తూతూ మంత్రంగా మిషన్ కాకతీయ పనులు
చెరువులను పరిశీలించిన కాంగ్రెస్ బృందం
ములుగు : ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ చేపడుతున్న మిషన్ కాకతీయ పనులు తూ తూ మంత్రంగా గుత్తేదారుల స్వలాభం కోసం జరుగుతున్నాయని కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మస్రగాని వినయ్‌కుమార్, మాజీ ఎంపీపీ నల్లెల్ల కుమారస్వామిలు ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు బృందంగా ఏర్పడి మండలంలోని కొత్తూరు పంచాయతీ పరిధిలోని యాపలకుంట, దామెరచెరువు, గంటోనికుంట, వ జ్జదుర్గయ్యకుంట, లింగప్పచెరువు, సంతోశ్‌కుంట, జొన్నరాసకుంట, పెద్దకుంటలతో పాటు కన్నాయిగూడెం చెరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుత్తేదారులు 30 నుంచి 31శాతం లెస్ అమౌంట్ కాంట్రాక్టును దక్కించుకొని కేవలం రూ. 1 లక్ష నుంచి రూ.లక్ష 50 వేల పనులు మాత్రమే చేసి చేతులు దులుపుకుంటున్నారని దుయ్యబట్టారు. దీనికి అధికారుల నుంచి ప్రోత్సాహం అందుతుందని ఆరోపించారు.
పనులు చేపట్టిన 20 రోజుల్లోనే నిర్మాణాలు పగిలిపోతున్నాయన్నారు. కొత్తూరు గ్రామపరిధిలో రూ. కోటి నిధులు మంజూరు కాగా కేవలం రూ.30 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు పనులు జరిగినట్లు పరిశీలనలో తేలిందని అన్నారు. ఈ నెల 19న మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య ఆధ్వర్యంలో చెరువుల పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్‌గౌడ్, నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎండీ.అహ్మద్‌పాషా, ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి అల్లెం సదానందం, లోతట్టు ప్రాంతాల ఇన్‌చార్జి ఎర్రబెల్లి దేవేందర్, కార్యకర్తలు పాల్గొన్నారు.