అవినీతిని సహించేది లేదు: హరీష్‌రావు
-అక్రమాలకు పాల్పడే వారిని విడిచిపెట్టబోమని హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్
ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో చేపడుతున్న ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ వంటి అత్యుత్తమ పథకాల్లో అవినీతిని సహించబోమని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు హెచ్చరించారు. అవకతవకలు, అక్రమాలకు పాల్పడే అధికారులు ఏ స్థాయిలో ఉన్నా విడిచిపెట్టమని స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డి, మిషన్ కాకతీయ పనుల్లో అక్రమాలు జరిగాయని నిర్ధారణ జరిగిన నేపథ్యంలో శుక్రవారం మంత్రి ప్రకటన విడుదల చేశారు. పాలమూరు ప్రాజెక్టు ఆయకట్టు సర్వే టెండర్ల ప్రక్రియలో అవకతవకలు పాల్పడిన ఇద్దరు ఎస్‌ఈలను పక్కనపెట్టామని, మిషన్ కాకతీయ పనుల్లో అక్రమాలకు బాధ్యులుగా గుర్తించి ఐదుగురిని సస్పెండ్ చేశామని మంత్రి గుర్తు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనులు పూర్తి చేయాలన్నారు. నాసిరకంగా పనులు చేసినా, నిర్లక్ష్యం వహించడం, తక్కువ పనిని ఎక్కువగా రికార్డు చేయడం వంటి తప్పిదాలను సహించబోమని మంత్రి అన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు, పత్రికల్లో కథనాలు రాకముందే వరంగల్ జిల్లా మిషన్ కాకతీయ పనుల్లో అవకతవకల బాధ్యులపై చర్యలు తీసుకున్నామని మంత్రి పేర్కొన్నారు.