ఇరిగేషన్‌లో అధికారుల అప్ అండ్ డౌన్...
ఆఫీస్ పనంటూ జిల్లా కేంద్రంలోనే తిష్ట
ములుగు/వరంగల్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చిన్న నీటి వనరుల పునరుద్ధరణ పథకం మిషన్ కాకతీయ మొదటి విడత పనులు ఈ నెల 31వ తేదీలోగా పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఒత్తిడి తీసుకువస్తుంటే ములుగు డివిజన్ సాగునీటి శాఖ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు విధులకు ఎగనామం పెడుతున్నారు. ఉద్యోగులు సక్రమంగా రాకపోవడం వల్ల పనులు కావడం లేదని, తాము బిల్లుల కోసం తిరిగిపోవాల్సి వస్తోందని కాంట్రాక్టర్లు అంటున్నారు. ములుగు డివిజన్ కార్యాలయంలో 20మంది ఉద్యోగుల్లో మంగళవారం కేవలం ఏడుగురు కింది స్థాయి ఉద్యోగులు మాత్రమే విధులు నిర్వహించారు. మిగిలిన ఉద్యోగులు ఎక్కడ అని వారిని ప్రశ్నించగా.. జిల్లా కేంద్రంలోనే ఉన్నారని, ఉన్నతాధికారి టూర్ అని సమాధానం వచ్చింది.
ఎప్పుడు వెళ్లి అడిగినా.. సంబంధిత శాఖ ఉన్నతాధికారి టూర్‌లో ఉన్నాడనే సమాధానం వస్తోంది. మిగిలిన ఉద్యోగులు ఎప్పుడో ఒక రోజు వరంగల్ నుంచి వచ్చి వెళుతుంటారని తెలిసింది. ఈ విషయంపై ఆరా తీయగా జిల్లా కేంద్రంలోనే ఈ డివిజన్‌కు సమాంతరంగా మరో కార్యాలయాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
ఎస్‌ఈ కార్యాలయంలోనే మరో డివిజన్...
జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం వెనుక ఉన్న స్టాఫ్ క్వార్టర్‌లో తాత్కాలికంగా ములుగు డివిజన్ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో ములుగు డివిజన్‌లో పనిచేయాల్సిన ఏబీ, డీబీ సెక్షన్ ఉద్యోగులు ఇక్కడే పనిచేస్తున్నట్లు తెలిసింది. పూర్తిగా ఏజెన్సీలోని 13మండలాలు ఈ డివిజన్ పరిధిలోనే ఉండడంతో అధికారులు రెగ్యులర్‌గా లేక పోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరంతా జిల్లా కేంద్రంలోనే ఉంటున్నారు. ఎవరైనా కాంట్రాక్టర్ బిల్లు కోసం ములుగు వెళ్లినా.. వరంగల్ రావాలని అంటున్నట్టు తెలిసింది. ఉద్యోగులు ములుగులో ఉన్నారా... వరంగల్‌లో ఉన్నారా అన్న విషయం తెలియక మిషన్ పనులు చేసిన కాంట్రాక్టర్లు రెండు కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. జిల్లాలో మిషన్ కాకతీయలో చేపట్టనున్న చెరువుల్లో అధికంగా ములుగు డివిజన్ పరిధిలో ఉండడం విశేషం. ఈ డివిజన్ అధికారులు జిల్లా కేంద్రంలోనే తిష్ట వేయడంతో పనుల్లో నాణ్యత పట్టించుకున్న వారే లేకుండా పోయారు.
గతంలో ఇలా..
ఇదే కార్యాలయంలోని ఉద్యోగులు గతంలో విధులకు హాజరు కావడం లేదని, జిల్లా కేంద్రంలోనే ఆఫీసు పెట్టుకొని విధులు నిర్వర్తిస్తున్నారని ఆరోపణలు చేసిన ఇప్పటి స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఇప్పుడు పట్టించుకోక పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆప్పుడు ప్రతిపక్ష నాయకునిగా పలుమార్లు కార్యాలయానికి వచ్చి తనిఖీలు చేయడం, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో జిల్లా కేంద్రంలో ఉన్న కార్యాలయం ఎత్తివేసి ములుగులో పూర్తి స్థాయిలో నిర్వహించారు. ఇప్పుడు మళ్లీ అదే తంతు కొనసాగుతున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
ఆఫీసు ఇక్కడ.. విధులు అక్కడ
Published Wed, Mar 16 2016 2:30 AM | Last Updated on Sun, Sep 3 2017 7:49 PM
Advertisement