సంక్షేమం మా బాధ్యత
♦ మిషన్ కాకతీయ, భగీరథలతో సత్ఫలితాలు
♦ మూడు లక్షలకు చేరిన ఆసరా లబ్ధిదారులు
♦ అమరుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు
♦ అవతరణ వేడుకల్లో మంత్రి మహేందర్‌రెడ్డి
అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఉద్ఘాటించారు. ప్రజా సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం సమీపంలో ఉన్న అమరవీరుల స్తూపానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివ రించారు. - సాక్షి, రంగారెడ్డి జిల్లా
⇔ జిల్లాలో 33 మంది అమరుల కుటుంబాలకు గాను 25 మందికి ప్రస్తుతం ఉద్యోగాలిస్తున్నాం. మిగిలిన వారికీ ఇస్తాం.
⇔ 1,122 చెరువుల్లో పూడికతీత పనులు కోసం దాదాపు రూ.370 కోట్లు ఖర్చు చేశాం.
⇔ మిషన్ భగీరథ పనులను రూ.1,960 కోట్లతో ప్రారంభించాం.
⇔ జిల్లాలో తొలివిడతలో 6,850 డబుల్ బెడ్‌రూం ఇళ్లను మంజూరు చేశాం.
⇔ 11.44 లక్షల కుటుంబాలు రూపాయికే కిలో బియ్యం ద్వారా లబ్ధి పొందుతున్నాయి.
⇔ మహిళా సంఘాల సభ్యులకు రూ.406 కోట్ల లింకు రుణాలు ఇచ్చాం.
⇔ పంటరుణాల కింద రైతులకు రూ.730 కోట్లు పంపిణీ చేశాం.
⇔ ఉపాధి హామీ పథకం కింద 117 లక్షల పనిదినాలు కల్పించాం.
⇔ రోడ్ల కోసం రూ.1,020 కోట్లు ఖర్చు చేశాం.
అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. వారి త్యాగాలను ప్రభుత్వం గుర్తించింది. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తూ గౌరవిస్తున్నాం. - మంత్రి మహేందర్‌రెడ్డి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని.. వారి త్యాగాలకు ప్రతికగా అమరుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నట్లు మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. జిల్లాలో 33 మంది అమరుల కుటుంబాలకు గాను 25 మందికి ప్రస్తుతం ఉద్యోగాలిస్తున్నట్లు వెల్లడించారు. మిగతా వారికికూడా ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నట్లు ప్రకటించారు. చెరువులు, కుంటలు జలాలతో కలకలలాడించేందుకు తలపెట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమం వేగవంతంగా సాగుతోందన్నారు. రాష్ట్రం ఏర్పాటై రెండేళ్లు కావస్తున్నదని.. ఈ కాలంలో జిల్లాలో 1,122 చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టామన్నారు. ఇప్పటికే సాగినికపైగా పనులు పూర్తయ్యాయని.. దాదాపు రూ.370 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రతి వ్యక్తికి శుద్ధనీరు..
రాష్ట్రంలోని ప్రతి పౌరుడికీ శుద్ధమైన తాగునీరు అందించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. ఇందులో భాగంగా మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టామని, జిల్లాలో రూ.1,960 కోట్లతో పనులు ప్రారంభించామన్నారు. ఈనెలాఖరు నాటికి మేడ్చల్ అసెంబ్లీ సెగ్మంట్‌లోని 104 అవాసాల్లోని ప్రజలకు తాగునీరు అందించనున్నట్లు వివరించారు. ప్రతి కుటుంబానికీ గూడు ప్రభుత్వ బాధ్యతని, జిల్లాలో తొలివిడత కింద 6,850 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మంజూరు చేశామన్నారు. ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభించామని.. త్వరలో లబ్ధిదారులకు అందిస్తామన్నారు. రూపాయికే కిలో బియ్యం కార్యక్రమం కింద జిల్లాలో 11.44లక్షల కుటుంబాలకు తిండిగింజలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.
మహిళలకు భరోసా...
మహిళలను ఆర్థికంగా బలపర్చేందుకు బ్యాంకు లింకేజీ రుణాలు ఇస్తున్నామని మంత్రి మహేందర్‌రెడ్డి వివరించారు. గతేడాది జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు రూ.406 కోట్ల లింకు రుణాలు అందించామన్నారు. పంటరుణాల కింద రైతులకు రూ.730 కోట్లు పంపిణీ చేశామని, ఉపాధి హామీ పథకం కింద 117 లక్షల పనిదినాలు కూలీలకు కల్పించామన్నారు. పంచాయతీ రాజ్ రోడ్ల అభివృద్ధికి రూ.220 కోట్లు ఖర్చు చేయగా.. ఆర్‌అండ్‌బీ రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలకు రూ.800 కోట్లు వెచ్చించామన్నారు. ప్రసంగం అనంతరం వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలందించిన 25 మందికి మంత్రి నగదు పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ రఘునందన్‌రావు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, టి.రామ్మోహన్‌రెడ్డి, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.