
‘సాగునీటి’ పరుగులు
రాష్ట్రం ఏర్పాటయ్యాక రెండేళ్లు సాగునీటి విషయంగా కొంత ఇబ్బంది ఎదురైనా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఏర్పాటయ్యాక రెండేళ్లు సాగునీటి విషయంగా కొంత ఇబ్బంది ఎదురైనా.. గత ఏడాది కాలంగా మాత్రం బాగా కలిసొచ్చింది. నిర్మాణంలోని ప్రాజెక్టుల కింద పాక్షికంగా ఆయకట్టు వృద్ధిలోకి రావడం, గతేడాది చివర్లో కురిసిన వర్షాలకు నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాం సాగర్ వంటి ప్రాజెక్టులు నిండడం సాగునీటి రంగానికి కొత్త ఊపిరిలూదింది. మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించిన చెరువులన్నీ జలకళను సంతరించు కోవడంతో రబీ సాగు రికార్డు స్థాయిలో పెరిగింది. అయితే భూసేకరణ సమస్యల కారణంగా పలు ప్రాజెక్టుల పనుల్లో జాప్యం జరుగుతోంది. పొరుగు రాష్ట్రంతో జల జగడాలు కొంత తగ్గినా ఇబ్బందులు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి.
ఎస్సారెస్పీ కాలువలు తవ్విన తరువాత ప్రత్యేకమైన డ్రైవ్ చేపట్టి మొదటిసారిగా సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు నీటిని తరలించి.. వందలాది చెరువులు నింపారు. ఖమ్మం జిల్లాలో 11 నెలల రికార్డు సమయంలో భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి చెరువులను నింపడంతో 6 వేల ఎకరాలకు సాగునీరు అందించగలిగారు. ఈ ప్రాజెక్టులో మిగతా పనులను వేగంగా పూర్తిచేసి ఈ ఖరీఫ్‌లోనే 58,958 ఎకరాలకు సాగునీరు అందించేలా చర్యలు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లాలో గత పదేళ్లుగా భూసేకరణ కారణంగా నిలిచిపోయిన 57 చెరువు పనులను ఈ సారి పూర్తి చేయగలిగారు.