Yasangi crop acreage
-
యాసంగికీ బేఫికర్
ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా గుర్తింపు పొందిన శ్రీరాంసాగర్ జలాశయం వచ్చే యాసంగి పంటకు సైతం భరోసా ఇస్తోంది. ఈ ఏడాది ఎస్సారెస్పీలోకి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అనుకున్న సమయానికే నిండింది. ఇప్పటివరకు ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద కారణంగా జలాశయంలోకి ఈ సీజన్లో మొత్తం 245 టీఎంసీల నీరు వచ్చింది. దిగువ గోదావరిలోకి, కెనాల్స్ ద్వారా మొత్తం 171 టీఎంసీలు బయటకు వెళ్లింది. ఇప్పటికీ జలాశయం నిండుకుండలా ఉంది. దీంతో విడతలవారీగా నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత సీజన్ వానాకాలం పంటకు సమృద్ధిగా నీటిని వదిలారు. అయినా పూర్తి స్థాయి నీటిమట్టంతో జలాశయం.. వచ్చే యాసంగి పంటకు సైతం సరిపడా నీటిని అందించే స్థితిలో ఉంది. యాసంగికి నీరు వదిలినప్పటికీ.. ఇంకా మిగులు జలాలుండే పరిస్థితి ఉంది. – సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ఈ నెల 28 వరకు ఎగువ మహారాష్ట్ర నుంచి వరద..సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎగువ మహారాష్ట్రలోని బాబ్లీ బ్యారేజ్ గేట్లను ఈ నెల 28న మూసివేయనున్నారు. అప్పటివరకు శ్రీరాంసాగర్ జలాశయంలోకి వరద కొనసాగుతుంది. జలాశయం నుంచి వచ్చే నవంబర్ రెండోవారం వరకు వానాకాలం పంటకు నీటిని విడుదల చేయనున్నారు. అయినా జలాశయంలో 70 టీఎంసీల మేర నీటి నిల్వ ఉంటుంది. దీంతో యాసంగి పంటకు ఢోకా లేకుండా పోయింది. ఎస్సారెస్పీ కింద ఉన్న ఉమ్మడి కరీంగనర్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో 18 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టుకు ఒక పంటకు నీరివ్వాలంటే 56 టీఎంసీల నీరు జలాశయంలో ఉండాలి. ఈ నేపథ్యంలో రెండో పంటకు బేఫికర్ అయింది. ఎస్సారెస్పీలోకి ప్రస్తుతం 12వేల క్యూసెక్కుల వరద నీరు ఎగువ నుంచి వస్తోంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 1,091 అడుగులు, 80.5 టీఎంసీలు. ప్రస్తుతం పూర్తిస్థాయి నీటిమట్టంతో ఉంది. డిసెంబర్ రెండో వారం నుంచి యాసంగి పంటకు నీటి విడుదల మొదలవు తుంది. వారబందీ ప్రకారం నీటి విడుదల చేస్తారు.మొత్తం 245 టీఎంసీల నీరు రాక..శ్రీరాంసాగర్ జలాశయంలోకి ఇప్పటివరకు ఈ సీజన్లో మొత్తం 245 టీఎంసీల నీరు రాగా, 171 టీఎంసీలు బయటకు వెళ్లింది. వరద గేట్ల ద్వారా దిగువ గోదావరిలోకి 96.25 టీఎంసీలు, ఎస్కేప్ గేట్ల ద్వారా గోదావరిలోకి 4.90 టీఎంసీలు, వరద కాలువ ద్వారా 34.2 టీఎంసీలు, కాకతీయ కాలువ ద్వారా 25.50 టీఎంసీలు, సరస్వతి కాలువ ద్వారా 1.44 టీఎంసీలు, లక్ష్మి కాలువ ద్వారా 0.46 టీఎంసీలు, మిషన్ భగీరథకు 2.63 టీఎంసీలు వదిలారు. ఆవిరి రూపంలో 5.08 టీఎంసీల నీరు ఖర్చయింది. ఎస్సారెస్పీలోకి జూన్ నెలలో ఎగువ నుంచి 3.99 టీఎంసీలు, జూలైలో 27.25 టీఎంసీలు, ఆగస్టులో 33.48 టీఎంసీలు, సెప్టెంబర్‌లో 154.43 టీఎంసీలు, అక్టోబర్‌లో 24.71 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. -
తెలంగాణలో రికార్డు పంట.. గతంలో ఎన్నడూ లేనంతగా సాగు..!
రాష్ట్రంలో పంటల సాగు రికార్డులు బద్దలు కొడుతోంది. తెలంగాణ చరిత్రలోనే ప్రస్తుత వ్యవసాయ సీజన్లో పంటల సాగు కొత్త రికార్డులు నమోదు చేసింది. కొన్నేళ్లుగా సాగునీటి ప్రాజెక్టులు అందుబాటులోకి రావడం, విస్తారంగా కురిసిన వానలతో రిజర్వాయర్లు, చెరువులు, కుంటలన్నీ నిండిపోవడం, భూగర్భ జలమట్టాలు పెరగడంతో.. ప్రస్తుత యాసంగి మొత్తం పంటల సాగులో, వరి సాగులో ఆల్‌టైమ్ రికార్డులను నమోదు చేసింది. ఇంతకుముందు యాసంగి సీజన్‌కు సంబంధించి అత్యధికంగా 2020–21లో 68.17 లక్షల ఎకరాల్లో పంటలు వేయగా.. ఈసారి యాసంగిలో 68.53 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని బుధవారం విడుదల చేసిన నివేదికలో వ్యవసాయశాఖ వెల్లడించింది. 2014–15 యాసంగిలో 28.18 లక్షల ఎకరాల్లోనే పంటలు పండించగా.. మరో 40.35 లక్షల ఎకరాల సాగు పెరగడం గమనార్హం. వరి కూడా ఆల్‌టైమ్ రికార్డే... మొత్తం పంటల సాగుతో మాత్రమేకాకుండా.. వరి సాగు విషయంలోనూ ఈ యాసంగి ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. ప్రస్తుత యా సంగిలో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఏకంగా 53.08 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. నాట్లు వేయడానికి మరో పదిరోజుల పాటు సమయం ఉండటంతో.. వరి విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా వానాకాలం సీజన్‌తో పోటీపడే స్థాయిలో యాసంగిలో వరి సాగు నమోదవుతోందని అంటున్నారు. 2014–15 యాసంగిలో 12.23 లక్షల ఎకరాల్లో వరిసాగు కాగా.. ప్రస్తుతం ఏకంగా 53.08 లక్షల ఎకరాలకు పెరగడం గమనార్హం. అంటే గత తొమ్మిదేళ్లలో యాసంగిలో వరిసాగు 40.85 లక్షల ఎకరాలు పెరిగింది. 2015–16 యాసంగిలో కేవలం 7.35 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు జరిగింది. ఆ తర్వాతి నుంచి పెరుగుతూ వచ్చింది. వాస్తవానికి ప్రస్తుత వ్యవసాయ సీజన్ (2022–23)లోని వానాకాలంలో కూడా వరిసాగు ఆల్‌టైం రికార్డు నమోదైంది. ఇటీవలి వానాకాలంలో 64.54 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేయడం గమనార్హం. ఇంతకుముందు అత్యధికంగా 2021 వానాకాలంలో 61.94 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు 2013 వానాకాలంలో ఇక్కడ 29.16 లక్షల ఎకరాల్లో వరిసాగు కాగా.. ఇప్పుడది రెండింతలు దాటిపోవడం గమనార్హం. మొత్తంగా ఈసారి వానాకాలం, యాసంగి సీజన్లలో వరిసాగు ఆల్‌టైం రికార్డులను నమోదు చేసుకుంది. ప్రభుత్వ నిర్ణయాలతోనే భారీగా సాగు వానాకాలంలో చెరువులు నిండి పంటలు పండుతాయి. అలాంటిది యాసంగిలో కూడా రికార్డు స్థాయిలో పంటలు, వరి నాట్లు పడటం విశేషం. ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులు, మరోవైపు రాష్ట్రంలోని 30 లక్షల వ్యవసాయ బోర్లకు 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వడం వల్లే ఇది సాధ్యమైంది. ఉచిత కరెంటు కోసం రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే భారీగా సాగు సాధ్యమైంది. రైతులకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. రికార్డు స్థాయిలో పంటలు పండించిన రైతులకు అభినందనలు తెలుపుతున్నాను. – పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు కొన్నేళ్లుగా మొత్తం యాసంగి సాగు తీరు (లక్షల ఎకరాల్లో) ఏడాది సాగు విస్తీర్ణం 2014–15 28.18 2015–16 19.92 2016–17 39.20 2017–18 38.09 2018–19 31.49 2019–20 53.82 2020–21 68.17 2021–22 54.42 2022–23 68.53 కొన్నేళ్లుగా యాసంగి వరిసాగు తీరు (లక్షల ఎకరాల్లో) ఏడాది సాగు విస్తీర్ణం 2014–15 12.23 2015–16 7.35 2016–17 23.20 2017–18 22.61 2018–19 18.34 2019–20 39.31 2020–21 52.80 2021–22 35.84 2022–23 53.08 -
కాళేశ్వరం చేరుకున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిశీలన కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మంగళవారం ఉదయం బయల్దేరారు. కాళేశ్వరం చేరుకుని నేరుగా కాళేశ్వర.. ముక్తేశ్వర స్వామివార్ల దర్శనానికి వెళ్లారు. సీఎం కేసీఆర్, శోభ దంపతులు, మంత్రులకు వేద పండితులు ఘన స్వాగతం పలికి ఆలయం లోపలకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రాజెక్ట్ పరిశీలనకు వెళ్లారు. యాసంగి సీజన్లో కాళేశ్వరం ద్వారా.. నీటిని పంపించే విధానాన్ని పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ ఈ పర్యటన చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని ప్రధాన బ్యారేజ్‌లు పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. యాసంగి సీజన్లో పంటలకు జలాలను పంపింగ్చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కాళేశ్వరంలో పర్యటిస్తున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో కాళేశ్వరం రిజర్వాయర్‌ను పరిశీలిస్తారు. లక్ష్మీ బరాజ్ చేరుకొని.. అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. యాసంగి పంటలకు సరిపడా సాగునీటిని అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అధికారులకు తగిన ఆదేశాలు ఇస్తారు. ఈ సందర్భంగా మీడియాతో ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం ఉంది. బ్యారేజ్ వద్ద సీఎం కేసీఆర్ భోజనం చేసి అక్కడి నుంచి హెలిక్యాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరిగి వెళ్లనున్నారు. సీఎం వెంట ఉమ్మడి కరీంనగర్ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, సాగునీటి అధికారులు ఉన్నారు. -
రైతు వారీగా యాసంగి విస్తీర్ణం సేకరించండి
అధికారులకు పోచారం ఆదేశం సాక్షి, హైదరాబాద్: రైతు వారీగా యాసంగి పంటల విస్తీర్ణం వివరాలను సమగ్రంగా సేకరించాలని అధి కారులను వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో జిల్లా వ్యవసాయా ధికారులతో ఆయన సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ, రైతు వారీగా, పట్టాదారు వారీగా భూమి వివరాలను, పంట సాగు విస్తీర్ణం వివరాలను సేకరించాలని సూచించారు. కొత్తగా నియమితులైన 1,311 వ్యవసాయ విస్తరణాధి కారుల సేవలను వినియోగించుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పథకాలు రైతులకు చేరినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని, ఆ దిశగా వ్యవసాయ శాఖ కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్యదర్శి సి.పార్థసారథి, కమిషనర్ జగన్మోహన్.. తాము అమలు చేస్తున్న పలు పథకాల గురించి జిల్లా వ్యవసాయ అధికారులతో సమీక్షించారు.