♦ మొదటి విడతలో 885 పూర్తి
♦ చెరువులు నిండితే లక్ష ఎకరాలకు సాగునీరు
♦ రెండో విడతలో 1,741 చెరువుల లక్ష్యం
♦ ‘మిషన్ కాకతీయ’కు ఏడాది
మొదటి విడత ఇలా..జిల్లాలోని మొత్తం చెరువులు వీటి కింద ఉన్న ఆయకట్టు 2.52 లక్షల ఎకరాలు మిషన్ కాకతీయ-1 లక్ష్యం 1,869 చెరువులు ఆయకట్టు లక్ష్యం 1.04 లక్షల ఎకరాలు కేటాయించిన నిధులు రూ.362.96 కోట్లు ప్రతిపాదనలు పంపిన చెరువులు పూడికతీతకు ప్రభుత్వ అనుమతి పనులు ప్రారంభమైనవి పనులు పూర్తి అయినవి
సాక్షి, సంగారెడ్డి: భారీ నీటిపారుదల ప్రాజెక్టులు లేని మెతుకుసీమకు చెరువులు, కుంటలే ఆధారం. జిల్లా సాగునీటి రంగానికి గుండెకాయలాంటి ఇవి దశాబ్దాలుగా నిరాదరణకు గురయ్యాయి. ఫలితంగా వీటిలో పూడిక పెరిగి ఆయకట్టు క్రమంగా తగ్గుముఖం పట్టింది. గత ప్రభుత్వాలు మైనర్ ఇరిగేషన్‌కు ప్రాధాన్యత ఇస్తామని చెప్పినా కార్యాచరణకు నోచుకోలేదు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం చెరువులు, కుంటలకు పూర్వవైభవం తెచ్చేందుకు ‘మిషన్ కాకతీయ’కు శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా చెరువులు, కుంటల్లో పూడికతీతలు, మత్తడి మరమ్మతులు చేపట్టారు. కార్యక్రమం ప్రారంభించి ఏడాది పూర్తయ్యింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా కావటం, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో మిషన్ కాకతీయలో జిల్లాకు పెద్దపీట లభించింది. జిల్లాలో మొదటి విడతలో 1,693 చెరువుల పనులకు 885 పూర్తికాగా, ఏప్రిల్ నెలాఖరుకు మిగతా పనులు పూర్తి కానున్నాయి. రెండో విడతలో 1,741 చెరువులను పునరుద్ధరించాలని లక్ష్యం. ఇరిగేషన్‌శాఖ అధికారులు ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇదిలా ఉంటే మొదటి విడతలో 885 చెరువుల పూడికతీత పనులు పూర్తయినప్పటికీ దురదృష్టవశాత్తు ఈ ఏడాది వర్షాలు ముఖం చాటేశాయి. చెరువులు నిండిన పక్షంలో జిల్లాలో అదనంగా లక్ష ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది.
1,693 చెరువుల పూడిక తీత
మిషన్ కాకతీయతో చెరువు, చేను.. రెండింటికీ మేలు జరుగుతోంది. చెరువులో పూడిక తొలగిపోగా, పూడికమట్టిని రైతులు స్వచ్ఛందంగా పొలాల్లోకి తరలించారు. చెరువుపై ఆధారపడిన మత్స్య కార్మికులు సైతం మిషన్ కాకతీయ పనులతో సంతోషపడుతున్నారు. జిల్లాలో మొత్తం 7,972 చెరువులున్నాయి. వీటి కింద 2.52 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. మిషన్ కాకతీయ మొదటి విడతలో 1.04 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలుగా రూ.362.96 కోట్లతో 1869 చెరువుల పూడికతీత పనులు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే 1812 చెరువుల పూడికతీతకు ప్రతిపాదనలు పంపగా.. 1693 వాటికి ప్రభుత్వం అనుమతించింది. వీటిలో 885 చెరువుల్లో పూడికతీత పనులు పూర్తయ్యాయి. మిగతా చెరువుల పనులు వచ్చే నెలాఖరుకు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు.
రెండో విడతలో..
మిషన్ కాకతీయ రెండో విడతలో భాగంగా జిల్లాలో రూ.200 కోట్లతో 1741 చెరువుల పూడికతీత పనులు చేపట్టనున్నారు. అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు అందజేశారు. మంత్రి హరీశ్‌రావు గజ్వేల్, సిద్దిపేటలో రెండో విడత మిషన్ కాకతీయ పనులకు శ్రీకారం చుట్టారు. ఇటీవల నారాయణఖేడ్‌లో ఇరిగేషన్ పనులపై సమీక్ష జరిపిన మంత్రి.. రైతులు, ప్రజాప్రతినిధులు, అన్నివర్గాల వారిని కలుపుకుని రెండో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.