నిండుకుండలా శ్రీరాంసాగర్ జలాశయం
ఇప్పటికీ ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో
ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఎగువ నుంచి 245 టీఎంసీల ఇన్‌ఫ్లో
అవుట్‌ఫ్లో 171 టీఎంసీలు
ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా గుర్తింపు పొందిన శ్రీరాంసాగర్ జలాశయం వచ్చే యాసంగి పంటకు సైతం భరోసా ఇస్తోంది. ఈ ఏడాది ఎస్సారెస్పీలోకి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అనుకున్న సమయానికే నిండింది. ఇప్పటివరకు ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద కారణంగా జలాశయంలోకి ఈ సీజన్‌లో మొత్తం 245 టీఎంసీల నీరు వచ్చింది. దిగువ గోదావరిలోకి, కెనాల్స్ ద్వారా మొత్తం 171 టీఎంసీలు బయటకు వెళ్లింది. ఇప్పటికీ జలాశయం నిండుకుండలా ఉంది. దీంతో విడతలవారీగా నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత సీజన్ వానాకాలం పంటకు సమృద్ధిగా నీటిని వదిలారు. అయినా పూర్తి స్థాయి నీటిమట్టంతో జలాశయం.. వచ్చే యాసంగి పంటకు సైతం సరిపడా నీటిని అందించే స్థితిలో ఉంది. యాసంగికి నీరు వదిలినప్పటికీ.. ఇంకా మిగులు జలాలుండే పరిస్థితి ఉంది. – సాక్షి ప్రతినిధి, నిజామాబాద్
ఈ నెల 28 వరకు ఎగువ మహారాష్ట్ర నుంచి వరద..
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎగువ మహారాష్ట్రలోని బాబ్లీ బ్యారేజ్ గేట్లను ఈ నెల 28న మూసివేయనున్నారు. అప్పటివరకు శ్రీరాంసాగర్ జలాశయంలోకి వరద కొనసాగుతుంది. జలాశయం నుంచి వచ్చే నవంబర్ రెండోవారం వరకు వానాకాలం పంటకు నీటిని విడుదల చేయనున్నారు. అయినా జలాశయంలో 70 టీఎంసీల మేర నీటి నిల్వ ఉంటుంది. దీంతో యాసంగి పంటకు ఢోకా లేకుండా పోయింది. ఎస్సారెస్పీ కింద ఉన్న ఉమ్మడి కరీంగనర్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో 18 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టుకు ఒక పంటకు నీరివ్వాలంటే 56 టీఎంసీల నీరు జలాశయంలో ఉండాలి. ఈ నేపథ్యంలో రెండో పంటకు బేఫికర్ అయింది. ఎస్సారెస్పీలోకి ప్రస్తుతం 12వేల క్యూసెక్కుల వరద నీరు ఎగువ నుంచి వస్తోంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 1,091 అడుగులు, 80.5 టీఎంసీలు. ప్రస్తుతం పూర్తిస్థాయి నీటిమట్టంతో ఉంది. డిసెంబర్ రెండో వారం నుంచి యాసంగి పంటకు నీటి విడుదల మొదలవు తుంది. వారబందీ ప్రకారం నీటి విడుదల చేస్తారు.
మొత్తం 245 టీఎంసీల నీరు రాక..
శ్రీరాంసాగర్ జలాశయంలోకి ఇప్పటివరకు ఈ సీజన్‌లో మొత్తం 245 టీఎంసీల నీరు రాగా, 171 టీఎంసీలు బయటకు వెళ్లింది. వరద గేట్ల ద్వారా దిగువ గోదావరిలోకి 96.25 టీఎంసీలు, ఎస్కేప్ గేట్ల ద్వారా గోదావరిలోకి 4.90 టీఎంసీలు, వరద కాలువ ద్వారా 34.2 టీఎంసీలు, కాకతీయ కాలువ ద్వారా 25.50 టీఎంసీలు, సరస్వతి కాలువ ద్వారా 1.44 టీఎంసీలు, లక్ష్మి కాలువ ద్వారా 0.46 టీఎంసీలు, మిషన్ భగీరథకు 2.63 టీఎంసీలు వదిలారు. ఆవిరి రూపంలో 5.08 టీఎంసీల నీరు ఖర్చయింది. ఎస్సారెస్పీలోకి జూన్ నెలలో ఎగువ నుంచి 3.99 టీఎంసీలు, జూలైలో 27.25 టీఎంసీలు, ఆగస్టులో 33.48 టీఎంసీలు, సెప్టెంబర్‌లో 154.43 టీఎంసీలు, అక్టోబర్‌లో 24.71 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment