జల కళకు నాంది! | "The mission of the Kakatiya 'launched by the Chief KCR | Sakshi
Sakshi News home page

జల కళకు నాంది!

Published Wed, Mar 11 2015 3:15 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

జల కళకు నాంది! - Sakshi

జల కళకు నాంది!

రేపు ‘మిషన్ కాకతీయ’ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్
నిజామాబాద్ జిల్లా సదాశివ్‌నగర్ నుంచి చెరువుల పునరుద్ధరణ షురూ
కృష్ణా, గోదావరిలోని 262 టీఎంసీలను వినియోగంలోకి తెచ్చే బృహత్తర కార్యక్రమం
ఏడాదికి 9 వేల చొప్పున ఐదేళ్లలో 46 వేల చెరువుల పునరుద్ధరణ లక్ష్యం

 
రాష్ట్రంలో చిన్న నీటి వనరుల పునరుద్ధరణ మహా యజ్ఞం గురువారం నుంచి ఆరంభం కానుంది. చెరువులు, కుంటల పునరుద్ధరణకు ఉద్దేశించిన ‘మిషన్ కాకతీయ’  కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లాలోని సదాశివ్‌నగర్ మండలంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. పూడికతీత పనుల్లో స్వయంగా పాల్గొని అక్కడే పూడిక తట్టను కేసీఆర్ మోయనున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని మిగతా నియోజకవర్గాల్లో ఆయా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు పనుల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. మిగతా జిల్లాల్లో అధికారులే పనులకు శ్రీకారం చుడతారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ చకాచకా జరుగుతున్నాయి. ఏవైనా అనివార్య కారణాలు ఎదురైతే తప్ప.. గురువారం నుంచి పనుల ప్రారంభానికి అంతా సిద్ధం చేశామని నీటి పారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. దీనిపై బుధవారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని తెలిపాయి.
 - సాక్షి, హైదరాబాద్
 
 ప్రతి ఎకరానికి నీళ్లు..
 రాష్ట్రంలో సమగ్ర సర్వే ద్వారా గుర్తించిన 46,447 చిన్న నీటి వనరుల కింద మొత్తంగా 20.09 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, సరైన పూడిక, మరమ్మతులు, తూములు, అలుగుల ఏర్పాటు జరగక పోవడంతో పూర్తి స్థాయి ఆయకట్టు సాధ్యం కావడం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2008-09 ఏడాదిలో 7.54 లక్షల ఎకరాలు, 2013-14 ఏడాదిలో 11.10 లక్షల ఎకరాలు మాత్రమే సాగులోకి వచ్చింది. మరో 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందని దృష్ట్యా... చెరువుల పునరుద్ధరణ, గొలుసుకట్టు చెరువుల అభివృద్ధిని ప్రభుత్వం చేపట్టింది. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల కింద చిన్న నీటి వనరులకు కేటాయించిన 262 టీఎంసీల నీటిని పూర్తిస్థాయిలో సద్వినియోగపరుచుకొని... చెరువుల కింద ప్రతి ఎకరాన్ని తడపడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘మిషన్ కాకతీయ’ కార్యాచరణను రూపొందించుకుంది. కృష్ణా ప్రాజెక్టుల కింద కేటాయించిన 97 టీఎంసీలు, గోదావరి కింద 165 టీఎంసీలను పూర్తిగా వినియోగించుకోవాలనేది లక్ష్యం. ఇందులో భాగంగా గొలుసుకట్టు చెరువులను అభివృద్ధి చేసేలా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.
 
 
 భారీ లక్ష్యం..
 రాష్ట్రంలోని మొత్తం 46,447 చెరువుల ను పునరుద్ధరించాలనేది ఈ పథకం లక్ష్యం. ఇందులో ఏడాదికి 20 శాతం (సుమారు 9 వేలు) చెరువుల చొప్పున చేపట్టాలని నిర్ణయించారు. మొత్తంగా ఈ పథకానికి ఐదేళ్లలో సుమారు రూ. 20 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ ప్రాజెక్టుకు తొలి ఏడాదిలో రూ. 2 వేల కోట్ల మేర కేటాయింపులు జరిపిన ప్రభుత్వం... 9,651 చెరువులను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో ఇప్పటివరకు 6 వేల చెరువులకు సుమారు రూ. 1,700 కోట్ల పరిపాలనా అనుమతులను జారీ చేసింది.
 
 మూడ్నెల్లలో తొలిదశ పూర్తి!
 తొలి దశ చెరువుల పునరుద్ధరణను వచ్చే జూన్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో ముఖ్యంగా వర్షాలు ఆరంభయ్యే నాటికి పూడికతీత పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఇప్పటికే వ్యవసాయ శాఖ సహకారం తీసుకున్న నీటి పారుదల శాఖ... పూడికమట్టి తరలింపు బాధ్యతను రైతులు తీసుకునేలా అవగాహన కల్పించింది. అయితే పూడికమట్టి తరలింపులో చిన్న చిన్న ఇబ్బందులు తప్పకపోవచ్చని, పొలాలకు పనికిరాని పూడికను ఎక్కడ వేయాలన్న దానిపై స్పష్టత లేదు. రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో ఇది సమస్యగా మారే అవకాశాలున్నట్లు అధికారుల అంచనా. ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ, పరిష్కారాలు వెతుకుతూ ముందుకుపోవాలని భావిస్తున్నారు.
 
 మిషన్ లక్ష్యాలు..
 మొత్తం చెరువులు    46,447
 (కృష్ణా బేసిన్‌లో 22,950, గోదావరి బేసిన్‌లో 23,497)
 సమయం..    5 ఏళ్లు
 ఏడాదికి పూర్తి చేయాల్సిన లక్ష్యం..    9 వేలకు పైగా
 ఈ ఏడాది పునరుద్ధరించాల్సినవి    9,651
 సర్వేలు పూర్తయినవి    8,000
 సీఈ కార్యాలయాలకు అందిన అంచనాలు    7,650
 పరిపాలనా అనుమతులు లభించినవి    6,000
 అనుమతులు పొందిన
 పనుల విలువ    సుమారు రూ. 1,700 కోట్లు
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement