‘కట్ట’గట్టి దోపిడీ! | The concept of Mission Kakatiya | Sakshi
Sakshi News home page

‘కట్ట’గట్టి దోపిడీ!

Published Thu, Jul 27 2017 12:31 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM

‘కట్ట’గట్టి దోపిడీ! - Sakshi

‘కట్ట’గట్టి దోపిడీ!

చెరువు కట్టల అభివృద్ధి పనుల్లో భారీగా అంచనాల పెంపు
► సిద్దిపేటలోని ‘కోమటి చెరువు’ను సాకుగా చూపుతూ...
► మినీ ట్యాంక్‌బండ్‌లుగా చెరువుల అభివృద్ధికి సర్కారు నిర్ణయం
► మిషన్‌ కాకతీయలో భాగంగా నియోజకవర్గానికో చెరువు ఎంపిక
► ఇప్పటివరకు రూ.517 కోట్ల అంచనాతో 85 చెరువులకు అనుమతి
► జోక్యం చేసుకుని భారీగా అంచనాలు పెంచేస్తున్న ప్రజాప్రతినిధులు
► ఒక్కో చెరువు పనులు 50 శాతం నుంచి 200 శాతం వరకు పెరుగుదల
 ► సవరించిన పలు అంచనాలకు ఇప్పటికే ఆమోదం  


సాక్షి, హైదరాబాద్‌: మిషన్‌ కాకతీయలో భాగంగా చెరువులను మినీ ట్యాంక్‌బండ్‌లుగా అభివృద్ధి చేసే పనులు అవకతవకలకు నిలయంగా మారిపోతున్నాయి. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల జోక్యంతో పనుల అంచనా వ్యయాలు అడ్డగోలుగా పెరిగిపోతున్నాయి. చెరువుల స్థాయిని, సుందరీకరణ అవసరాన్ని బట్టి చేయాల్సిన పనులే గాకుండా.. అవసరం లేకున్నా మరిన్ని పనులు ప్రతిపాదనల్లో వచ్చి చేరు తున్నాయి. ఎందుకలా అని ప్రశ్నిస్తే మాత్రం సిద్దిపేట పట్టణాన్ని ఆనుకుని ఉన్న కోమటి చెరువు తరహాలో అభివృద్ధి చేస్తామంటూ సాకులు తెరపైకి వస్తున్నాయి.

ఆ చెరువు ఆదర్శమంటూ..
చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన ‘మిషన్‌ కాకతీ య’లో భాగంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున మినీ ట్యాంక్‌బండ్‌లను మంజూరు చేశారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో ఒక్కో చెరువును స్థానిక ఎమ్మెల్యే సూచనల మేరకు మినీ ట్యాంక్‌బండ్‌గా అభి వృద్ధి చేసేందుకు ఎంపిక చేశారు. చెరువు నీటి నిల్వ, కట్ట ఎత్తు, పొడవు, వెడల్పులను ఆధారం చేసుకుని.. ప్రతిపాదనలను రూపొందిస్తున్నారు. అయితే చాలా చోట్ల స్థానిక ఎమ్మెల్యేలు సిద్దిపేటలో అభివృద్ధి చేసిన కోమటి చెరువును చూపుతూ... ఆ తరహా నిర్మాణా లు, ఏర్పాట్లను కోరుతున్నారు. వ్యయ అంచనాలను పెంచేలా ఒత్తిడి తెస్తున్నారు. వాస్తవానికి కోమటి చెరువు ‘మిషన్‌ కాకతీయ’లో భాగంగా చేపట్టిన మినీ ట్యాంక్‌బండ్‌ కాకపోవడం గమనార్హం.

చాలా చోట్ల ఇదే తీరు..
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పరిపాలనా అనుమతులు ఇచ్చిన 85 మినీ ట్యాంక్‌బండ్‌లలో రెండు మూడు మినహా మిగతా వాటన్నింటికీ అంచనాలు పెరుగుతు న్నాయి. ఈ 85 మినీ ట్యాంక్‌బండ్‌ల నిర్మాణం కోసం మొత్తంగా రూ.517 కోట్లు అవసరమని తొలుత అంచనా వేయగా... తాజాగా మరో రూ.200 కోట్ల మేర పెరిగే అవకాశముందని చెబుతున్నారు.

నిబంధనలివీ..
మినీ ట్యాంక్‌ బండ్‌ చెరువుల మార్గదర్శకాల ప్రకారం... చెరువు కట్ట చుట్టూ వాకింగ్, సైక్లింగ్‌ చేసేలా తీర్చిదిద్దాలి. బెంచీలు, తిను బండారాల కేంద్రాలు, బోటింగ్‌ కోసం జెట్టీలు, బతుకమ్మ ఘాట్‌లను నిర్మించాల్సి ఉంటుంది. పిల్లల పార్కు ఏర్పాటు చేయవచ్చు. ఇక చెరువు కట్ట వెడల్పు 6 మీటర్ల నుంచి 6.5 మీటర్ల వరకు ఉండాలి. ఒకవేళ కట్ట పొడవు ఎక్కువగా ఉంటే అందులో 300 మీటర్ల పొడవు వరకు 8 మీటర్ల వెడల్పుతో కట్టను నిర్మించుకునే వెసులుబాటు కల్పించారు.

అడ్డగోలుగా పెంచేస్తున్నారు..
ప్రస్తుతం కట్ట వెడల్పు అంశం వద్దే చెరువు పనుల్లో అంచనాల పెంపు జరుగుతోంది. చెరువు కట్ట నిర్మాణం పూర్తిగా మట్టిపనితో ముడిపడి ఉంటుంది. పూడికతీతలో భాగంగా చెరువులో నుంచి తీసిన మట్టినే కట్ట పనికి వినియోగిస్తున్నారు. కానీ ఆ మట్టిని దూర ప్రాంతం నుంచి తెచ్చినట్లుగా చూపిస్తుంటారు. దీంతో ఇటు చెరువు పూడికతీత, అటు కట్ట నిర్మాణంతో రెండు బిల్లులు పొందే అవకాశ«ం కాంట్రాక్టర్లకు లభిస్తోంది. ఇక చాలా చెరువుల కట్టలను ఇప్పటికే వివిధ పథకాల కింద పలుసార్లు పునరుద్ధరించారు.

అంటే ప్రస్తుతం ఆయా చెరువు కట్టల పునరుద్ధరణ పనులు తక్కువ ఖర్చుతోనే పూర్తవుతాయి. దీంతో కాంట్రాక్టర్లు చెరువు కట్టల పనులపై మక్కువ చూపుతుంటారు. ప్రస్తుతం చాలా చోట్ల స్థానిక ఎమ్మెల్యేల బినామీలు లేదా అనుచరులే కాంట్రాక్టర్లుగా ఉండటంతో... అంచనాల పెంపు కోసం ఎమ్మెల్యేలు అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. కట్ట వెడల్పును కొన్ని చోట్ల 12 మీటర్ల నుంచి 20 మీటర్ల వరకు పెంచుతుండటం గమనార్హం. ఒకటిరెండు చోట్ల ఏకంగా 25 మీటర్ల వరకు కూడా పెంచారని నీటి పారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి.

ఏమిటీ కోమటి చెరువు?
సిద్దిపేటలోని కోమటి చెరువును 2010 నుంచి అభివృద్ధి చేస్తున్నారు. చెరువుకట్టపై సేద తీరేలా ఏర్పాట్లు, పిల్లల కోసం మినీ పార్కు, చెరువులో బోటింగ్‌ వంటివి ఏర్పాటు చేశారు. రెయిలింగ్‌ వంటివాటితో సుందరీకరించారు. ఇందుకోసం మూడు ప్రభుత్వ శాఖలు కలసి వివిధ దశల్లో రూ.15 కోట్లకుపైగా ఖర్చుపెట్టాయి. ఇందులో రూ.9.3 కోట్లతో నీటి పారుదల శాఖ, రూ.2.5 కోట్లతో పర్యాటక శాఖ, మరో రూ.3 కోట్లతో మున్సిపల్‌ శాఖ పనులు చేశాయి. ఇన్ని సౌకర్యాలు ఉండటంతో రోజూ సాయంత్రాలు సిద్దిపేట, సమీప ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వచ్చి సేద తీరుతుంటారు.

రెండు మూడు రెట్లు పెంపు!
మహబూబాబాద్‌లోని అనంతారంలో ఉన్న మైసమ్మ చెరువు పనుల అంచనాను స్థానిక ఎమ్మెల్యే సూచనల మేరకు రూ.83.80 లక్షల నుంచి రూ.3.04 కోట్లకు పెంచారు. మళ్లీ రూ.4.50 కోట్లతో కొత్త అంచనాలు వేసినట్లు తెలుస్తోంది. సూర్యాపేటలోని చౌదరి చెరువు మినీ ట్యాంక్‌బండ్‌ పనుల వ్యయాన్ని రూ.10 కోట్ల నుంచి ఏకంగా రూ.18.78 కోట్లుగా ప్రతిపాదించారు. కానీ అధికారులు ఆ స్థాయిలో పెంచలేమని రూ.16.32 కోట్లకు సవరించారు.

ఖమ్మంలోని లాకారం చెరువు తొలి అంచనా రూ.7.78 కోట్లుకాగా.. అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల జోక్యంతో కొత్తగా మరిన్ని నిర్మాణాలు చేరి రూ.13.50 కోట్లకు చేరింది. దీనికి అధికారిక ఉత్తర్వులు సైతం వెలువడ్డాయి. జనగాంలోని ధర్మవాణి కుంట, బెల్లంపల్లిలోని పోచమ్మచెరువు, ములుగులోని తోపుకుంట చెరువు, ఖానాపూర్‌లోని గోపయ్య చెరువు, మేడ్చల్‌ పరిధిలోని ఏదులాబాద్‌ మినీ ట్యాంక్‌ బండ్‌ల అంచనాలకు కూడా వ్యయం పెంపు ప్రతిపాదనలు అందినట్లు తెలిసింది. మొత్తంగా చాలా చోట్ల నుంచి స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. పలు చోట్ల అధికారులు ఆ ప్రతిపాదనలను పక్కనపెడుతున్నా.. మరికొన్ని చోట్ల మాత్రం ఒత్తిడికి తలొగ్గి అంచనాలు పెంచేస్తున్నారు.


పలు చోట్ల పెంచిన అంచనా వ్యయాలు (రూ.కోట్లలో)
నియోజకవర్గం            చెరువు పేరు               తొలి అంచనా              తాజా అంచనా
నాగర్‌కర్నూల్‌           కేసరి సముద్రం                  8                                12
సూర్యాపేట                చౌదరి చెరువు               10.57                           16.32
మహబూబాబాద్‌       మైసమ్మ చెరువు               3                               4.50
ఖమ్మం                         లాకారం                      7.78                          13.50
చొప్పదండి                  కడిచెరువు                    1.07                            2.23
ఆదిలాబాద్‌                ధర్మసాగర్‌                      4.03                            5.60
పరకాల                   దామరచెరువు                     3                                5
నిజామాబాద్‌ అర్బన్‌  రఘునాథచెరువు            6.50                               8
డోర్నకల్‌                   కొండ సముద్రం               2.50                            3.50
పెద్దపల్లి                   ఎల్లమ్మగుండం                 5.88                            7.20

మినీ ట్యాంక్‌బండ్‌ల ప్రతిపాదనలివీ..
మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు   98
ప్రతిపాదనలు అందినవి 92
అనుమతులు మంజూరైనవి 85
అనుమతుల విలువ 517 కోట్లు (రూపాయల్లో)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement