వేతనాల్లో శాతాల వారీ కోత  | Full Pay Of The Employees Will Be Postponed In Percentage Terms | Sakshi
Sakshi News home page

వేతనాల్లో శాతాల వారీ కోత 

Published Wed, Apr 1 2020 4:31 AM | Last Updated on Wed, Apr 1 2020 4:31 AM

Full Pay Of The Employees Will Be Postponed In Percentage Terms - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలలో కోత విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడంపై ఆర్థిక శాఖ మంగళవారం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల పూర్తి వేతనాన్ని శాతాల వారీగా వాయిదా వేయనున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. జీవో నం. 27లో పేర్కొన్న విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు మార్చికి సంబంధించి ఏప్రిల్‌లో రావాల్సిన పూర్తి వేతనంలో కోత విధించనున్నారు. ఈ కోత వాయిదా మాత్రమేనని, ప్రభుత్వం నిర్ణయించిన విధంగా  వేతన వ్యత్యాసాన్ని వాయిదా రూపంలో అమలు చేయాలని స్పష్టం చేశారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సంబంధించిన జీతాల బిల్లులు ఈ పాటికే ఈ కుబేర్‌లో సమర్పించి ఉంటే ఈ వ్యత్యాసాన్ని ఐఎఫ్‌ఎంఐఎస్‌ ద్వారా వర్తింపజేయాలని, ఇప్పటివరకు సమర్పించని బిల్లులను జీవోలో పేర్కొన్న వ్యత్యాసాన్ని వర్తింపజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనంలో 10% వేతనాన్ని వాయిదా వేయాలని, హోంగార్డులు, అంగన్‌వాడీ కార్యకర్తలు/హెల్పర్లు, వీఆర్‌ఏలు, విద్యావాలంటీర్లు తదితరులకిచ్చే గౌరవ వేతనానికీ ఈ వాయిదా వర్తిస్తుందన్నారు. నాలుగో తరగతి పెన్షనర్లకు 10%, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల పింఛన్‌లో 50%, అఖిల భారత సర్వీసు ఉద్యోగుల పింఛన్‌లో 60% వాయిదా వేయాలన్నారు. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల వేతనాలకు సంబంధించి ఇప్పటికే జారీ చేసిన బిల్లులు, చెక్కులను వెనక్కు తీసుకోవాలని,  ప్రభుత్వ నిర్ణయం ప్రకారం వ్యత్యాసాన్ని వర్తింపజేసి వేతనాన్ని వాయిదా వేయాలని, ఆ మేరకు మళ్లీ బిల్లులు, చెక్కులు మంజూరు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement