pudikatita
-
సాగరం సగమైంది!
సాక్షి, హైదరాబాద్: ఉత్తర తెలంగాణ వరప్రదాయిని, లక్షల ఎకరాలకు సాగునీరు అందించే శ్రీరాం సాగర్ జలాశయానికి గడ్డు రోజులు వచ్చాయి. రిజర్వాయర్‌లో ఏటేటా పూడిక పెరిగిపోయి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నీటి నిల్వ సామర్థ్యం ఇప్పటికే దాదాపు సగానికి తగ్గిపోవ డంతో ఆయకట్టుకు సాగునీరు ఇవ్వడం ప్రశ్నార్థకంగా మారుతోంది. శ్రీరాంసాగర్ జలాశయం నిర్మించినప్పుడు 112 టీఎంసీలుగా ఉన్న నిల్వ సామర్థ్యం.. ప్రస్తుతం 59.94 టీఎంసీలకు తగ్గిపోయిందని.. దీనికితోడు ఏటా 0.5 టీఎంసీల నుంచి 0.7 టీఎంసీల మేర పూడిక పేరుకుం టోందని తాజాగా నిర్వహించిన అధ్యయనం తేల్చింది. కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ), రిమోట్ సెన్సింగ్ డైరెక్టరేట్, ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్లు సంయుక్తంగా ఈ ‘శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ (ఎస్ఆర్ఎస్)’ సర్వే చేశాయి. 2020 నవంబర్– 2021 మే మధ్య జలాశయంలో గరిష్ట, కనిష్ట నీటి మట్టాల పరిస్థితిని సెంటినల్ 1ఏ/ఏబీ ఉపగ్రహాల మైక్రోవేవ్ డేటా ఆధారంగా పరిశీలించి.. పూడిక పరిస్థితి, నిల్వ సామర్థ్యాన్ని గుర్తించాయి. స్టోరేజీకి ‘డెడ్’.. లైవ్కూ గండి! తెలంగాణలో గోదావరి నదిపై గ్రావిటీ ఆధారంగా నిర్మించిన ఏకైక జలాశయం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు. జలాశయం నిర్మించినప్పుడు గరిష్ట నిల్వ సామర్థ్యం 112 టీఎంసీలు. అందులో డెడ్ స్టోరేజీ (అడుగున ఉండి వినియోగించుకోవడానికి వీల్లేని నీళ్లు) 30 టీఎంసీలు పోగా.. వాడుకోగలిగినవి 82 టీఎంసీలు. ప్రస్తుతం సుమారు 52 టీఎంసీల మేర పూడిక పేరుకుపోయింది. అంటే 30 టీఎంసీల డెడ్ స్టోరేజీతోపాటు వాడుకోగలిగిన 22.06 టీఎంసీల లైవ్ స్టోరేజీ సామర్థ్యాన్ని కూడా జలాశయం కోల్పోయిందని ఎస్ఆర్ఎస్ నివేదిక స్పష్టం చేస్తోంది. పూడిక తొలగించే గేట్లే.. కూరుకుపోయాయ్ గోదావరి నదిలో ఎగువన మహారాష్ట్ర నుంచి జూలై రెండో వారంలో వరదలు మొదలై.. అక్టోబర్ వరకు కొనసాగుతాయి. ఈ సమయంలో నీటిని విడుదల చేయడానికి శ్రీరాంసాగర్ జలాశయానికి 42 వరద గేట్లతోపాటు పూడికను తొలగించే 6 రివర్స్ స్లూయిస్ గేట్లను కూడా ఏర్పాటు చేశారు. డెడ్ స్టోరేజీ జోన్‌కి మించి చేరిన పూడికను ఈ గేట్లను ఎత్తివేయడం ద్వారా తొలగించవచ్చు. మొదట్లో ఈ స్లూయిస్ గేట్లను ఎత్తడానికి ప్రయత్నించి, విఫలం కావడంతో వదిలేశారు. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆపరేట్ చేయలేదు. పూడిక పేరుకుపోవడానికి ఇదికూడా ప్రధాన కారణం. ప్రస్తుతం స్లూయిస్ గేట్లు పూర్తిగా మట్టిలో కూరుకుపోయాయి. లక్షల ఎకరాలకు నీరిచ్చేలా.. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడు వద్ద గోదావరి నదిపై 112 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టును చేపట్టారు. 1963 జూలై 26న నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దీనికి శంకుస్థాపన చేయ గా.. 1978లో నిర్మాణం పూర్తయింది. దీనికింద 18 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటల ఆయకట్టును ప్రతిపాదించగా.. 16 లక్షల ఎకరాల స్థిరీకరణ జరి గింది. మరో 2లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించాల్సి ఉంది. ఈ రిజర్వాయర్‌కు అనుబంధంగా 36 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాన్ని కూడా నిర్మించారు. రిజర్వాయర్ నుంచి మూడు ప్రధాన కాల్వలు ఉన్నాయి. ∙శ్రీరాంసాగర్ ప్రధాన కాల్వ కాకతీయ కెనాల్. 9 వేల క్యూసెక్కుల సామర్థ్యమున్న ఈ కాల్వ ద్వారా నే నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో 9 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుంది. దీని ద్వారానే లోయర్ మానేరు డ్యాం (ఎల్ఎండీ) కి 10 టీఎంసీల మేర నీటిని తరలిస్తున్నారు. ∙500 క్యూసెక్కుల సామర్థ్యమున్న లక్ష్మి కాల్వ ద్వారా నిజామాబాద్ జిల్లాలో 25 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. ∙1000 క్యూసెక్కుల సామర్థ్యమున్న సరస్వతి కాల్వ కింద నిర్మల్ జిల్లాలో 35 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ∙ఎస్సారెస్పీ మిగులు జలాలను తరలించే వరద కాల్వ సామర్థ్యం 24 వేల క్యూసెక్కులు. దీనికింద 2.20లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. పూడిక వేగం పెరుగుతోంది ఈ జలాశయం ఏటా పూడిక వల్ల సగటున 0.5 టీఎంసీల మేర నిల్వ సామర్థ్యాన్ని కోల్పోతూ వస్తోంది. 1970–1994 మధ్య ఏటా 0.53%, 1994–2013 మధ్య ఏటా 0.4%, 2013– 2021 మధ్య ఏటా 0.71% నిల్వ సామర్థ్యాన్ని నష్ట పోయి నట్టు సర్వేలు గుర్తించాయి. అంటే జలాశయం పూడుకుపోతున్న వేగం కొన్నేళ్లుగా బాగా పెరుగు తోందని తేల్చాయి. ఇది ఇలాగే కొనసాగితే భవిష్య త్తులో రాష్ట్రానికి భారీ నష్టమే కలగనుంది. ప్రాజెక్టుపై ఆధారపడిన 18 లక్షల ఎకరాల ఆయకట్టు భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. ∙ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఫలాలు సంపూర్ణంగా అందాలన్నా శ్రీరాంసాగర్ జలాశయా న్ని పరిరక్షించుకోవాల్సిందేనని నిపుణులు చెప్తున్నా రు. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు సమీపంలోకి.. అక్కడి నుంచి వరద కాల్వ మీదుగా 3 లిఫ్టులతో శ్రీరాంసాగర్‌ను నింపడానికి ప్రభుత్వం ఎస్సారెస్పీ పునర్జీవన పథకాన్ని చేపట్టింది. శ్రీరాంసాగర్ పూడు కుపోతే ఈ పథకం లక్ష్యం సైతం నెరవేరదు. భవిష్య త్తులో తాగునీటి అవసరాలకే ఈ ప్రాజెక్టు పరిమితం కావాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఏటేటా తగ్గుతున్న సామర్థ్యం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం ఏటేటా పడిపోతూనే ఉంది. ప్రాజెక్టు నిర్వహణ రికార్డుల ప్రకారం ఏటా సగటున 0.8 టీఎంసీల పూడిక వచ్చి చేరుతోంది. 1994లో ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ లేబొ రేటరీస్ (ఏపీఈఆర్‌ఎల్) సర్వే చేసి.. ఈ రిజర్వాయర్ నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలకు తగ్గిపోయినట్టు పేర్కొంది. అయితే అంతకుముందు, తర్వాత చేసిన సర్వేల్లో.. నిల్వ సామర్థ్యం మరింతగా పడిపోయినట్టు వెల్లడైంది. ఆ సర్వేలను.. తాజా ఎస్ఆర్ఎస్ గణాంకాలను సీడబ్ల్యూసీ పోల్చి చూసింది. ఆయా సర్వేల్లో తేల్చిన వివరాలివీ.. పూడికను నివారించేదిలా? జలాశయాల్లో పూడికను తొలగించడం అత్యంత ఖర్చుతో కూడిన పని. ఆ ఖర్చుతో కొత్త జలాశయమే నిర్మించవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే తక్కువ ఖర్చు, సులువుగా జలాశయాల్లో పూడిక చేరకుండా నివారించవచ్చని సీడబ్ల్యూసీ చెప్తోంది. తమ నివేదికలో పలు సిఫారసులు చేసింది. అడవుల నిర్మూలన, చెట్ల నరికివేతతో వరదల వేగం పెరిగి జలాశయాల్లో పూడిక చేరుతుంది. దీనిని అడ్డుకోవాలి. పరీవాహక ప్రాంతాల్లో విస్తృతంగా అడవులు, చెట్లను పెంచాలి. నదీ తీరాల్లో రివిట్మెంట్లు, చెట్లతో పరీవాహక ప్రాంతం కోతకు గురికాకుండా రక్షణ చర్యలు చేపట్టాలి. నదుల్లో ఎక్కడికక్కడ నీళ్లను నిల్వ చేసేలా కాంటూర్ గుంతలు, చెక్ డ్యాంలు, చిన్న రిజర్వాయర్లు నిర్మిస్తే వరదల వేగం తగ్గి.. పెద్ద జలాశయాల్లోకి పూడిక రాదు. వ్యవసాయ పద్ధతుల్లోనూ మార్పు తేవాలి. భూమిని దున్ని వదిలేస్తే వేగంగా కోతకు గురై నదుల్లోకి మట్టి చేరుతుంది. రిజర్వాయర్లలోకి రాక ముందే మధ్యలోనే ఎక్కడికక్కడ పూడికను తొలగించాలి. నదుల ప్రవాహ మార్గాల్లో భూ ఉపరితలం కోతకు గురికాకుండా చర్యలు చేపట్టాలి. -
నవ్విపోదురుగాక..!
♦ కాసులవర్షం కురిపిస్తున్న నీరు-చెట్టు పథకం ♦ వాగుల్లో పూడికతీత పనులకు ఎగబడుతున్న నేతలు ♦ రూ.5లక్షల్లోపు పనులు నామినేషన్‌పై కేటాయింపు ♦ 15శాతం మొత్తంతో పనులు ముగిస్తున్న వైనం ♦ మిగతా దాంట్లో అధికారులకు 30శాతం పర్సంటేజీ సాక్షి ప్రతినిధి, కడప: నవ్విపోదురుగాక...నాకేటి సిగ్గు అన్నట్లుగా అధికారపార్టీ నేతలు, అధికారులు కుమ్మక్కై నీరు-చెట్టు పథకాన్ని దోచుకుంటున్నారు. కాంట్రాక్టర్లకు కాసులవర్షం కురిపించడమే లక్ష్యంగా పనులు సాగుతున్నాయి. భూగర్భజల సంరక్షణ చర్యలు అటుంచితే, పైసల కోసమే పనులు చేస్తున్నట్లుగా తేటతెల్లమౌతోంది. నీరు-చెట్టు పనుల ద్వారా కాస్తయిన ప్రయోజనం ఉండేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ కాంట్రాక్టర్ల కోసమే పనులు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. బుగ్గవంక మధ్యలో చేసిన పనులే ఇందుకు నిదర్శనం. చట్టానికి లోబడే పాలకపక్షం తెలివిగా జేబులు నింపుకొంటున్న వైనమిది. కడప నగరంలో బుగ్గవంక గురించి తెలియని వారుండరు. కడపను రెండు భాగాలుగా ఆ వంక చీల్చింది. గతంలోనే బుగ్గవంక సుందరీకరణ పనులు చేపట్టారు. ఆ కారణంగా ప్రస్తుతం 80 మీటర్లు నుంచి 100 మీటర్లు వెడల్పుతో వంక విస్తరించి ఉంది. ఈ వంకపై తమ్ముళ్ల కన్నుపడింది. వంక మధ్యలో నీరు-చెట్టు పనులు మొదలుపెట్టారు. భూగర్భ జలసంరక్షణ చర్యలు చేపట్టే క్రమంలో ప్రభుత్వం ఆ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే తెలుగుతమ్ముళ్లు ‘నీరు-చెట్టు’ పథకాన్ని కల్పతరువుగా మల్చుకుంటున్నారు. వారికి అధికారులు పక్కాగా సహకరిస్తున్నారు. వంద మీటర్లు వెడల్పు ఉన్న బుగ్గవంక మధ్యలో ఓ కాలువ తీస్తూ ప్రజాధనం లూఠీ చేస్తున్నారు. ఇదివరకే జమ్ముతో పేరుకుపోయిన ప్రాంతాన్ని జేసీబీతో బాగుచేయడం, కాలువగా రూపురేఖలు తేవడంతో పనిముగుస్తోంది. అయితే తూతూమంత్రపు వ్యవహారం కోసం దాదాపు రూ.69 లక్షలు ఖర్చుపెట్టి బుగ్గవంకలో తొలివిడతగా పనులు చేపట్టారు. నామినేషన్‌పై చేజిక్కించుకుంటూ.. నీరు-చెట్టు పనులను అధిక శాతం నామినేషన్‌పై తెలుగుతమ్ముళ్లకు అప్పగిస్తున్నారు. రూ.5 లక్షలు వరకూ నామినేషన్‌పై కేటాయిస్తూ పనులు సంఖ్యను పెంచుతున్నారు. ఈక్రమంలో చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు పడుతునే కాంట్రాక్టర్లకు నాలుగు రూకలు మిగిలిస్తూ తద్వారా లబ్ధి పొందేందుకు అధికారులు యత్నిస్తున్నారు. రూ.5లక్షల పనిని జెసీబీ ద్వారా రూ.75వేలతో కాంట్రాక్టర్ పూర్తిచేస్తున్నారు. తక్కిన మొత్తం అటు అధికారులకు 30శాతం పర్శేంటేజీలకు, ఇటు కాంట్రాక్టర్లు జేబుల్లోకి వెళ్తుతోంది. మునుపెన్నడూ ఇంతటి అధ్వానపు పనులు చేపట్టలేదని ప్రజలు వాపోతున్నారు. వర్షమొస్తే బుగ్గవంకలో నిలిచి ఉన్న నీర ంతా కొట్టుకుపోతుంది. అలాంటిది నిలిచిన నీటిని తరలించే క్రమంలో బుగ్గవంకలో ప్రత్యేక కాలువ ఏర్పాటు చేస్తున్నారు. వాస్తవానికి దిగువ వైపు నుంచి పనులు చేస్తే కనీసం నిలిచిన నీరైనా వెళ్లిపోయేది. ఎర్రముక్కపల్లె ఎగువ భాగాన నీరు నిలిచే అవకాశమే లేదు. అలాంటి చోట కాలువ తీయడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. రవీంద్రనగర్ దిగువన పనులు చేసిఉంటే మురికి నీరు నిల్వ లేకుండా వెళ్లిపోయి, కాస్తయిన ప్రయోజనం ఉండేదని స్థానికులు పేర్కొంటున్నారు కొనసాగుతోన్న దోపిడీ.... జిల్లాలో 1,776 పనులు రూ.100 కోట్లతో నీరు-చెట్టు కింద ప్రస్తుతం పనులు చేపడుతున్నారు. ఇప్పటికే 536 పనులు పూర్తయ్యాయి. పేరుకే జలసంరక్షణ పనులు, నాయకుల దోపిడీకే అధిక ప్రాధాన్యం దక్కుతోంది. నాడు కాంగ్రెస్ పార్టీ నేతలుగా మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సాన్నిహిత్యంతో లబ్ధి పొంది, నేడుటీడీపీ నేతలుగా కొనసాగుతోన్న ఆ సోదరులు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వారి కనుసన్నల్లోనే నీరు-చెట్టు దోపిడీ సాగుతున్నట్లు సమాచారం. అధికారులు వారి సిఫార్సులకు తలొగ్గి ఇష్టానుసారంగా పనులు కేటాయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలుగు తమ్ముళ్ల జేబులు నింపేందుకే... బుగ్గవంకలో తీసే మధ్య కాలువ తమ్ము ళ్ల జేబులు నింపేందుకే. ఎక్కడైన చెరువులు, కుంటల్లో పూడిక తొలగిస్తే ఉపయోగం ఉంటుంది. ఎందుకు పనిరాని పనులు చేస్తూ కోట్లు దోపిడీ చేయడం దారుణం. ఆ నిధులను బుగ్గవంక సైడుగోడల కోసం ఖర్చుపెడితే కొంతవరకన్నా మేలు చేకూరేది. బుగ్గవంకలోని గుర్రపు డెక్క తొలగింపు చేయాల్సిన పనిలేదు. వర్షం వస్తే ఆ నీళ్లకు కొట్టుకుపోతుంది. ఇలా నిధులు స్వాహా చేస్తుంటే అధికారులు నిద్రపోతున్నారా? అని ప్రశ్నిస్తున్నాం. - జి చంద్ర, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఇది దోపిడీ పథకం నీరు-చెట్టు పూర్తిగా దోపిడీ పథకం. దీ నిని టీడీపీ నేతలే తప్పుబడుతున్నారు. బుగ్గవంకలో పూడికతీయాలని సీపీఎం తరపున పోరాటాలు చేస్తే స్పందించని అధికారులు, ఇలా నిధులు దండుకునేం దుకు అనుమత్విడంలోని మతలబు ఏమి టో అర్థం కావడంలేదు. గుర్రపు డెక్క తొలగింపునకు కోట్లు ఖర్చుచేస్తారా? ఈ నిధులు మరొకదానికి ఖర్చు చేసి ఉంటే ప్రయోజనం ఉండేది. ప్రజాధనం దుబారా తప్ప ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడని కార్యక్రమం. - ఒ శివశంకర్, నగర కార్యదర్శి,సీపీఎం తాత్కాలిక పనుల వల్ల ఒరిగేది శూన్యం... బుగ్గవంకలో నీరు-చెట్టు కింద చేసే తాత్కాలిక పనుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. తెలుగు తమ్ముళ్ల జేబులు నింపడానికే ఈ పనులు చేస్తున్నారు తప్పా ప్రజలకు ఉపయోగం లేదు. మళ్లీ నీళ్లు వచ్చి చెత్తాచెదారం పేరుకుపోతుంది. చెరువుల్లో పూడికతీసి, ఆనకట్టలను అభివృద్ధి చేస్తే భూగర్భజలాలు పెరుగుతాయి. చెరువుల్లో తవ్విన మట్టిని కూడా టీడీపీ నాయకులు అమ్ముకోవడం దారుణం. - బి. నిత్యానందరెడ్డి, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు. -
వరుణ గండం!
♦ రెండోవిడత మిషన్ కాకతీయకు ఇబ్బందులు ♦ పనులు మొదలు పెట్టగానే అందుకున్న వానలు ♦ చెరువులోకి చేరుతున్న నీరు.. పూడికతీతకు ఆటంకం ♦ వర్షాలు ఇలాగే కొనసాగితే నిలిచిపోనున్న పనులు ఇది యాచారం మండలం చింతపట్లలోని లక్ష్మణ్చెరువు. 150 ఎకరాల విస్తీర్ణం. గతేడాది ఆలస్యంగా మిషన్ కాకతీయ తొలివిడత పనులు చేపట్టారు. వర్షాలు కరవడం, మట్టిని రైతులు తీసుకెళ్లకపోవడంతో పనులు సగమే అయ్యాయి. తాజాగా అదే చెరువులో తిరిగి పనులు చేపట్టారు. ఈ పనులు కొనసాగుతుండగానే మళ్లీ వర్షాలు కురవడంతో పనులు నిలిచిపోయాయి. దీంతో తొలివిడత లక్ష్యం.. మరోమారు వాయిదాపడినట్లైంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా: మిషన్ కాకతీయ రెండోవిడత ఇబ్బందుల్లో పడింది. అకాల వర్షాలు ముందస్తుగా రావడంతో పనులకు ఆటంకం ఏర్పడింది. ఫలితంగా నిర్దే శించిన గడువులోగా పూర్తిస్థాయిలో పనులు చేపట్టడం కష్టంగా మారుతోంది. జిల్లాలో రెండో విడత మిషన్ కాకతీయ కింద 562 చెరువుల్ని పునరుద్ధరించాలని యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులిస్తూ పునరుద్ధరణ పనులకోసం రూ.204.33 కోట్లు కేటాయించింది. దీంతో చర్యలు ప్రారంభించిన నీటి పారుదల శాఖ 550 చెరువులకు టెండర్లు పిలిచింది. 290 చెరువుల్లోనే పనులు.. చెరువుల పునరుద్ధరణ, మరమ్మతులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తికావడంతో నీటిపారుదల విభాగం పనులు మొదలు పెట్టింది. ఈక్రమంలో ఇప్పటివరకు 290 చెరువుల్లో పనులు ప్రారంభించినట్లు ఆ శాఖ ఇంజినీర్లు చెబుతున్నారు. వాస్తవానికి రెండో విడత చెరువుల పూడికతీత పనులన్నీ ఏప్రిల్‌లోనే మొదలై మే నెలలోపు పూర్తికావాలి. కానీ టెండర్ల ప్రక్రియలో నెలకొన్న జాప్యంతో పనుల ప్రారంభం ఆలస్యమైంది. ఫలితంగా ఇప్పటివరకు సగం చెరువుల్లో మాత్రమే పనులు ప్రారంభించారు. తాజాగా క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో మూడు, నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా శుక్రవారం తెల్లవారుజామున జిల్లావ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఈ వర్షం దాటికి చిన్నపాటి కుంటలు నీటితో కళకళలాడుతుండగా.. చెరువుల్లోనూ నీరు చేరింది. దీంతో అక్కడక్కడ చేపట్టిన మిషన్ పనులకు ఆటకం కలిగింది. కనిష్టంగా నాలుగు రోజులవరకూ ఆ చెరువుల జోలికి వేళ్లే పరిస్థితి లేకపోవడంతో నీటిపారుదల ఇంజినీర్లు పనులకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. ఒకట్రెండు రోజుల్లో మళ్లీ వానలు కురిస్తే.. పనులన్నీ స్తంభించిపోయే అవకాశం ఉంది. -
శరవేగంగా చెరువుల పూడికతీత
♦ మొదటి విడతలో 885 పూర్తి ♦ చెరువులు నిండితే లక్ష ఎకరాలకు సాగునీరు ♦ రెండో విడతలో 1,741 చెరువుల లక్ష్యం ♦ ‘మిషన్ కాకతీయ’కు ఏడాది మొదటి విడత ఇలా..జిల్లాలోని మొత్తం చెరువులు వీటి కింద ఉన్న ఆయకట్టు 2.52 లక్షల ఎకరాలు మిషన్ కాకతీయ-1 లక్ష్యం 1,869 చెరువులు ఆయకట్టు లక్ష్యం 1.04 లక్షల ఎకరాలు కేటాయించిన నిధులు రూ.362.96 కోట్లు ప్రతిపాదనలు పంపిన చెరువులు పూడికతీతకు ప్రభుత్వ అనుమతి పనులు ప్రారంభమైనవి పనులు పూర్తి అయినవి సాక్షి, సంగారెడ్డి: భారీ నీటిపారుదల ప్రాజెక్టులు లేని మెతుకుసీమకు చెరువులు, కుంటలే ఆధారం. జిల్లా సాగునీటి రంగానికి గుండెకాయలాంటి ఇవి దశాబ్దాలుగా నిరాదరణకు గురయ్యాయి. ఫలితంగా వీటిలో పూడిక పెరిగి ఆయకట్టు క్రమంగా తగ్గుముఖం పట్టింది. గత ప్రభుత్వాలు మైనర్ ఇరిగేషన్‌కు ప్రాధాన్యత ఇస్తామని చెప్పినా కార్యాచరణకు నోచుకోలేదు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం చెరువులు, కుంటలకు పూర్వవైభవం తెచ్చేందుకు ‘మిషన్ కాకతీయ’కు శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా చెరువులు, కుంటల్లో పూడికతీతలు, మత్తడి మరమ్మతులు చేపట్టారు. కార్యక్రమం ప్రారంభించి ఏడాది పూర్తయ్యింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా కావటం, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో మిషన్ కాకతీయలో జిల్లాకు పెద్దపీట లభించింది. జిల్లాలో మొదటి విడతలో 1,693 చెరువుల పనులకు 885 పూర్తికాగా, ఏప్రిల్ నెలాఖరుకు మిగతా పనులు పూర్తి కానున్నాయి. రెండో విడతలో 1,741 చెరువులను పునరుద్ధరించాలని లక్ష్యం. ఇరిగేషన్‌శాఖ అధికారులు ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇదిలా ఉంటే మొదటి విడతలో 885 చెరువుల పూడికతీత పనులు పూర్తయినప్పటికీ దురదృష్టవశాత్తు ఈ ఏడాది వర్షాలు ముఖం చాటేశాయి. చెరువులు నిండిన పక్షంలో జిల్లాలో అదనంగా లక్ష ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. 1,693 చెరువుల పూడిక తీత మిషన్ కాకతీయతో చెరువు, చేను.. రెండింటికీ మేలు జరుగుతోంది. చెరువులో పూడిక తొలగిపోగా, పూడికమట్టిని రైతులు స్వచ్ఛందంగా పొలాల్లోకి తరలించారు. చెరువుపై ఆధారపడిన మత్స్య కార్మికులు సైతం మిషన్ కాకతీయ పనులతో సంతోషపడుతున్నారు. జిల్లాలో మొత్తం 7,972 చెరువులున్నాయి. వీటి కింద 2.52 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. మిషన్ కాకతీయ మొదటి విడతలో 1.04 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలుగా రూ.362.96 కోట్లతో 1869 చెరువుల పూడికతీత పనులు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే 1812 చెరువుల పూడికతీతకు ప్రతిపాదనలు పంపగా.. 1693 వాటికి ప్రభుత్వం అనుమతించింది. వీటిలో 885 చెరువుల్లో పూడికతీత పనులు పూర్తయ్యాయి. మిగతా చెరువుల పనులు వచ్చే నెలాఖరుకు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. రెండో విడతలో.. మిషన్ కాకతీయ రెండో విడతలో భాగంగా జిల్లాలో రూ.200 కోట్లతో 1741 చెరువుల పూడికతీత పనులు చేపట్టనున్నారు. అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు అందజేశారు. మంత్రి హరీశ్‌రావు గజ్వేల్, సిద్దిపేటలో రెండో విడత మిషన్ కాకతీయ పనులకు శ్రీకారం చుట్టారు. ఇటీవల నారాయణఖేడ్‌లో ఇరిగేషన్ పనులపై సమీక్ష జరిపిన మంత్రి.. రైతులు, ప్రజాప్రతినిధులు, అన్నివర్గాల వారిని కలుపుకుని రెండో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.