నవ్విపోదురుగాక..! | froud in water - tree scheam | Sakshi
Sakshi News home page

నవ్విపోదురుగాక..!

Published Thu, Jun 16 2016 3:50 AM | Last Updated on Mon, Sep 4 2017 2:33 AM

నవ్విపోదురుగాక..!

నవ్విపోదురుగాక..!

కాసులవర్షం కురిపిస్తున్న నీరు-చెట్టు పథకం
వాగుల్లో పూడికతీత పనులకు ఎగబడుతున్న నేతలు
రూ.5లక్షల్లోపు పనులు నామినేషన్‌పై కేటాయింపు
15శాతం మొత్తంతో పనులు ముగిస్తున్న వైనం
మిగతా దాంట్లో అధికారులకు 30శాతం పర్సంటేజీ

 సాక్షి ప్రతినిధి, కడప: నవ్విపోదురుగాక...నాకేటి సిగ్గు అన్నట్లుగా అధికారపార్టీ నేతలు, అధికారులు కుమ్మక్కై నీరు-చెట్టు పథకాన్ని దోచుకుంటున్నారు. కాంట్రాక్టర్లకు కాసులవర్షం కురిపించడమే లక్ష్యంగా పనులు సాగుతున్నాయి. భూగర్భజల సంరక్షణ చర్యలు అటుంచితే, పైసల కోసమే పనులు చేస్తున్నట్లుగా తేటతెల్లమౌతోంది. నీరు-చెట్టు పనుల ద్వారా కాస్తయిన ప్రయోజనం ఉండేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ కాంట్రాక్టర్ల కోసమే పనులు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. బుగ్గవంక మధ్యలో చేసిన పనులే ఇందుకు నిదర్శనం. చట్టానికి లోబడే పాలకపక్షం తెలివిగా జేబులు నింపుకొంటున్న వైనమిది.

 కడప నగరంలో బుగ్గవంక గురించి తెలియని వారుండరు. కడపను రెండు భాగాలుగా ఆ వంక చీల్చింది. గతంలోనే బుగ్గవంక సుందరీకరణ పనులు చేపట్టారు. ఆ కారణంగా ప్రస్తుతం 80 మీటర్లు నుంచి 100 మీటర్లు వెడల్పుతో వంక విస్తరించి ఉంది. ఈ వంకపై తమ్ముళ్ల కన్నుపడింది. వంక మధ్యలో నీరు-చెట్టు పనులు మొదలుపెట్టారు. భూగర్భ జలసంరక్షణ చర్యలు చేపట్టే క్రమంలో ప్రభుత్వం ఆ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే తెలుగుతమ్ముళ్లు ‘నీరు-చెట్టు’ పథకాన్ని కల్పతరువుగా మల్చుకుంటున్నారు. వారికి అధికారులు పక్కాగా సహకరిస్తున్నారు. వంద మీటర్లు వెడల్పు ఉన్న బుగ్గవంక మధ్యలో ఓ కాలువ తీస్తూ ప్రజాధనం లూఠీ చేస్తున్నారు. ఇదివరకే జమ్ముతో పేరుకుపోయిన ప్రాంతాన్ని జేసీబీతో బాగుచేయడం, కాలువగా రూపురేఖలు తేవడంతో పనిముగుస్తోంది. అయితే తూతూమంత్రపు వ్యవహారం కోసం దాదాపు రూ.69 లక్షలు ఖర్చుపెట్టి బుగ్గవంకలో తొలివిడతగా పనులు చేపట్టారు.

 నామినేషన్‌పై చేజిక్కించుకుంటూ..
నీరు-చెట్టు పనులను అధిక శాతం నామినేషన్‌పై తెలుగుతమ్ముళ్లకు అప్పగిస్తున్నారు. రూ.5 లక్షలు వరకూ నామినేషన్‌పై కేటాయిస్తూ పనులు సంఖ్యను పెంచుతున్నారు. ఈక్రమంలో చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు పడుతునే కాంట్రాక్టర్లకు నాలుగు రూకలు మిగిలిస్తూ తద్వారా లబ్ధి పొందేందుకు అధికారులు యత్నిస్తున్నారు. రూ.5లక్షల పనిని జెసీబీ ద్వారా రూ.75వేలతో కాంట్రాక్టర్ పూర్తిచేస్తున్నారు. తక్కిన మొత్తం అటు అధికారులకు 30శాతం పర్శేంటేజీలకు, ఇటు కాంట్రాక్టర్లు జేబుల్లోకి వెళ్తుతోంది. మునుపెన్నడూ ఇంతటి అధ్వానపు పనులు చేపట్టలేదని ప్రజలు వాపోతున్నారు. వర్షమొస్తే బుగ్గవంకలో నిలిచి ఉన్న నీర ంతా కొట్టుకుపోతుంది. అలాంటిది నిలిచిన నీటిని తరలించే క్రమంలో బుగ్గవంకలో ప్రత్యేక కాలువ ఏర్పాటు చేస్తున్నారు. వాస్తవానికి దిగువ వైపు నుంచి పనులు చేస్తే కనీసం నిలిచిన నీరైనా వెళ్లిపోయేది. ఎర్రముక్కపల్లె ఎగువ భాగాన నీరు నిలిచే అవకాశమే లేదు. అలాంటి చోట కాలువ తీయడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. రవీంద్రనగర్ దిగువన పనులు చేసిఉంటే మురికి నీరు నిల్వ లేకుండా వెళ్లిపోయి, కాస్తయిన ప్రయోజనం ఉండేదని స్థానికులు పేర్కొంటున్నారు

 కొనసాగుతోన్న దోపిడీ....
జిల్లాలో 1,776 పనులు రూ.100 కోట్లతో నీరు-చెట్టు కింద ప్రస్తుతం పనులు చేపడుతున్నారు. ఇప్పటికే 536 పనులు పూర్తయ్యాయి. పేరుకే జలసంరక్షణ పనులు, నాయకుల దోపిడీకే అధిక ప్రాధాన్యం దక్కుతోంది. నాడు కాంగ్రెస్ పార్టీ నేతలుగా మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సాన్నిహిత్యంతో లబ్ధి పొంది, నేడుటీడీపీ నేతలుగా కొనసాగుతోన్న ఆ సోదరులు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వారి కనుసన్నల్లోనే నీరు-చెట్టు దోపిడీ సాగుతున్నట్లు సమాచారం. అధికారులు వారి సిఫార్సులకు తలొగ్గి ఇష్టానుసారంగా పనులు కేటాయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 తెలుగు తమ్ముళ్ల జేబులు నింపేందుకే...
బుగ్గవంకలో తీసే మధ్య కాలువ తమ్ము ళ్ల జేబులు నింపేందుకే. ఎక్కడైన చెరువులు, కుంటల్లో పూడిక తొలగిస్తే ఉపయోగం ఉంటుంది. ఎందుకు పనిరాని పనులు చేస్తూ కోట్లు దోపిడీ చేయడం దారుణం. ఆ నిధులను బుగ్గవంక సైడుగోడల కోసం ఖర్చుపెడితే కొంతవరకన్నా మేలు చేకూరేది. బుగ్గవంకలోని గుర్రపు డెక్క తొలగింపు చేయాల్సిన పనిలేదు. వర్షం వస్తే ఆ నీళ్లకు కొట్టుకుపోతుంది. ఇలా నిధులు స్వాహా చేస్తుంటే అధికారులు నిద్రపోతున్నారా? అని ప్రశ్నిస్తున్నాం.  - జి చంద్ర, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు

 ఇది దోపిడీ పథకం
నీరు-చెట్టు పూర్తిగా దోపిడీ పథకం. దీ నిని టీడీపీ నేతలే తప్పుబడుతున్నారు. బుగ్గవంకలో పూడికతీయాలని సీపీఎం తరపున పోరాటాలు చేస్తే స్పందించని అధికారులు, ఇలా నిధులు దండుకునేం దుకు అనుమత్విడంలోని మతలబు ఏమి టో అర్థం కావడంలేదు. గుర్రపు డెక్క తొలగింపునకు కోట్లు ఖర్చుచేస్తారా? ఈ నిధులు మరొకదానికి ఖర్చు చేసి ఉంటే ప్రయోజనం ఉండేది. ప్రజాధనం దుబారా తప్ప ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడని కార్యక్రమం.  - ఒ శివశంకర్, నగర కార్యదర్శి,సీపీఎం

 తాత్కాలిక పనుల వల్ల ఒరిగేది శూన్యం...
బుగ్గవంకలో నీరు-చెట్టు కింద చేసే తాత్కాలిక పనుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. తెలుగు తమ్ముళ్ల జేబులు నింపడానికే ఈ పనులు చేస్తున్నారు తప్పా ప్రజలకు ఉపయోగం లేదు. మళ్లీ నీళ్లు వచ్చి చెత్తాచెదారం పేరుకుపోతుంది. చెరువుల్లో పూడికతీసి, ఆనకట్టలను అభివృద్ధి చేస్తే భూగర్భజలాలు పెరుగుతాయి. చెరువుల్లో తవ్విన మట్టిని కూడా టీడీపీ నాయకులు అమ్ముకోవడం దారుణం.
- బి. నిత్యానందరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ నగర అధ్యక్షుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement