తెలంగాణ కోటి అవకాశాల ఖజానా
♦ గవర్నర్ నరసింహన్ ఆకాంక్ష
♦ నవ్య శక్తిగా, భవ్య శక్తిగా, ప్రచండ శక్తిగా అవతరించాలి
♦ రాష్ట్రానికి మంచి విజన్ ఉన్న సీఎం ఉన్నారు
♦ తొందరగా బంగారు తెలంగాణ కల సాకారం కావాలి
♦ ప్రభుత్వం బాగా పనిచేస్తోందంటూ కితాబు
సాక్షి, హైదరాబాద్: ‘‘నా తెలంగాణ కోటి రతనాల వీణ అనేది నాటి మాట ‘నా తెలంగాణ కోటి అవకాశాల ఖజానా’ అనేది నేటి మాట. నవ్య శక్తిగా, భవ్య శక్తిగా, ప్రచండ శక్తిగా తెలంగాణ అవతరించాలి’’ అని గవర్నర్ నరసింహన్ అభిలషించారు. ‘‘కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలంటే ఓ గొప్ప లక్ష్యం.. దాన్ని సాధించుకునే దృక్పథం.. సాకారం చేసే నిర్వహణ పటిమ ఉన్న బృందం అవసరం. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చేందుకు మంచి విజన్ ఉన్న ముఖ్యమంత్రి ఉన్నారు. ఆయనకు సహకరించే మంత్రివర్గ, అధికారవర్గ బృందం కూడా ఉంది. అనతికాలంలోనే రాష్ట్రం ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ అని ఆయన అన్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో వివిధ రంగాల ప్రముఖులతో నిర్వహించిన సమావేశంలో గవర్నర్ ప్రసంగించారు. గవర్నర్ ఓ పెద్దన్న తరహాలో తనకు మార్గనిర్దేశం చేస్తున్నారంటూ సీఎం తన ప్రసంగంలో పేర్కొంటే... తెలంగాణ ప్రభుత్వం గొప్పగా పనిచేస్తోందంటూ గవర్నర్ కితాబిచ్చారు. దాదాపు గంటపాటు గవర్నర్ ఉత్సాహంగా మాట్లాడారు. మధ్యమధ్యలో అంద్శై కాళోజీలాంటి వారి మాటలను ఉటంకించారు. అధికారుల పనితీరు బాగుందని, పోలీసులు గొప్పగా పనిచేస్తున్నారని, గడచిన రెండేళ్లలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే ఏ చిన్న ఘటన కూడా జరగకపోవటమే ఇందుకు నిదర్శనమన్నారు.
‘బతుకమ్మ’ ఆకాంక్ష సాకారం కావాలి
‘‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. యావత్తు తెలంగాణ ఒకే గొంతుకతో పాడుతున్న పాట ఇది. ఇందులో ప్రజల ఆకాంక్ష ఇమిడి ఉంది. అది పాటగానే మిగిలి పోకూడదు, సాకారం కావాలి. ఆ దిశలో ప్రభుత్వం పనిచేయాలి. ఇప్పుడు చాలా ప్రభు త్వ కార్యాలయాల్లో రాత్రి పది వరకు ఉండి అధికారులు పనిచేస్తున్నారు. నిన్న ఓ అధికారితో మాట్లాడుతూ... ఓ విషయం గురించి అడిగితే మేం బయటకు వస్తే కదా తెలిసేది అన్నారు’’ అని గవర్నర్ పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు ఎలా అమలవుతున్నాయో తాను చెప్పటం కాదని, కుదిరితే ఫీల్డ్ పైకి వెళ్లి చూడాలని సీఎం తనతో అన్నారని, అలా వెళ్లి చూసినప్పుడు మంచి అంశాలు తన దృష్టికి వచ్చాయని కితాబిచ్చారు. దళారుల బాధ లేకుండా రైతన్న సంతోషంగా ఉండేందుకు కృషి జరుగుతోందన్నారు. ఢిల్లీలో సీనియర్ అధికారులకు కూడా సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఇస్తున్న తరుణంలో ఇక్కడ రెండు పడక గదుల ఇళ్ల పథకం ఎందుకు ప్రారంభించారని ఓసారి తాను సీఎంను అడగ్గా... ‘‘ప్రతి ఇంట్లో ఓ అమ్మాయి ఉంటుందని, ఆమెకు ప్రైవసీ ఉండాల్సిన అవసరం లేదంటారా..’’ అని సీఎం నన్ను ప్రశ్నించారన్నారు.
భగీరథ.. భేషైన పథకం..
రాష్ట్రవ్యాప్తంగా 45 వేల చెరువుల్లో మిషన్ కాకతీయ పనులు జరిగి వరుణుడు కరుణించి వానలు కురిస్తే అవన్నీ నీటితో కళకళలాడుతాయని గవర్నర్ అన్నారు. నీళ్లు ఇక ఇంటింటికి వచ్చేలా మిషన్ భగీరథ పనులు జరుగుతున్నాయని ప్రశంసించారు. కరెంటు కోతలు లేని తెలంగాణను కొద్దిరోజుల్లో చూస్తారని కేసీఆర్ తనతో చెప్పారన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వంపై భారం తగ్గేలా సౌర విద్యుత్‌ను ప్రోత్సహించాలన్నారు. రాజ్‌భవన్‌లో 100 శాతం సౌర విద్యుత్తును వినియోగిస్తున్నామన్నారు. విద్య, ఆరోగ్యంపై ప్రజలు చైతన్యాన్ని పెంచుకోవాలని, ఇందుకు ఆయా రంగాల ప్రముఖులూ చేయూత ఇవ్వాలన్నారు. రాయి తీ బియ్యం అవసరం లేదనే ఆర్థిక స్థితికి పేద కుటుంబాలు చేరుకోవాలన్నారు. తెలంగాణను ముందుకు తీసుకెళ్లే క్రతువులో ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు వారి ముందుకే వెళ్లాలని సీఎంకు సూచించానని గవర్నర్ చెప్పారు. ఐదేళ్ల కోర్సులో ఉన్నప్పుడు మధ్యంతర పరీక్ష అవసరమే కదా.. ఈ సభ కూడా అలాంటి పరీక్షలాంటిదేనని, తాను ఎగ్జామినర్‌గా హాజరయ్యాన న్నారు.