Restoration of water resources
-
ఆఫీసు ఇక్కడ.. విధులు అక్కడ
ఇరిగేషన్లో అధికారుల అప్ అండ్ డౌన్... ఆఫీస్ పనంటూ జిల్లా కేంద్రంలోనే తిష్ట ములుగు/వరంగల్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చిన్న నీటి వనరుల పునరుద్ధరణ పథకం మిషన్ కాకతీయ మొదటి విడత పనులు ఈ నెల 31వ తేదీలోగా పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఒత్తిడి తీసుకువస్తుంటే ములుగు డివిజన్ సాగునీటి శాఖ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు విధులకు ఎగనామం పెడుతున్నారు. ఉద్యోగులు సక్రమంగా రాకపోవడం వల్ల పనులు కావడం లేదని, తాము బిల్లుల కోసం తిరిగిపోవాల్సి వస్తోందని కాంట్రాక్టర్లు అంటున్నారు. ములుగు డివిజన్ కార్యాలయంలో 20మంది ఉద్యోగుల్లో మంగళవారం కేవలం ఏడుగురు కింది స్థాయి ఉద్యోగులు మాత్రమే విధులు నిర్వహించారు. మిగిలిన ఉద్యోగులు ఎక్కడ అని వారిని ప్రశ్నించగా.. జిల్లా కేంద్రంలోనే ఉన్నారని, ఉన్నతాధికారి టూర్ అని సమాధానం వచ్చింది. ఎప్పుడు వెళ్లి అడిగినా.. సంబంధిత శాఖ ఉన్నతాధికారి టూర్లో ఉన్నాడనే సమాధానం వస్తోంది. మిగిలిన ఉద్యోగులు ఎప్పుడో ఒక రోజు వరంగల్ నుంచి వచ్చి వెళుతుంటారని తెలిసింది. ఈ విషయంపై ఆరా తీయగా జిల్లా కేంద్రంలోనే ఈ డివిజన్‌కు సమాంతరంగా మరో కార్యాలయాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఎస్ఈ కార్యాలయంలోనే మరో డివిజన్... జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం వెనుక ఉన్న స్టాఫ్ క్వార్టర్లో తాత్కాలికంగా ములుగు డివిజన్ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో ములుగు డివిజన్లో పనిచేయాల్సిన ఏబీ, డీబీ సెక్షన్ ఉద్యోగులు ఇక్కడే పనిచేస్తున్నట్లు తెలిసింది. పూర్తిగా ఏజెన్సీలోని 13మండలాలు ఈ డివిజన్ పరిధిలోనే ఉండడంతో అధికారులు రెగ్యులర్‌గా లేక పోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరంతా జిల్లా కేంద్రంలోనే ఉంటున్నారు. ఎవరైనా కాంట్రాక్టర్ బిల్లు కోసం ములుగు వెళ్లినా.. వరంగల్ రావాలని అంటున్నట్టు తెలిసింది. ఉద్యోగులు ములుగులో ఉన్నారా... వరంగల్‌లో ఉన్నారా అన్న విషయం తెలియక మిషన్ పనులు చేసిన కాంట్రాక్టర్లు రెండు కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. జిల్లాలో మిషన్ కాకతీయలో చేపట్టనున్న చెరువుల్లో అధికంగా ములుగు డివిజన్ పరిధిలో ఉండడం విశేషం. ఈ డివిజన్ అధికారులు జిల్లా కేంద్రంలోనే తిష్ట వేయడంతో పనుల్లో నాణ్యత పట్టించుకున్న వారే లేకుండా పోయారు. గతంలో ఇలా.. ఇదే కార్యాలయంలోని ఉద్యోగులు గతంలో విధులకు హాజరు కావడం లేదని, జిల్లా కేంద్రంలోనే ఆఫీసు పెట్టుకొని విధులు నిర్వర్తిస్తున్నారని ఆరోపణలు చేసిన ఇప్పటి స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఇప్పుడు పట్టించుకోక పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆప్పుడు ప్రతిపక్ష నాయకునిగా పలుమార్లు కార్యాలయానికి వచ్చి తనిఖీలు చేయడం, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో జిల్లా కేంద్రంలో ఉన్న కార్యాలయం ఎత్తివేసి ములుగులో పూర్తి స్థాయిలో నిర్వహించారు. ఇప్పుడు మళ్లీ అదే తంతు కొనసాగుతున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. -
‘మిషన్’కు ఏడాది
వర్షాలు లేక ఎండిపోయిన చెరువులు నెరవేరని ప్రభుత్వ లక్ష్యం ముసుగు తొలగని పైలాన్ మిషన్-2పై రాజకీయ నీడ వరంగల్: చిన్న నీటి వనరుల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ పథకం ప్రారంభమై నేటికి ఏడాది పూర్తయింది. జిల్లాలో చిన్న నీటి వనరుల విభాగంలో 5,839 చెరువులు ఉన్నాయి. వీటి కింద 3,55,187 ఎకరాల సాగు భూమి ఉన్నట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. ఈ చెరువులను అభివృద్ధి చేయూలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. మిషన్ కాకతీయ కింద మొదటి దశలో 1,075 చెరువులను గుర్తించారు. వీటి పునద్ధరణకు ప్రభుత్వం రూ.418కోట్లు కేటాయించింది. ఇందులో 1,063 చెరువులకు ఈ ప్రొక్యూర్‌మెంటు పద్ధతిలో టెండర్లు నిర్వహించగా కాంట్రాక్టర్లు పోటీపడి పనులు దక్కించుకున్నారు. వీటిలో రెవెన్యూ, అటవీ శాఖల అభ్యంతరాల వల్ల కొన్ని చెరువుల పనులను అధికారులు చేపట్టలేక పోయారు. గత ఏడాది చేపట్టిన పునరుద్ధరణలో 26 చెరువులు 100 శాతం పూర్తి కాగా, 566 చెరువులు తుది దశకు చేరుకున్నాయి. మరికొన్ని చెరువుల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. పనులు చేపట్టిన 881 చెరువులకు అధికారులు చెల్లింపులు కూడా చేశారు. మొదటి విడతలో చేపట్టిన చెరువుల నుంచి సుమారు 1,05,86,843 క్యూబిక్ మీటర్ల మట్టిని పూడిక తీసినట్టు అధికారులు పేర్కొన్నారు. వట్టిపోయిన చెరువులు మిషన్ కాకతీయ మొదటి విడతలో చేపట్టిన చెరువుల్లో ఎక్కువ శాతం నీళ్లు లేక ఎండిపోయూయి. మిషన్-1 పనులను 2015 జనవరిలో ప్రారంభించాలని ప్రభుత్వం భావించినా అప్పటి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఫలితంగా సాధ్యం కాలేదు. వివిధ కారణాల వల్ల చెరువుల నిధుల కేటాయింపుల్లో ఆలస్యం కావడం, రుతుపవనాలు జూన్‌లోనే వచ్చి వర్షాలు పడడంతో పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. చెరువులు మరమ్మతులు చేసినప్పటికీ అనుకున్న వర్షపాతం లేక పోవడం వల్ల ములుగు, మహబూబాబాద్ ఐబీ డివిజన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో చెరువులు నీళ్లు లేక బోసిపోయాయి. అధికారులు చెరువుల మరమ్మతులు పూర్తయినట్లు చెబుతున్నా ఆయా చెరువులు పూర్తి స్థాయిలో పునరుద్ధరణకు నోచుకోలేదు. మిషన్-2లో 1268 చెరువులు మిషన్-2లో 1095 చెరువులను పునరుద్ధరించేందుకు అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపగా.. 493 చెరువులకు పరిపాలన మంజూరు వచ్చింది. ఇందులో 334 చెరువులకు సాంకేతిక అనుమతి లభించగా 298 చెరువులకు టెండర్లు నిర్వహించారు. టెండర్లలో చెరువుల పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు 123 చెరువుల పనులు చేసేందుకు అగ్రిమెంటు ప్రక్రియ పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. ఈ విడత పనులపై రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవడంతో టెండర్ల వ్యవహారంలో అక్రమాలు జరుగుతున్నుట్ల ప్రచారం జరుగుతోంది. అలంకారప్రాయంగా ‘మిషన్’ పైలాన్ మిషన్ కాకతీయ చిహ్నంగా రూ.42లక్షలతో నిర్మించిన పైలాన్ ఏడాదిగా ఆవిష్కరణకు నోచుకోవడం లేదు. కేంద్ర మంత్రి ఉమాభారతి పర్యటన రెండుసార్లు ఖరారై వారుుదాపడింది. ఈ పైలాన్ ఆవిష్కరణ కొలిక్కి రాకపోవడం, సమయం మించిపోతుండడంతో ప్రభుత్వం చెరువుల పనులు ప్రారంభించింది. మిషన్ కాకతీయ రెండో దశ మొదలైనా పైలాన్‌ను ప్రారంభించపోవడంపై విమర్శలు వస్తున్నాయి. -
జల కళకు నాంది!
రేపు ‘మిషన్ కాకతీయ’ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామాబాద్ జిల్లా సదాశివ్‌నగర్ నుంచి చెరువుల పునరుద్ధరణ షురూ కృష్ణా, గోదావరిలోని 262 టీఎంసీలను వినియోగంలోకి తెచ్చే బృహత్తర కార్యక్రమం ఏడాదికి 9 వేల చొప్పున ఐదేళ్లలో 46 వేల చెరువుల పునరుద్ధరణ లక్ష్యం రాష్ట్రంలో చిన్న నీటి వనరుల పునరుద్ధరణ మహా యజ్ఞం గురువారం నుంచి ఆరంభం కానుంది. చెరువులు, కుంటల పునరుద్ధరణకు ఉద్దేశించిన ‘మిషన్ కాకతీయ’ కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లాలోని సదాశివ్‌నగర్ మండలంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. పూడికతీత పనుల్లో స్వయంగా పాల్గొని అక్కడే పూడిక తట్టను కేసీఆర్ మోయనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని మిగతా నియోజకవర్గాల్లో ఆయా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు పనుల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. మిగతా జిల్లాల్లో అధికారులే పనులకు శ్రీకారం చుడతారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ చకాచకా జరుగుతున్నాయి. ఏవైనా అనివార్య కారణాలు ఎదురైతే తప్ప.. గురువారం నుంచి పనుల ప్రారంభానికి అంతా సిద్ధం చేశామని నీటి పారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. దీనిపై బుధవారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని తెలిపాయి. - సాక్షి, హైదరాబాద్ ప్రతి ఎకరానికి నీళ్లు.. రాష్ట్రంలో సమగ్ర సర్వే ద్వారా గుర్తించిన 46,447 చిన్న నీటి వనరుల కింద మొత్తంగా 20.09 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, సరైన పూడిక, మరమ్మతులు, తూములు, అలుగుల ఏర్పాటు జరగక పోవడంతో పూర్తి స్థాయి ఆయకట్టు సాధ్యం కావడం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2008-09 ఏడాదిలో 7.54 లక్షల ఎకరాలు, 2013-14 ఏడాదిలో 11.10 లక్షల ఎకరాలు మాత్రమే సాగులోకి వచ్చింది. మరో 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందని దృష్ట్యా... చెరువుల పునరుద్ధరణ, గొలుసుకట్టు చెరువుల అభివృద్ధిని ప్రభుత్వం చేపట్టింది. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల కింద చిన్న నీటి వనరులకు కేటాయించిన 262 టీఎంసీల నీటిని పూర్తిస్థాయిలో సద్వినియోగపరుచుకొని... చెరువుల కింద ప్రతి ఎకరాన్ని తడపడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘మిషన్ కాకతీయ’ కార్యాచరణను రూపొందించుకుంది. కృష్ణా ప్రాజెక్టుల కింద కేటాయించిన 97 టీఎంసీలు, గోదావరి కింద 165 టీఎంసీలను పూర్తిగా వినియోగించుకోవాలనేది లక్ష్యం. ఇందులో భాగంగా గొలుసుకట్టు చెరువులను అభివృద్ధి చేసేలా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. భారీ లక్ష్యం.. రాష్ట్రంలోని మొత్తం 46,447 చెరువుల ను పునరుద్ధరించాలనేది ఈ పథకం లక్ష్యం. ఇందులో ఏడాదికి 20 శాతం (సుమారు 9 వేలు) చెరువుల చొప్పున చేపట్టాలని నిర్ణయించారు. మొత్తంగా ఈ పథకానికి ఐదేళ్లలో సుమారు రూ. 20 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ ప్రాజెక్టుకు తొలి ఏడాదిలో రూ. 2 వేల కోట్ల మేర కేటాయింపులు జరిపిన ప్రభుత్వం... 9,651 చెరువులను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో ఇప్పటివరకు 6 వేల చెరువులకు సుమారు రూ. 1,700 కోట్ల పరిపాలనా అనుమతులను జారీ చేసింది. మూడ్నెల్లలో తొలిదశ పూర్తి! తొలి దశ చెరువుల పునరుద్ధరణను వచ్చే జూన్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో ముఖ్యంగా వర్షాలు ఆరంభయ్యే నాటికి పూడికతీత పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఇప్పటికే వ్యవసాయ శాఖ సహకారం తీసుకున్న నీటి పారుదల శాఖ... పూడికమట్టి తరలింపు బాధ్యతను రైతులు తీసుకునేలా అవగాహన కల్పించింది. అయితే పూడికమట్టి తరలింపులో చిన్న చిన్న ఇబ్బందులు తప్పకపోవచ్చని, పొలాలకు పనికిరాని పూడికను ఎక్కడ వేయాలన్న దానిపై స్పష్టత లేదు. రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో ఇది సమస్యగా మారే అవకాశాలున్నట్లు అధికారుల అంచనా. ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ, పరిష్కారాలు వెతుకుతూ ముందుకుపోవాలని భావిస్తున్నారు. మిషన్ లక్ష్యాలు.. మొత్తం చెరువులు 46,447 (కృష్ణా బేసిన్లో 22,950, గోదావరి బేసిన్లో 23,497) సమయం.. 5 ఏళ్లు ఏడాదికి పూర్తి చేయాల్సిన లక్ష్యం.. 9 వేలకు పైగా ఈ ఏడాది పునరుద్ధరించాల్సినవి 9,651 సర్వేలు పూర్తయినవి 8,000 సీఈ కార్యాలయాలకు అందిన అంచనాలు 7,650 పరిపాలనా అనుమతులు లభించినవి 6,000 అనుమతులు పొందిన పనుల విలువ సుమారు రూ. 1,700 కోట్లు -
ఆన్లైన్లో ‘మిషన్ కాకతీయ’
ప్రారంభమైన టెండర్ల ప్రక్రియ మొదటి విడతలో 23 చెరువులు.. రూ.13.75 కోట్లు వరంగల్ రూరల్ : చిన్ననీటి వనరుల పురుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు జిల్లాలో తొలివిడత రూ.13.75కోట్లతో అభివృద్ధి చేయనున్న 23 చెరువుల టెండర్ షెడ్యూళ్లు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాయి. జిల్లాలో 5,865 చెరువులను అభివృద్ధి చేయాలని నిర్ణయించగా.. ఈ ఏడాది 1,173 చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు ఇచ్చింది. ఇందులో రూ.50లక్షలకు పైగా విలువైన పనులు చేపట్టాల్సిన 23 చెరువులకు తొలివిడత ఎస్ఈ ఆధ్వర్యంలో టెండర్లు నిర్వహిస్తున్నారు. డౌన్లోడ్ చేసుకుంటున్న కాంట్రాక్టర్లు ఈ ఏడాది అభివృద్ధి చేయనున్న 1,173 చెరువులకు ఎస్టిమేట్ల తయారు దాదాపు పూర్తయింది. ఎస్టిమేట్లు పూర్తికాగానే ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో అందచేసి అక్కడ స్క్రూటినీ చేస్తుండడంతోనే ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ పరిపాలనా మంజూరు చేస్తోంది. రెండు విడతల్లో 70చెరువులకు పరిపాలన మంజూరు లభించగా.. అందులో కన్వీయనెన్స్ చార్జీలు కోత విధించి టెండర్లు అప్లోడ్ చేస్తున్నారు. ఈ మేరకు టెండర్లు అన్‌లైన్‌లోకి రావడంతో షెడ్యూళ్లను డౌన్లోడ్ చేసుకోవడంలో కాంట్రాక్టర్లు బిజీ అయ్యారు. కాగా, 13వ తేదీ నుంచి టెండర్ షెడ్యూళ్లు అందుబాటులోకి రాగా 23వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు స్వీకరిస్తారు. 24న సాంకేతిక బిడ్, 29న ఫైనాన్షియల్ బిడ్ తెరుకుంటుందని అధికారులు వెల్లడించారు. షార్టటైం టెండర్లు... చిన్న నీటి వనరుల పునరుద్ధరణలో భాగంగా అభివృద్ధి చేయనున్న చెరువులకు షార్టు టైం టెండర్లు నిర్వహిస్తున్నాం. ఈమేరకు ఈ-ప్రొక్యూర్‌మెంటు పద్ధతిలో టెండర్లు ఆహ్వానిస్తున్నాం. నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రారంభిస్తాం. వి.పద్మారావు, ఎస్ఈ, ఇరిగేషన్ సర్కిల్, వరంగల్