ప్రారంభమైన టెండర్ల ప్రక్రియ
మొదటి విడతలో 23 చెరువులు.. రూ.13.75 కోట్లు
వరంగల్ రూరల్ : చిన్ననీటి వనరుల పురుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు జిల్లాలో తొలివిడత రూ.13.75కోట్లతో అభివృద్ధి చేయనున్న 23 చెరువుల టెండర్ షెడ్యూళ్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. జిల్లాలో 5,865 చెరువులను అభివృద్ధి చేయాలని నిర్ణయించగా.. ఈ ఏడాది 1,173 చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు ఇచ్చింది. ఇందులో రూ.50లక్షలకు పైగా విలువైన పనులు చేపట్టాల్సిన 23 చెరువులకు తొలివిడత ఎస్‌ఈ ఆధ్వర్యంలో టెండర్లు నిర్వహిస్తున్నారు.
డౌన్‌లోడ్ చేసుకుంటున్న కాంట్రాక్టర్లు
ఈ ఏడాది అభివృద్ధి చేయనున్న 1,173 చెరువులకు ఎస్టిమేట్ల తయారు దాదాపు పూర్తయింది. ఎస్టిమేట్లు పూర్తికాగానే ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో అందచేసి అక్కడ స్క్రూటినీ చేస్తుండడంతోనే ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ పరిపాలనా మంజూరు చేస్తోంది. రెండు విడతల్లో 70చెరువులకు పరిపాలన మంజూరు లభించగా.. అందులో కన్వీయనెన్స్ చార్జీలు కోత విధించి టెండర్లు అప్‌లోడ్ చేస్తున్నారు. ఈ మేరకు టెండర్లు అన్‌లైన్‌లోకి రావడంతో షెడ్యూళ్లను డౌన్‌లోడ్ చేసుకోవడంలో కాంట్రాక్టర్లు బిజీ అయ్యారు. కాగా, 13వ తేదీ నుంచి టెండర్ షెడ్యూళ్లు అందుబాటులోకి రాగా 23వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు స్వీకరిస్తారు. 24న సాంకేతిక బిడ్, 29న ఫైనాన్షియల్ బిడ్ తెరుకుంటుందని అధికారులు వెల్లడించారు.
షార్‌టటైం టెండర్లు...
చిన్న నీటి వనరుల పునరుద్ధరణలో భాగంగా అభివృద్ధి చేయనున్న చెరువులకు షార్టు టైం టెండర్లు నిర్వహిస్తున్నాం. ఈమేరకు ఈ-ప్రొక్యూర్‌మెంటు పద్ధతిలో టెండర్లు ఆహ్వానిస్తున్నాం. నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రారంభిస్తాం.
వి.పద్మారావు, ఎస్‌ఈ,
ఇరిగేషన్ సర్కిల్, వరంగల్
ఆన్‌లైన్‌లో ‘మిషన్ కాకతీయ’
Published Thu, Jan 15 2015 1:27 AM | Last Updated on Sat, Aug 11 2018 5:50 PM
Advertisement