నిండుడు.. అలుగు పోసుడు..
1,207 చెరువులకు జలకళ
ప్రాజెక్టుల్లోకి చేరుతున్న వర్షపు నీరు
‘మిషన్’ పనులకు తాత్కాలిక బ్రేక్
ఖమ్మం అర్బన్ : నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెరువుల్లోకి కొత్త నీరు చేరుతోంది. కొన్ని చెరువులు నిండుతుండగా.. మరికొన్ని అలుగు పోస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా 4,517 చెరువులు ఉండగా.. బుధవారం నాటికి అధికారిక లెక్కల ప్రకారం 1,207 చెరువులు నిండి అలుగు పోస్తున్నాయి. 1,846 చెరువుల్లోకి 25 శాతం మేర నీరు చేరింది. 25 శాతం నుంచి 50 శాతం వరకు చేరిన చెరువులు 435, 50 నుంచి 75 శాతం మేర నీరు చేరిన చెరువులు 455, 75 శాతం నుంచి 100 శాతం 574 చెరువుల్లోకి నీరు చేరింది. వర్షాల వల్ల మిషన్ కాకతీయ రెండో విడత పనులకు బ్రేక్ పడింది. రూ.29792.30లక్షల అంచనాతో మొత్తం 962 చెరువులకు ప్రభుత్వం ఈ ఏడాది అనుమతులు ఇచ్చింది. వాటిలో 916 చెరువుల్లో పనులు మొదలుపెట్టగా.. వాటిలో 166 చెరువుల పనులు పూర్తయినట్లు, 750 చెరువుల్లో పనులు తుది దశకు చేరుకున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో చెరువు అలుగు స్థాయిలోకి నీరు చేరితే ఇక ఈ ఏడాది పునరుద్ధరణ పనులు నిలిచినట్లే.