Lakes Restoration
-
తటాక తెలంగాణ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో చెరువులకు పూర్వవైభవం తెచ్చేలా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం సత్ఫలితాలిస్తోంది. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంతో రాష్ట్రం లో చాలా వరకు చెరువులు జలకళను సం తరించుకున్నాయి. ఇటీవల కురిసిన వరుస వర్షాలకు చాలా చెరువులు అలుగుపారుతున్నా యి. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని 36% చెరువులు 100% నిండగా మరో 15%వరకు చెరువులు 75%, అదే స్థాయిలో చెరువులు 50%, మిగిలినవి 25% నిండాయి. దీంతో ఈ రబీ సీజన్లో చెరువుల కింద 18 లక్షలకుపైగా ఎకరాలు సాగులోకి వస్తాయని సాగునీటిశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మిషన్ కాకతీయ ఫలితంగానే చెరువుల్లో జలకళ సాధ్యమైందని చెబుతున్నాయి. పదేళ్ల్ల తర్వాత నిండిన జగిత్యాల జిల్లా బండలింగాపూర్ చెరువు చెరువుల్లో నీళ్లే నీళ్లు... ఈ ఏడాది రాష్ట్రంలోని మొత్తం 43,855 చెరువులకుగాను 36%అంటే 15,689 చెరువులు 100% నిండాయి. ఈ చెరువుల కింద గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ రబీలో వ్యవసాయ పనులు సాగుతున్నాయి. అత్యధిక సంఖ్యలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 4,195 చెరువులు పూర్తిగా నిం డాయి. ఈ జిల్లాలో మొత్తం 6,052 చెరువులు ఉండగా అందులో 70% చెరువులు జలకళతో ఉట్టిపడుతున్నాయి. మరో 10 శాతం చొప్పున చెరువుల్లో 25, 50, 75 శాతం నీరు చేరింది. అదే ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఏకంగా 76 శాతం చెరువులు గరిష్ట నీటిమట్టానికి చేరుకున్నాయి. ఇక్కడ మొత్తం 2,702 చెరువులుండగా అందులో 2,050 చెరువులు ఎఫ్టీఎల్ స్థాయికి చేరుకున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. మిగిలిన జిల్లాల్లో కూడా వేల సంఖ్యలో చెరువులు 100 శాతం నిండగా మహబూబ్‌నగర్‌లో 599, నల్లగొండలో 431, అత్యల్పంగా రంగారెడ్డి జిల్లాలో 64 చెరువుల్లో గరిష్టంగా నీరు చేరింది. ఇంకో విషయమేమిటంటే రాష్ట్రంలోని మొత్తం చెరువుల్లో 25 శాతమే నీరు చేరిన చెరువుల కంటే 100 శాతం నిండిన చెరువుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. మొత్తం 15,616 చెరువుల్లో 25 శాతం నీరు చేరగా 15,689 చెరువులు నీటితో పూర్తిగా నిండిపోయాయి. మిషన్ కాకతీయ ప్రస్థానం ఇదీ... రాష్ట్రంలోని చెరువుల పునరుద్ధరణే ధ్యేయంగా 2015 మార్చి 12న సీఎం కేసీఆర్ అప్పటి సాగునీటి మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో నిజామాబాద్ జిల్లా సదాశివనగర్‌లో ఈ పథకాన్ని ప్రారంభించారు. దేశంలో రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి తక్కువ వ్యయంతో ఎక్కువ దిగుబడులు సాధించే దిశగా అధ్యయనం చేస్తున్న మిషిగాన్ యూనివర్సిటీ ఈ పథకం అమలు తీరును పరిశీలించింది. వర్సిటీ పరిధిలోని 8 విద్యాసంస్థలకు చెందిన 16 మంది విద్యార్థులు 2016–17 సంవత్సరంలో ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని రెండు గ్రామాల్లో ఏడాదిపాటు ఈ పథకం అమలు తీరును పరిశీలించారు. షికాగో వర్సిటీ–టాటా డెవలప్మెంట్ సెంటర్ రెండేళ్ల సమగ్ర అధ్యయనానికి అప్పట్లో ముందుకొచి్చంది. ఈ పథకం అమలు తీరును పరిశీలించాలని నాబార్డు సంస్థ నాబ్కాన్స్కు సూచించగా ఆ సంస్థ 2017 చివర్లో నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ప్రకారం మిషన్ కాకతీయ అమల్లోకి వచ్చిన తర్వాత చెరువుల కింద 51 శాతం ఆయకట్టు పెరిగిందని, ఎండిపోయిన 17 శాతం బోర్లు మళ్లీ నీటిని పోస్తున్నాయని వెల్లడైంది. అలాగే రసాయనిక ఎరువుల వినియోగం తగ్గడంతోపాటు భూగర్భ జలాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాయని, చేపల లభ్యత 39 శాతం పెరిగిందని తేలింది. -
నత్తనడకన చెరువుల పునరుద్ధరణ పనులు
-
మిషన్.. పరేషాన్..!
నత్తనడకన చెరువుల పునరుద్ధరణ పనులు అధికారుల అక్రమాలతో మసకబారుతున్న ‘మిషన్ కాకతీయ’ ప్రభ ఇప్పటికే ఐదుగురు సస్పెన్షన్, నలుగురు ఏసీబీ కేసులో తాజాగా టేకులపల్లిలో ఈఈని అరెస్ట్ చేసిన సీబీసీఐడీ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ పథకం నత్తనడక నడుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణ మందకొడిగా సాగుతోంది. రెండేళ్ల కింద ప్రారంభించిన తొలి విడత పనుల్లోనే వెయ్యికి పైగా చెరువుల పనులు ఇంకా సాగుతుండగా... రెండో విడత చేపట్టిన వాటిలో కేవలం పది శాతం చెరువులే పూర్త య్యాయి. ఇక ఇప్పటికే ప్రారంభం కావాల్సిన మూడో విడతకు అతీగతీ కనిపించడం లేదు. పనుల్లో తీవ్ర జాప్యానికి తోడు అధికారుల అక్రమాలతో ‘మిషన్ కాకతీయ’ ప్రభ మసక బారుతోంది. ఇంత మందకొడిగానా: మిషన్ కాకతీయ పథకంలో రెండేళ్ల కింద తొలి విడతగా 9,586 చెరువుల పునరుద్ధరణ లక్ష్యంగా పెట్టుకోగా.. అందులో 8,120 చెరువుల పనులను రూ.2,596 కోట్లతో చేపట్టారు. ఇందులోనూ 8,043 చెరువు పనులనే ప్రారంభించగా.. ఇప్పటివరకు 6,939 చెరువులు మాత్రమే పూర్తయ్యాయి. మరో 1,104 చెరువుల పను లు ఇంకా కొనసాగుతున్నాయి. ఇక రెండో విడతలో 10,193 చెరువులను లక్ష్యంగా పెట్టు కోగా... 9,030 చెరువులకు పరిపాలనా అను మతులు మంజూరు చేసి, రూ.1,744 కోట్లతో 8,701 చెరువుల పనులను మొదలు పెట్టారు. వీటిలో ఇప్పటివరకు రూ.272 కోట్ల విలువైన 1,536 పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగతా 7,165 చెరువుల పనులు సాగుతూనే ఉన్నాయి. వీటి పూర్తికి ఈ ఏడాది మార్చిని తుది గడువుగా విధించినా.. అప్పటికి పూర్త య్యే అవకాశాలు కానరావడం లేదు. చెరు వుల పనులకు సరైన అనుభవం లేని కాంట్రా క్టర్లు ఇష్టారీతిన లెస్‌లకు టెండర్లు దాఖలు చేయడం, పని మొదలు పెట్టాక ఆ ధరలు సర్దుబాటు కాక పనులు చేయకుండా వదిలే యడమే దీనికి కారణంగా తెలుస్తోంది. దీనికి తోడు బిల్లులు పాస్ కావాలంటే వివిధ స్థాయి ల్లో అధికారులకు, ప్రజాప్రతినిధులకు కమీష న్లు చెల్లించాల్సి రావడం, ఆ మొత్తాలు తడిసి మోపెడు కావడం సైతం పనులకు అడ్డుపడుతోంది. భారీగా బిల్లులు పెండింగ్.. మిషన్ కాకతీయ తొలి విడతకు సంబంధించి రూ.200 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉండగా.. రెండో విడత కింద రూ.2వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. మూడు నెలలుగా బిల్లుల చెల్లింపు ప్రక్రియ నిలిచిపోవడం, క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ల జారీలో జాప్యం, పీఏవోల్లో వస్తున్న ఇబ్బందులతో కాంట్రాక్టర్లు పనులను మధ్యలో నిలిపివేసినట్లుగా నీటిపా రుదల వర్గాల ద్వారా తెలుస్తోంది. మూడో విడత కింద ఇటీవలి వర్షాలకు దెబ్బతిన్న చెరువులు, వర్షాలు సరిగా కురవని మహబూ బ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలోని చెరువులు కలిపి 3వేల చెరువులను పునరు ద్ధరించాలని లక్ష్యంగా నిర్ధారించుకున్నా వాటి అతీగతీ లేదు. జనవరి నాటికే చెరువుల ప్రతిపాదనలు సీఈ కార్యాలయానికి చేరాల్సి ఉన్నా ఆ ప్రక్రియే మొదలు కాలేదు. అధికారుల అక్రమాలతో.. ఇప్పటికే వేగం తగ్గిన పనులకు తోడు అధికారుల అక్రమాలు మిషన్ కాకతీయ ప్రతిష్టను మసకబారుస్తు న్నాయి. ఇప్పటికే కాంట్రాక్టర్ల నుంచి లంచాలు తీసుకుంటూ నలుగురు అధికారులు ఏసీబీకి చిక్కగా... అంచనాల తయారీలో ఇష్టారాజ్యం, చేయని పనిని చేసినట్లుగా చూపడం, తక్కువ పనులను ఎక్కువ చేసి చూపడం వంటి కారణాలతో ఐదుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. మరో 12 మంది అధికారులపై క్రిమినల్ చర్యలకు సిఫార్సులు కూడా వచ్చాయి. ఖానాపూర్ నియోజకవర్గంలో అవక తవకలపై విజిలెన్స్ విచారణ జరుగు తుండగా, సోమవారం సత్తుపల్లి నియో జకవర్గ పరిధిలోని టేకులపల్లి సర్కిల్లో జరిగిన అవకతవకలకు బాధ్యుడిని చేస్తూ ఒక ఈఈని అరెస్ట్ చేయడం శాఖలో చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా మిషన్ కాకతీయపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి తిరిగి పనులను వేగిరం చేయాల్సిన అవసరముంది. -
చెరువులకు పరిపాలనా అనుమతుల్లో జాప్యం!
నేడు సమీక్షించనున్న మంత్రి హరీశ్ సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ రెండో విడత పనుల ఆరంభానికి ఆర్థికశాఖ తీరు ఆటంకంగా మారుతోంది. చెరువుల పునరుద్ధరణ పనులకు పరిపాలనా అనుమతులను సకాలంలో మంజూరు చేయడంలేదు. బుధవారం కేవలం449 చెరువులకే అనుమతులు లభించా యి. ఆర్థికశాఖ వద్ద ఇప్పటివరకు 4,500 చెరువులకుగాను 1,500కే అనుమతులొచ్చాయి. ఈ నేపథ్యంలో గురువారం భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆర్థిక, చిన్న నీటి పారుదల శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. రెండో విడత మిషన్ కాకతీయ కింద మొత్తంగా 10,355 చెరువులను ఈ ఏడాది పునరుద్ధరించాల్సిఉంది. వీటికోసం మొత్తంగా రూ.2,083కోట్లు ఖర్చు చేయనున్న ట్లు అధికారులు అంచనా వేశారు. గతేడాది అంచనాల తయారీ, వాటి ఆమోదం, టెండరింగ్ ప్రక్రియలో జాప్యం కారణంగా పనులు ఆలస్యంగా ఆరంభమయ్యాయి. దీంతో జూన్ లో వర్షాలు కురిసే నాటికి కాంట్రాక్టర్లకు 3 నెలల సమయమే చిక్కడంతో 40 శాతం పనులను పూర్తి చేయగలిగారు. అయితే పెద్దసంఖ్యలో చెరువు పనుల అనుమతులను డీడీఎం స్క్రూటినీ చేయాల్సి రావడంతో జాప్యం జరుగుతోందని గుర్తించిన నీటిపారుదల శాఖ ఉన్నతస్థాయిలో చర్చించి రూ.2కోట్లకు తక్కువైన పనులను డీడీఎం ఆమోదం లేకుండానే నేరుగా ఆర్థిక శాఖకు ఫైలు వెళ్లేలా చర్యలు చేపట్టింది. దీంతో ఒక చెరువుకు ఆమోదం దక్కేందుకు 4నుంచి 5రోజులు పట్టేది. కానీ ప్రస్తుతం రెండో విడత చెరువు పనుల ఆమోదానికి 10 నుంచి 12 రోజులు పడుతోంది. ప్రస్తుతం బడ్జెట్ తయారీ, కృష్ణా పుష్కరాల అంచనాల తయారీ, మేడారం జాతరకు నిధుల సమకూర్చడం వంటి ఇతర అంశాల్లో ఆర్థిక శాఖ అధికారులు బిజీగా ఉండటంతో అనుమతులు త్వరగా రావడం లేదు.