సాగరం సగమైంది! | Sriram Sagar Reservoir Filled With Mud Overflow | Sakshi
Sakshi News home page

సాగరం సగమైంది!

Published Thu, Mar 3 2022 4:50 AM | Last Updated on Thu, Mar 3 2022 9:25 AM

Sriram Sagar Reservoir Filled With Mud Overflow - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉత్తర తెలంగాణ వరప్రదాయిని, లక్షల ఎకరాలకు సాగునీరు అందించే శ్రీరాం సాగర్‌ జలాశయానికి గడ్డు రోజులు వచ్చాయి. రిజర్వాయర్‌లో ఏటేటా పూడిక పెరిగిపోయి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నీటి నిల్వ సామర్థ్యం ఇప్పటికే దాదాపు సగానికి తగ్గిపోవ డంతో ఆయకట్టుకు సాగునీరు ఇవ్వడం ప్రశ్నార్థకంగా మారుతోంది. శ్రీరాంసాగర్‌ జలాశయం నిర్మించినప్పుడు 112 టీఎంసీలుగా ఉన్న నిల్వ సామర్థ్యం.. ప్రస్తుతం 59.94 టీఎంసీలకు తగ్గిపోయిందని.. దీనికితోడు ఏటా 0.5 టీఎంసీల నుంచి 0.7 టీఎంసీల మేర పూడిక పేరుకుం టోందని తాజాగా నిర్వహించిన అధ్యయనం తేల్చింది. కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ), రిమోట్‌ సెన్సింగ్‌ డైరెక్టరేట్, ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌లు సంయుక్తంగా ఈ ‘శాటిలైట్‌ రిమోట్‌ సెన్సింగ్‌ (ఎస్‌ఆర్‌ఎస్‌)’ సర్వే చేశాయి. 2020 నవంబర్‌– 2021 మే మధ్య జలాశయంలో గరిష్ట, కనిష్ట నీటి మట్టాల పరిస్థితిని సెంటినల్‌ 1ఏ/ఏబీ ఉపగ్రహాల మైక్రోవేవ్‌ డేటా ఆధారంగా పరిశీలించి.. పూడిక పరిస్థితి, నిల్వ సామర్థ్యాన్ని గుర్తించాయి.

స్టోరేజీకి ‘డెడ్‌’.. లైవ్‌కూ గండి!
తెలంగాణలో గోదావరి నదిపై గ్రావిటీ ఆధారంగా నిర్మించిన ఏకైక జలాశయం శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు. జలాశయం నిర్మించినప్పుడు గరిష్ట నిల్వ సామర్థ్యం 112 టీఎంసీలు. అందులో డెడ్‌ స్టోరేజీ (అడుగున ఉండి వినియోగించుకోవడానికి వీల్లేని నీళ్లు) 30 టీఎంసీలు పోగా.. వాడుకోగలిగినవి 82 టీఎంసీలు. ప్రస్తుతం సుమారు 52 టీఎంసీల మేర పూడిక పేరుకుపోయింది. అంటే 30 టీఎంసీల డెడ్‌ స్టోరేజీతోపాటు వాడుకోగలిగిన 22.06 టీఎంసీల లైవ్‌ స్టోరేజీ సామర్థ్యాన్ని కూడా జలాశయం కోల్పోయిందని ఎస్‌ఆర్‌ఎస్‌ నివేదిక స్పష్టం చేస్తోంది.

పూడిక తొలగించే గేట్లే.. కూరుకుపోయాయ్‌
గోదావరి నదిలో ఎగువన మహారాష్ట్ర నుంచి జూలై రెండో వారంలో వరదలు మొదలై.. అక్టోబర్‌ వరకు కొనసాగుతాయి. ఈ సమయంలో నీటిని విడుదల చేయడానికి శ్రీరాంసాగర్‌ జలాశయానికి 42 వరద గేట్లతోపాటు పూడికను తొలగించే 6 రివర్స్‌ స్లూయిస్‌ గేట్లను కూడా ఏర్పాటు చేశారు. డెడ్‌ స్టోరేజీ జోన్‌కి మించి చేరిన పూడికను ఈ గేట్లను ఎత్తివేయడం ద్వారా తొలగించవచ్చు. మొదట్లో ఈ స్లూయిస్‌ గేట్లను ఎత్తడానికి ప్రయత్నించి, విఫలం కావడంతో వదిలేశారు. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆపరేట్‌ చేయలేదు. పూడిక పేరుకుపోవడానికి ఇదికూడా ప్రధాన కారణం. ప్రస్తుతం స్లూయిస్‌ గేట్లు పూర్తిగా మట్టిలో కూరుకుపోయాయి.

లక్షల ఎకరాలకు నీరిచ్చేలా..
నిజామాబాద్‌ జిల్లా మెండోరా మండలం పోచంపాడు వద్ద గోదావరి నదిపై 112 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టును చేపట్టారు. 1963 జూలై 26న నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ దీనికి శంకుస్థాపన చేయ గా.. 1978లో నిర్మాణం పూర్తయింది. దీనికింద 18 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటల ఆయకట్టును ప్రతిపాదించగా.. 16 లక్షల ఎకరాల స్థిరీకరణ జరి గింది. మరో 2లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించాల్సి ఉంది. ఈ రిజర్వాయర్‌కు అనుబంధంగా 36 మెగావాట్ల జల విద్యుత్‌ కేంద్రాన్ని కూడా నిర్మించారు. రిజర్వాయర్‌ నుంచి మూడు ప్రధాన కాల్వలు ఉన్నాయి.

∙శ్రీరాంసాగర్‌ ప్రధాన కాల్వ కాకతీయ కెనాల్‌. 9 వేల క్యూసెక్కుల సామర్థ్యమున్న ఈ కాల్వ ద్వారా నే నిజామాబాద్, కరీంనగర్, వరంగల్‌ జిల్లాల్లో 9 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుంది. దీని ద్వారానే లోయర్‌ మానేరు డ్యాం (ఎల్‌ఎండీ) కి 10 టీఎంసీల మేర నీటిని తరలిస్తున్నారు.
∙500 క్యూసెక్కుల సామర్థ్యమున్న లక్ష్మి కాల్వ ద్వారా నిజామాబాద్‌ జిల్లాలో 25 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది.
∙1000 క్యూసెక్కుల సామర్థ్యమున్న సరస్వతి కాల్వ కింద నిర్మల్‌ జిల్లాలో 35 వేల ఎకరాల ఆయకట్టు ఉంది.
∙ఎస్సారెస్పీ మిగులు జలాలను తరలించే వరద కాల్వ సామర్థ్యం 24 వేల క్యూసెక్కులు. దీనికింద 2.20లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది.

పూడిక వేగం పెరుగుతోంది
ఈ జలాశయం ఏటా పూడిక వల్ల సగటున 0.5 టీఎంసీల మేర నిల్వ సామర్థ్యాన్ని కోల్పోతూ వస్తోంది. 1970–1994 మధ్య ఏటా 0.53%, 1994–2013 మధ్య ఏటా 0.4%, 2013– 2021 మధ్య ఏటా 0.71% నిల్వ సామర్థ్యాన్ని నష్ట పోయి నట్టు సర్వేలు గుర్తించాయి. అంటే జలాశయం పూడుకుపోతున్న వేగం కొన్నేళ్లుగా బాగా పెరుగు తోందని తేల్చాయి. ఇది ఇలాగే కొనసాగితే భవిష్య త్తులో రాష్ట్రానికి భారీ నష్టమే కలగనుంది. ప్రాజెక్టుపై ఆధారపడిన 18 లక్షల ఎకరాల ఆయకట్టు భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది.
∙ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఫలాలు సంపూర్ణంగా అందాలన్నా శ్రీరాంసాగర్‌ జలాశయా న్ని పరిరక్షించుకోవాల్సిందేనని నిపుణులు చెప్తున్నా రు. ఎల్లంపల్లి నుంచి మిడ్‌ మానేరు సమీపంలోకి.. అక్కడి నుంచి వరద కాల్వ మీదుగా 3 లిఫ్టులతో శ్రీరాంసాగర్‌ను నింపడానికి ప్రభుత్వం ఎస్సారెస్పీ పునర్జీవన పథకాన్ని చేపట్టింది. శ్రీరాంసాగర్‌ పూడు కుపోతే ఈ పథకం లక్ష్యం సైతం నెరవేరదు. భవిష్య త్తులో తాగునీటి అవసరాలకే ఈ ప్రాజెక్టు పరిమితం కావాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఏటేటా తగ్గుతున్న  సామర్థ్యం
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం ఏటేటా పడిపోతూనే ఉంది. ప్రాజెక్టు నిర్వహణ రికార్డుల ప్రకారం ఏటా సగటున 0.8 టీఎంసీల పూడిక వచ్చి చేరుతోంది. 1994లో ఆంధ్రప్రదేశ్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ లేబొ రేటరీస్‌ (ఏపీఈఆర్‌ఎల్‌) సర్వే చేసి.. ఈ రిజర్వాయర్‌ నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలకు తగ్గిపోయినట్టు పేర్కొంది. అయితే అంతకుముందు, తర్వాత చేసిన సర్వేల్లో.. నిల్వ సామర్థ్యం మరింతగా పడిపోయినట్టు వెల్లడైంది. ఆ సర్వేలను.. తాజా ఎస్‌ఆర్‌ఎస్‌ గణాంకాలను సీడబ్ల్యూసీ పోల్చి చూసింది. ఆయా సర్వేల్లో తేల్చిన వివరాలివీ..


 

పూడికను నివారించేదిలా?
జలాశయాల్లో పూడికను తొలగించడం అత్యంత ఖర్చుతో కూడిన పని. ఆ ఖర్చుతో కొత్త జలాశయమే నిర్మించవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే తక్కువ ఖర్చు, సులువుగా జలాశయాల్లో పూడిక చేరకుండా నివారించవచ్చని సీడబ్ల్యూసీ చెప్తోంది. తమ నివేదికలో పలు సిఫారసులు చేసింది.

  • అడవుల నిర్మూలన, చెట్ల నరికివేతతో వరదల వేగం పెరిగి జలాశయాల్లో పూడిక చేరుతుంది. దీనిని అడ్డుకోవాలి. పరీవాహక ప్రాంతాల్లో విస్తృతంగా అడవులు, చెట్లను పెంచాలి.
  • నదీ తీరాల్లో రివిట్‌మెంట్లు, చెట్లతో పరీవాహక ప్రాంతం కోతకు గురికాకుండా రక్షణ చర్యలు చేపట్టాలి.
  • నదుల్లో ఎక్కడికక్కడ నీళ్లను నిల్వ చేసేలా కాంటూర్‌ గుంతలు, చెక్‌ డ్యాంలు, చిన్న రిజర్వాయర్లు నిర్మిస్తే వరదల వేగం తగ్గి.. పెద్ద జలాశయాల్లోకి పూడిక రాదు. 
  • వ్యవసాయ పద్ధతుల్లోనూ మార్పు తేవాలి. భూమిని దున్ని వదిలేస్తే వేగంగా కోతకు గురై నదుల్లోకి మట్టి చేరుతుంది.
  • రిజర్వాయర్లలోకి రాక ముందే మధ్యలోనే ఎక్కడికక్కడ పూడికను తొలగించాలి.
  • నదుల ప్రవాహ మార్గాల్లో భూ ఉపరితలం కోతకు గురికాకుండా చర్యలు చేపట్టాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement