సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ పడింది. బకాయిలు చెల్లించకపోవడంతో ఎమర్జెన్సీ సేవలు మినహా ఆరోగ్యశ్రీ సేవలను నెట్‌వర్క్ ఆసుపత్రులు నిలిపివేశాయి. ఆరోగ్యశ్రీ సీఈవో లక్ష్మీషాతో ఏపీ స్పెషాలిటీ హాస్పటల్ అసోసియేషన్ చర్చలు విఫలమయ్యాయి.
రాష్ట్ర వ్యాప్తంగా రూ.2500 కోట్ల బకాయిలకు 200 కోట్లు తక్షణమే చెల్లిస్తామన్న ఆరోగ్యశ్రీ సీఈవో లక్ష్మీషా.. మరో రూ.300 కోట్లు సోమవారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. మొత్తం బకాయిలు చెల్లించకపోతే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడం మినహా గత్యంతరం లేదని అసోసియేషన్ తేల్చి చెప్పింది. చర్చలు విఫలం కావడంతో అత్యవసర సేవలు మినహా ఆరోగ్యశ్రీ సేవలను ఆసుపత్రులు నిలిపివేశారు. రేపు(శుక్రవారం) స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్‌తో మంత్రి సత్యకుమార్ చర్చించనున్నారు.
రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యానికి సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. పథకం ఊసే లేకుండా చేయాలని సీఎం చంద్రబాబు నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో పథకం నిర్వహణకు డబ్బులు లేవు.. కేంద్రం అమలు చేసే ఆయుష్మాన్ భారత్ పథకాన్నే ప్రజలు వినియోగించుకోవాలంటూ టీడీపీకి చెందిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఉచిత సలహా ఇచ్చిన సంగతి తెలిసిందే.
మరోవైపు పథకం స్థానంలో బీమా ప్రవేశ పెట్టడానికి సిద్ధమైన బాబు సర్కార్.. నెట్‌వర్క్ ఆస్పత్రులకు బకాయిల చెల్లింపులో జాప్యం చేస్తోంది. దీంతో ఆస్పత్రుల నిర్వహణ సాధ్యం కావడం లేదని, సిబ్బందికి జీతాల చెల్లింపు, మందులు, కన్జుమబుల్స్ కొనుగోలుకు కూడా డబ్బులు లేవని నెట్‌వర్క్ ఆస్పత్రులు చేతులెత్తేశాయి.
Comments
Please login to add a commentAdd a comment