మొదటి విడత ‘మిషన్’ పనుల పరిశీలన
వరంగల్ : మిషన్ కాకతీయ మొదటి విడతలో భాగంగా పూర్తయిన చెరువుల మరమ్మతుల పనులను మైనర్ ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు పరిశీలించారు. మొదటి విడతలో జిల్లాలో 1,068 పనులను చేపట్టారు. అందులో 774 చెరువుల పనులు పూర్తయినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నారు. రెండో విడత పనులు ప్రారంభం కావడంతో మొదటి విడత పనులు ఏ మేరకు పూర్తయ్యాయన్న అంశాన్ని క్షేత్ర స్థాయిలో తెలుసుకునేందుకు రాష్ట్ర స్థాయి అధికారులు ఎస్‌ఈ(హైడ్రాలజీ) మధుకర్‌రాజు, గోదావరి బేసిన సీఈ నాగేందర్‌రావు జిల్లాలోని పలు మండలాల్లో శుక్ర, శనివారాల్లో పర్యటించారు.
వరంగల్ డివిజన్‌లోని వర్ధన్నపేట మండలం సింగారంలోని పల్లె చెరువు, వరంగల్‌లోని దామెర చెరువు, స్టేషన్ ఘన్‌పూర్ రాఘవపురంలోని ఊర చెరువు, జనగామ మండలం వడ్లకొండలోని ఊర చెరువులను మిషన్ జిల్లా ఇంచార్జ్ మధుకర్‌రావు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినట్లు వరంగల్ ఈఈ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
కాగా, సీఈ నాగేందర్‌రావు ములుగు డివిజన్‌లోని పలు మండలాల్లో పరిశీలించారు. అనంతరం సీఈ వరంగల్ సర్కిల్ కార్యాలయంలో మైనర్ ఇరిగేషన్ అధికారులతో శనివారం సమావేశమై మిషన్ రెండో విడత పనుల పురోగతిపై సమీక్షించారు. సమావేశంలో ఎస్‌ఈ విజయ్‌భాస్కర్‌రావు, డీఎస్‌ఈ శ్రావణ్, ఈఈలు గోపాలరావు, రత్నం, రాంప్రసాద్, టెక్నికల్ డీఈ రఘుపతి, డీఈఈలు వెంకటేశ్వర్లు, పల్లంరాజు, కిర ణ్ పాల్గొన్నారు.