కు ఏకంగా 27వేల పైచిలుకు మెజారిటీ రావటం కారు జోరుకు బ్రేకులేసింది. టీఆర్‌ఎస్‌కు కేవలం మేడ్చల్, కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లిలోనే స్వల్ప మెజారిటీ వచ్చింది.
సికింద్రాబాద్‌లో సీన్ రివర్స్
సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంలోనూ సీన్ రివర్స్‌గా మారింది. టీఆర్‌ఎస్‌కు నాంపల్లి, జూబ్లీహిల్స్ నియోజకవర్గాలు మినహా మరెక్కడా ఆధిక్యం రాలేదు. అంబర్‌పేటలో బీజేపీ భారీ మెజారిటీ సాధించగా, మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ టీఆర్‌ఎస్ వెనుకబడింది. మైనారిటీ ఓటర్లు అధికంగా ఉన్న జూబ్లీహిల్స్, నాంపల్లిలోనే టీఆర్‌ఎస్‌కు ఆధిక్యత
వచ్చింది. ఇక చేవెళ్ల లోక్‌సభ పరిధిలోకి వచ్చే శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌లలో శాసనసభ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీతో పోలిస్తే లోక్‌సభకు వచ్చే సరికి టీఆర్‌ఎస్‌కు నామమాత్రం మెజారిటీలే వచ్చాయి. శేరిలింగంపల్లిలో తొమ్మిది వేల పైచిలుకు, రాజేంద్రనగర్‌లో28 వేలు, మహేశ్వరంలో 27 వేల మెజారిటీలు నమోదయ్యాయి.
మంత్రుల ఇలాకాలో..
♦ సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని సనత్‌నగర్ నియోకజవర్గంలో బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డికి ఏకంగా 18867 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈ నియోకజవర్గం నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రాతినిథ్యం వహిస్తుండటం విశేషం.
♦ మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలోని మేడ్చల్ శాసనసభ స్థానంలో శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 80 వేలకు పైగా మెజారిటీ రాగా, తాజా ఎన్నికల్లో మాత్రం 8087 ఓట్ల మెజారిటీ మాత్రమే టీఆర్‌ఎస్ అభ్యర్థి రాజశేఖరరెడ్డికి వచ్చింది. ఈ నియోజకవర్గం నుంచి మంత్రి చామకూర మల్లారెడ్డి కేబినెట్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment