అలుగుపోస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల చెరువు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో చెరువులకు పూర్వవైభవం తెచ్చేలా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం సత్ఫలితాలిస్తోంది. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంతో రాష్ట్రం లో చాలా వరకు చెరువులు జలకళను సం తరించుకున్నాయి. ఇటీవల కురిసిన వరుస వర్షాలకు చాలా చెరువులు అలుగుపారుతున్నా యి. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని 36% చెరువులు 100% నిండగా మరో 15%వరకు చెరువులు 75%, అదే స్థాయిలో చెరువులు 50%, మిగిలినవి 25% నిండాయి. దీంతో ఈ రబీ సీజన్‌లో చెరువుల కింద 18 లక్షలకుపైగా ఎకరాలు సాగులోకి వస్తాయని సాగునీటిశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మిషన్ కాకతీయ ఫలితంగానే చెరువుల్లో జలకళ సాధ్యమైందని చెబుతున్నాయి.
పదేళ్ల్ల తర్వాత నిండిన జగిత్యాల జిల్లా బండలింగాపూర్ చెరువు
చెరువుల్లో నీళ్లే నీళ్లు...
ఈ ఏడాది రాష్ట్రంలోని మొత్తం 43,855 చెరువులకుగాను 36%అంటే 15,689 చెరువులు 100% నిండాయి. ఈ చెరువుల కింద గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ రబీలో వ్యవసాయ పనులు సాగుతున్నాయి. అత్యధిక సంఖ్యలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 4,195 చెరువులు పూర్తిగా నిం డాయి. ఈ జిల్లాలో మొత్తం 6,052 చెరువులు ఉండగా అందులో 70% చెరువులు జలకళతో ఉట్టిపడుతున్నాయి. మరో 10 శాతం చొప్పున చెరువుల్లో 25, 50, 75 శాతం నీరు చేరింది. అదే ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఏకంగా 76 శాతం చెరువులు గరిష్ట నీటిమట్టానికి చేరుకున్నాయి. ఇక్కడ మొత్తం 2,702 చెరువులుండగా అందులో 2,050 చెరువులు ఎఫ్‌టీఎల్ స్థాయికి చేరుకున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. మిగిలిన జిల్లాల్లో కూడా వేల సంఖ్యలో చెరువులు 100 శాతం నిండగా మహబూబ్‌నగర్‌లో 599, నల్లగొండలో 431, అత్యల్పంగా రంగారెడ్డి జిల్లాలో 64 చెరువుల్లో గరిష్టంగా నీరు చేరింది. ఇంకో విషయమేమిటంటే రాష్ట్రంలోని మొత్తం చెరువుల్లో 25 శాతమే నీరు చేరిన చెరువుల కంటే 100 శాతం నిండిన చెరువుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. మొత్తం 15,616 చెరువుల్లో 25 శాతం నీరు చేరగా 15,689 చెరువులు నీటితో పూర్తిగా నిండిపోయాయి.
మిషన్ కాకతీయ ప్రస్థానం ఇదీ...
రాష్ట్రంలోని చెరువుల పునరుద్ధరణే ధ్యేయంగా 2015 మార్చి 12న సీఎం కేసీఆర్ అప్పటి సాగునీటి మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో నిజామాబాద్ జిల్లా సదాశివనగర్‌లో ఈ పథకాన్ని ప్రారంభించారు. దేశంలో రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి తక్కువ వ్యయంతో ఎక్కువ దిగుబడులు సాధించే దిశగా అధ్యయనం చేస్తున్న మిషిగాన్ యూనివర్సిటీ ఈ పథకం అమలు తీరును పరిశీలించింది. వర్సిటీ పరిధిలోని 8 విద్యాసంస్థలకు చెందిన 16 మంది విద్యార్థులు 2016–17 సంవత్సరంలో ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని రెండు గ్రామాల్లో ఏడాదిపాటు ఈ పథకం అమలు తీరును పరిశీలించారు. షికాగో వర్సిటీ–టాటా డెవలప్‌మెంట్ సెంటర్ రెండేళ్ల సమగ్ర అధ్యయనానికి అప్పట్లో ముందుకొచి్చంది. ఈ పథకం అమలు తీరును పరిశీలించాలని నాబార్డు సంస్థ నాబ్కాన్స్‌కు సూచించగా ఆ సంస్థ 2017 చివర్లో నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ప్రకారం మిషన్ కాకతీయ అమల్లోకి వచ్చిన తర్వాత చెరువుల కింద 51 శాతం ఆయకట్టు పెరిగిందని, ఎండిపోయిన 17 శాతం బోర్లు మళ్లీ నీటిని పోస్తున్నాయని వెల్లడైంది. అలాగే రసాయనిక ఎరువుల వినియోగం తగ్గడంతోపాటు భూగర్భ జలాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాయని, చేపల లభ్యత 39 శాతం పెరిగిందని తేలింది.
Comments
Please login to add a commentAdd a comment