Mission Kakatiya, sriransagar project,
మిషన్ కాకతీయ.. అంతా మాయ l
Published Mon, Jan 2 2017 4:09 PM | Last Updated on Tue, Sep 5 2017 12:12 AM
నందిపేట మండలం గాదెపల్లి గ్రామంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ముంపునకు గురైన గిలకమ్మ చెరువును మిషన్ కాకతీయ కింద చేర్చి రూ.17.20 లక్షలు కేటాయించారు. వర్ని మండలం జాకోర గ్రామంలో బ్రాహ్మణకుంట, అక్బర్‌నగర్‌లో ఎర్రకుంటలు 10 ఎకరాల విస్తీర్ణం లేకున్నా మిషన్‌కాకతీయ కింద తీసుకున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ఎక్కలవినికుంటకు ఆయకట్టు లేకున్నా మిషన్ కాకతీయ కింద ఎంపికచేసారు. గాంధారి మండల కేంద్రంలో ఒక చెరువుకు ఆయకట్టు లేకున్నా ఆయకట్టును ఎక్కువ చూపుతూ మిషన్ కాకతీయ కింద పనులు చేపట్టారు.
నిజామాబాద్ అర్బన్ : సాగుభూములకు జీవనాడులుగా ఉన్న చెరువులు, కుంటలకు జలకళతో పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం లక్ష్యం అధికారుల ఇష్టారాజ్యంతో నీరుగారుతోంది. ఎక్కువ ఆయకట్టు ఉన్న చెరువులను వదిలి తక్కువ ఆయకట్టు ఉన్న కుంటలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆసలు ఆయకట్టు లేని కుంటలను, ఐదు నుంచి 20 ఎకరాల లోపు ఆయకట్టు గల కుంటలను మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించేందుకు ఎంపిక చేశారు. పలు మండలాల్లో అసలు తూములు, ఆలుగు నిర్మాణాలు లేని కుంటలను ఎంపిక చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ముంపునకు గురైన చెరువులు, కుంటలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం విడ్డూరంగా ఉందంటున్నారు. నందిపేట, ఆర్మూర్, బాల్కొండ, నవీపేట మండలాల్లో ఇలాంటి చెరువులనే ఎంపిక చేసారు. ఇప్పటికే జిల్లాలో అత్యధిక కుంటల్లో ఉపాధిహామీ పథకం కింద పూడికతీత పనులు, కట్టబలోపేతం పనులు చేయించారు. ఈ ఏడాది ఉపాధి హామీ పథకం కింద ఖర్చుపెట్టిన రూ. 233.80 కోట్లలో సింహభాగం చెరువు పనులకే కేటాయించారు. దీంతో గుత్తెదారులు పూడికతీత కట్ట బలోపేతం పనులు వదిలి మిగతా పనులు చేస్తున్నారు. నామమాత్రంగా తూములు నిర్మించడం, మత్తడికి పై పూతలు పూసి మమ అనిపించేస్తున్నారు. పనులకు మంజూరైన నిధుల్లో పాతిక శాతం కూడా ఖర్చు చేయడం లేదు. నిధులను కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు కలిసి పంచుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.
పెద్ద చెరువులను వదిలేశారు..
జిల్లాలో ఆయకట్టు లేని కుంటలకు ప్రాధాన్యత ఇచ్చిన ఇంజనీర్లు వందల ఆయకట్టు ఉన్న చెరువులను వదిలేసారు.పెద్ద చెరువులను మిషన్ కాకతీయ కింద తీసుకుంటూ లక్ష్యం నెరవేర్చడంలో విఫలం కావడం, కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ రాకపోవడం వంటి కారణాలతో ఇంజనీర్లు చిన్నకుంటలకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నా ఆరోపణలు ఉన్నాయి. ఇలా జిల్లాలో వదిలేసిన పెద్ద చెరువులు 40 వరకు ఉన్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
Advertisement
Advertisement