హరీశ్‌పై యావత్ తెలంగాణ ఆశలు
సిద్దిపేట సభలో మంత్రులు నాయిని, ఈటల కితాబు
► హరీశ్ దొరకడం తెలంగాణ ప్రజల అదృష్టం
► బీడు భూములను తడపాలన్నది ఆయన ఆకాంక్ష
► పల్లెల పచ్చదనానికి ‘మిషన్ కాకతీయే’ కారణమని వెల్లడి
► ఎవరికి ఏ బాధ్యతలు ఇవ్వాలో సీఎం కేసీఆర్‌కు తెలుసని వ్యాఖ్య
సాక్షి, సిద్దిపేట: ‘‘యావత్ తెలంగాణ జాతికి మీ మీద ఆశలు ఉన్నాయి. మీ శ్రమ ఎండిపోతున్న పంట పొలాలను కాపాడాలె.. మీ శ్రమ కరువుబట్టిన భూముల్లోకి నీళ్లు పారించాలె. నాడి పట్టుకొని ఎవరికి ఏ బాధ్యతలు ఇవ్వాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలుసు. ఇయ్యాల తెలంగాణకు మంచి పేరు వస్తున్నదంటే, పల్లెలు పచ్చగా నిలబడ్డయంటే అది మిషన్ కాకతీయతోనే.
నువ్వు దొరకడం ప్రజల, మా అదృష్టం’’ అంటూ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావును కొనియాడారు. ఈ నెల 27న వరంగల్‌లో జరగనున్న భారీ బహిరంగ సభకు నియోజకవర్గ కార్యకర్తల సన్నాహక సమావేశాన్ని శనివారం సిద్దిపేటలో ఏర్పాటు చేశారు. దీనికి మంత్రులు నాయిని, ఈటల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
హరీశ్ ఎక్కడ అడుగుపెట్టినా విజయమే
ముందుగా నాయిని మాట్లాడుతూ 2004లో సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్... ఉద్యమ నిర్మాణం కోసం సిద్దిపేటను వదిలి కరీంనగర్ ఎంపీగా వెళ్లాల్సి వచ్చినప్పుడు హరీశ్‌రావు లాంటి తెలివిగల నేతను సిద్దిపేటకు ఇచ్చి వెళ్లారన్నారు. తెలంగాణలో ఎక్కడ ఉప ఎన్నికలు వచ్చినా æఅక్కడికి హరీశ్‌రావును కేసీఆర్ పంపుతారని, హరీశ్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయమేనని కీర్తించారు.
కేసీఆర్‌కు నాడి పట్టుకొని ఎవరికి ఏ బాధ్యతలు ఇవ్వాలో తెలుసని, తనకు హోంమంత్రి పదవి వస్తుందని ఏనాడూ అనుకోలేదన్నారు. హరీశ్‌రావు శ్రమతో పార్టీకి గౌరవం తెచ్చారని, గ్రామ సీమలు కళకళలాడుతున్నాయంటే ఆయన పట్టుదలే కారణమన్నారు. 12 శాతం ముస్లిం రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీ ఆమోదించిన రోజే ఒడిశాలో ప్రధాని మాట్లాడుతూ వెనుకబడిన ముస్లింలను ఆదుకోవాలని పేర్కొనడంతో రాష్ట్రంలోని బీçజేపీ నేతలకు ఏం చేయాలో అర్థం కావట్లేదని నాయిని ఎద్దేవా చేశారు.
నోట్ల రద్దుకు దేశమంతా భయపడినా...
ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు దేశమంతా భయపడిందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే ఎదురీది నోట్ల రద్దును ఆహ్వానిస్తే...నగదురహిత విధానాన్ని సిద్దిపేటలో అమలు చేసి చూపించిన నాయకుడు హరీశ్‌రావు అని కొనియాడారు. యావత్ తెలంగాణ జాతి హరీశ్‌రావు మీద ఆశలు పెట్టుకుందని, ఆయన శ్రమ ఒక్క ప్రాంతానికే పరిమితం కావొద్దన్నారు. ఆయన శ్రమ తెలంగాణ బీడు భూములను తడపాలని, రైతు ఆత్మహత్యలను నివారించాలన్నారు. తెలంగాణ వస్తే ఏమి చేయాలో కేసీఆర్ ఉద్యమ సమయంలో చెప్పేవారని, రాష్ట్రం వస్తే భారీ నీటిపారుదల శాఖను హరీశ్‌రావుకు ఇస్తానని 2004లోనే కేసీఆర్ చెప్పినట్లు ఈటల చెప్పారు.
భవిష్యత్తుపై రైతులకు కేసీఆర్ భరోసా: హరీశ్
ఏడాదికి రెండు పంటలకు రూ. 4 వేల చొప్పున రైతుకు ఆర్థిక సాయం అందిస్తామనడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు భవిష్యత్తుపై భరోసా ఇచ్చారని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కోర్టుల్లో రోజుకో కేసు వేస్తూ అడ్డుకోవాలని చూస్తూన్నారని విమర్శించారు. 60 ఏళ్లుగా వ్యవసాయాన్ని ఆగం చేసి రైతు ఆత్మహత్యలకు కారణమైనవాళ్లే ఇయ్యాల రైతు బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడని మొసలికన్నీళ్లు కారుస్తూ పరామర్శలకు వెళ్తున్నారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.