సాక్షి, హైదరాబాద్: చెరువులకు పూర్వ వైభవం తీసుకొచ్చే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకాన్ని నీతి ఆయోగ్ ప్రశంసించింది. చెరువుల పునరుద్ధరణ ద్వారా నీటి లభ్యత పెరగడంతో చిన్న, సన్నకారు రైతుల వ్యవసాయ ఆధారిత ఆదాయంలో గణనీయ పెరుగుదల కనిపిస్తోందని పేర్కొంది. సాగునీరు అందని 63 శాతం గ్యాప్ ఆయకట్టుకు చెరువుల ద్వారా నీటి లభ్యత పెరిగిందని, ఫలితంగా సాగు విస్తీర్ణం, దిగుబడులు పెరిగాయని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలు నీటి సంరక్షణ కోసం చేపడుతున్న పథకాలను సమీక్షించిన నీతి ఆయోగ్.. నీటి నిర్వహణ ఉత్తమ పద్ధతుల పథకాలను పేర్కొంటూ నివేదికను తయారు చేసింది. ఆ నివేదికను తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. నీటి నిర్వహణ ఉత్తమ పద్ధతుల్లో మిషన్ కాకతీయ ఒకటని కీర్తించింది.
గత రబీలో 16 లక్షల ఎకరాలకు నీళ్లు
2017 ఆగస్టులో రాష్ట్రంలో పలు చెరువులను పరిశీలించిన అనంతరం తాము గుర్తించిన అంశాలను నీతి ఆయోగ్ తన నివేదికలో పేర్కొంది. పూడికతీత వల్ల చెరువుల నిల్వ సామర్థ్యం పెరిగిందని, తద్వారా సాగును ప్రోత్సహించినట్లయిందని తెలిపింది. భూమిలో నీటి సాంద్రత పెరిగిందని, మెజార్టీ ఆయకట్టు స్థిరీకరణ జరిగిందని వెల్లడించింది. చిన్న నీటి వనరుల కింద 265 టీఎంసీల నీటి కేటాయింపులు ఉండగా, 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. అయితే ఎన్నడూ 10 లక్షల ఎకరాలకు మించి అందిందిలేదు. అయితే చెరువుల పునరుద్ధరణ తర్వాత గత రబీలో ఏకంగా 16 లక్షల ఎకరాల ఆయకట్టు చెరువుల కింద పంట సాగైంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్యాప్ ఆయకట్టులో 63 శాతం ఆయకట్టుకు మిషన్ కాకతీయ నీరందించగలిగిందని నీతి ఆయోగ్ తెలిపింది.
గణనీయంగా పెరిగిన దిగుబడి
రైతులు పూడిక మట్టిని తమ పొలాల్లో వినియోగించుకోవడంతో ప్రధానంగా రసాయనిక, పురుగు మందుల వాడకం తగ్గిందని, పంటల దిగుబడి గణనీయంగా పెరిగిందని నీతి ఆయోగ్ పేర్కొంది. ఎండిన బోరు బావులకు కాకతీయ ప్రాణం పోసిందని, చెరువుల ఆయకట్టు కింద 17 శాతం ఎండిన బావులు, బోరు బావులు పునరుజ్జీవం పొందాయని తెలిపింది. చేపల ఉత్పత్తి 62 శాతం పెరిగిందని వెల్లడించింది. గతంలో మిషన్ కాకతీయ చెరువులపై అధ్యయనం చేసిన నాబ్కాన్స్ సంస్థ కూడా పూడిక మట్టితో రసాయన ఎరువుల వాడకం 35 నుంచి 50 శాతం తగ్గిందని, రైతుకు ఎరువుల కొనుగోళ్లపై 27.6 శాతం ఆర్థిక భారం తగ్గిందని తన అధ్యయనంలో తేల్చిందని చిన్న నీటి పారుదల వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పుడు నీతి ఆయోగ్ పరిశీలనలో అవే వెల్లడయ్యాయని చెప్పాయి. పంటల దిగుబడి పరంగా చూసినా, వరి ఎకరాకు 2 నుంచి 5 క్వింటాళ్లు, పత్తి ఎకరాకు 2 నుంచి 4 క్వింటాళ్లు, కందులు ఎకరాకు 0.5 నుంచి 1.5 క్వింటాళ్లు, మొక్కజొన్న ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్ల మేర పెరిగాయని తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment