
ఎమ్మెల్యే బాబు బాగా బిజీ!
► మిషన్ కాకతీయ పనుల ప్రారంభంలో జాప్యం చేస్తున్న ఎమ్మెల్యేలు
► 3,712 చెరువులకు అగ్రిమెంట్‌లు పూర్తి
► 2,617 చెరువుల్లోనే పనులు ప్రారంభం
► సహకరించాలని ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: చెరువుల మరమ్మతు పనుల విషయంలో ఎమ్మెల్యేల వైఖరిపై పలు విమర్శలు వస్తున్నాయి. పనులను తామే ప్రారంభిస్తామని గతంలో పట్టుబట్టి, ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించే తీరిక లేనట్టుగా తప్పించుకు తిరుగుతున్నారు. రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణకోసం చేపట్టిన ప్రతిష్టాత్మక మిషన్ కాకతీయ పనులను ప్రజా ఉద్యమంగా చేపట్టాలని ప్రభుత్వం ఓ వైపు పదే పదే చెబుతున్నా!.. క్షేత్ర స్థాయిలో ప్రజా ప్రతినిధులు దాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.
వర్షాకాలం మొదలయ్యే నాటికి చెరువుల మరమ్మతులకు సంబంధించి ముఖ్యమైన పనులను పూర్తి చేయాల్సిన దృష్ట్యా, టెండర్లు, ఒప్పందాలు పూర్తయిన చెరువుల పనులను వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వం పురమాయిస్తున్నా, వారు మాత్రం తమ పంథా మార్చుకోవడం లేదు. పనులను తమ చేతుల మీదుగానే ఆరంభించాలంటూనే ఎమ్మెల్యేలు సమయమివ్వకపోవడంతో చాలా చోట్ల చెరువుల పనులు ప్రారంభం కావడంలేదు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 3,712 చెరువులకు ఒప్పందాలు కుదిరినా, ప్రజా ప్రతినిధుల అలసత్వం కారణంగా కేవలం 2,617 చెరువుల పనులు మాత్రమే ప్రారంభమయ్యాయి.
రాజకీయాలతో తంటా...
వర్షాలు రావడానికి మరో పదిహేను, ఇరవై రోజుల గడువు మాత్రమే ఉన్నా, 1,095 చెరువుల్లో ఇంకా పనుల ఆరంభమే జరగలేదు. దీనికి ప్రధానంగా ఆయా చెరువుల పరిధిలోని నియోజకవర్గాల్లో నెలకొన్న రాజకీయాలే కారణమని తెలుస్తోంది. చాలా చోట్ల ఎమ్మెల్యేలు తామే స్వయంగా పనులకు శంకుస్థాపన చేస్తామని పట్టుబట్టడమే కారణంగా తెలుస్తోంది. స్థానిక నేతలు ఎవరైనా పనుల ఆరంభానికి చొరవ చూపినా స్థానిక ఎమ్మెల్యేలు అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్రారంభానికి అడ్డు చెప్పడంతో పనులు మొదలవలేదు. పూర్వపు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది.
ఒప్పందాలు పూర్తయినా కరీంనగర్‌లో 403 చెరువులకు గానూ 195 చెరువులు, నిజామాబాద్‌లో 1,741 చెరువులకు గానూ 1,288 చెరువులు, నల్లగొండలో 2,023 చెరువులకు గానూ 1,509 చెరువుల పనులు మాత్రమే ఆరంభమయ్యాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చాలా చోట్ల పనుల ఆరంభం నత్తనడకన సాగుతోంది. దీంతో రాజకీయ జోక్యాన్ని తగ్గించి పనులను మొదలుపెట్టే దిశగా మంత్రి హరీశ్‌రావు ప్రయత్నాలు మొదలు పెట్టారు. మొదటి దశలో మాదిరే త్వరగా పనులు ప్రారంభించి వర్షాలు కురిసే నాటికి పూడికతీత, అలుగు, తూముల పనులు పూర్తి చేసేలా సహకరించాలని ప్రతి ఒక్క ఎమ్మెల్యేతో నేరుగా మాట్లాడుతున్నారు. దీనిపై ఎమ్మెల్యేలు ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాల్సి ఉంది.