వరుణ గండం!
♦ రెండోవిడత మిషన్ కాకతీయకు ఇబ్బందులు
♦ పనులు మొదలు పెట్టగానే అందుకున్న వానలు
♦ చెరువులోకి చేరుతున్న నీరు.. పూడికతీతకు ఆటంకం
♦ వర్షాలు ఇలాగే కొనసాగితే నిలిచిపోనున్న పనులు
ఇది యాచారం మండలం చింతపట్లలోని లక్ష్మణ్‌చెరువు. 150 ఎకరాల విస్తీర్ణం. గతేడాది ఆలస్యంగా మిషన్ కాకతీయ తొలివిడత పనులు చేపట్టారు. వర్షాలు కరవడం, మట్టిని రైతులు తీసుకెళ్లకపోవడంతో పనులు సగమే అయ్యాయి. తాజాగా అదే చెరువులో తిరిగి పనులు చేపట్టారు. ఈ పనులు కొనసాగుతుండగానే మళ్లీ వర్షాలు కురవడంతో పనులు నిలిచిపోయాయి. దీంతో తొలివిడత లక్ష్యం.. మరోమారు వాయిదాపడినట్లైంది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మిషన్ కాకతీయ రెండోవిడత ఇబ్బందుల్లో పడింది. అకాల వర్షాలు ముందస్తుగా రావడంతో పనులకు ఆటంకం ఏర్పడింది. ఫలితంగా నిర్దే శించిన గడువులోగా పూర్తిస్థాయిలో పనులు చేపట్టడం కష్టంగా మారుతోంది. జిల్లాలో రెండో విడత మిషన్ కాకతీయ కింద 562 చెరువుల్ని పునరుద్ధరించాలని యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులిస్తూ పునరుద్ధరణ పనులకోసం రూ.204.33 కోట్లు కేటాయించింది. దీంతో చర్యలు ప్రారంభించిన నీటి పారుదల శాఖ 550 చెరువులకు టెండర్లు పిలిచింది.
290 చెరువుల్లోనే పనులు..
చెరువుల పునరుద్ధరణ, మరమ్మతులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తికావడంతో నీటిపారుదల విభాగం పనులు మొదలు పెట్టింది. ఈక్రమంలో ఇప్పటివరకు 290 చెరువుల్లో పనులు ప్రారంభించినట్లు ఆ శాఖ ఇంజినీర్లు చెబుతున్నారు. వాస్తవానికి రెండో విడత చెరువుల పూడికతీత పనులన్నీ ఏప్రిల్‌లోనే మొదలై మే నెలలోపు పూర్తికావాలి. కానీ టెండర్ల ప్రక్రియలో నెలకొన్న జాప్యంతో పనుల ప్రారంభం ఆలస్యమైంది. ఫలితంగా ఇప్పటివరకు సగం చెరువుల్లో మాత్రమే పనులు ప్రారంభించారు. తాజాగా క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో మూడు, నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి.
గతంలో ఎన్నడూ లేనంతగా శుక్రవారం తెల్లవారుజామున జిల్లావ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఈ వర్షం దాటికి చిన్నపాటి కుంటలు నీటితో కళకళలాడుతుండగా.. చెరువుల్లోనూ నీరు చేరింది. దీంతో అక్కడక్కడ చేపట్టిన మిషన్ పనులకు ఆటకం కలిగింది. కనిష్టంగా నాలుగు రోజులవరకూ ఆ చెరువుల జోలికి వేళ్లే పరిస్థితి లేకపోవడంతో నీటిపారుదల ఇంజినీర్లు పనులకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. ఒకట్రెండు రోజుల్లో మళ్లీ వానలు కురిస్తే.. పనులన్నీ స్తంభించిపోయే అవకాశం ఉంది.