సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూగర్భజలాలు పెరిగాయి. పాతాళం నుంచి పైపైకి వచ్చాయి. ఆగస్టులో కురిసిన వర్షాలు భూగర్భజలానికి ఊపిరులూదాయి. గడచిన రెండేళ్లుగా తీవ్ర వర్షాభావంతో పాతాళానికి పడిపోయిన భూగర్భజలాలు.. భారీ వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి పెరిగిన జల ప్రవాహాల కారణంగా పైపైకి వచ్చాయి. ఒక్క ఆగస్టులో కురిసిన వర్షాలతోనే రాష్ట్రవ్యాప్తంగా సగటున 0.39 మీటర్ల మేర భూగర్భ జలమట్టం పెరిగింది. మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టిన చెరువుల్లో నీరు సమృద్ధిగా చేరడంతో వర్షపునీరు సంతృప్తికరంగా భూమిలోకి ఇంకిందని భూగర్భ జలవనరుల విభాగం పేర్కొంటోంది. రాష్ట్రంలో గడిచిన రెండేళ్ల కాలంలో అరకొర వానలే పడటంతో తెలంగాణవ్యాప్తంగా తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. అంతేకాకుండా భూగర్భజలాలు పూర్తిగా ఇంకిపోయి పాతాళానికి చేరుకున్నాయి.
గత ఏడాది ఆగస్టులో నీటిమట్టం 10.13 మీటర్లకు పడిపోయింది. భూగర్భ నీటి వినియోగం పెరడగడంతో ఈ ఏడాది మే నాటికి అది ఏకంగా 12.78 మీటర్ల గరిష్టానికి చేరింది. మొత్తం 44,706 చెరువులకుగానూ 15,800 చెరువులు పూర్తిస్థాయిలో నిండాయి. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 200లకు పైగా చెరువులను నింపారు. జూరాల, నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల ద్వారా చెరువులకు నీటిని విడుదల చేశారు. దీని వల్ల భూగర్భ జలమట్టం పెరిగింది. గత ఏడాది ఆగస్టులో రాష్ట్ర సరాసరి నీటిమట్టం 10.13 మీటర్లు ఉండగా అది ప్రస్తుతం 9.74 మీటర్లకు చేరింది. 0.39 మీటర్ల మేర భూగర్భజలం పెరగ్గా, ఈ ఏడాది మే నెలతో పోలిస్తే ఏకంగా 3.04 మీటర్ల మేర భూగర్భ జలాల నీటి మట్టం పెరిగింది.
మేడ్చల్ జిల్లాలో గత ఏడాది ఆగస్టులో నీటి మట్టం 16.48 మీటర్ల లోతున మట్టం ఉండగా అది ప్రస్తుతం 12.71 మీటర్లుగా నమోదైంది. ఏకంగా 3.77 మీటర్ల మేర భూగర్భజలాలు మెరుగయ్యాయి. ఆదిలాబాద్, నల్లగొండ, మహబూబాబాద్ జిల్లాల్లోనూ 3 మీటర్లకుపైగా భూగర్భమట్టం పెరిగింది. అయితే, మంచిర్యాల జిల్లాలో గత ఏడాది కంటే భిన్నంగా 3.80 మీటర్ల మేర నీటి మట్టం పడిపోగా, సిద్దిపేట, గద్వాల్, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాలోనూ భూగర్భమట్టాలు గత ఏడాది కంటే పడిపోయాయి. సరైన వర్షాలు లేని కారణంగా ఆయా జిల్లాల్లో భూగర్భ మట్టాల్లో పెరుగుదల లేదని భూగర్భ జల విభాగం వర్గాలు వెల్లడించాయి.
పాతాళం నుంచి పైపైకి..!
Published Sat, Sep 8 2018 1:55 AM | Last Updated on Sat, Sep 8 2018 1:55 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment