టీ.టీడీపీ నేతలు తెలంగాణ ద్రోహులు
► ఆంధ్రా నేతలకు వత్తాసు పలుకుతారా
► తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నారు
► టీటీడీపీ నేతలపై మంత్రులు జూపల్లి, లక్ష్మారెడ్డి ఫైర్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : టీడీపీ నేతలకు తెలంగాణ టీడీపీ నేతలు వత్తాసు పలకడం ద్వారా తెలంగాణ ద్రోహులుగా ముద్రపడ్డారని, వారు ప్రజలను ఏ విధం గా మభ్యపెట్టినా నమ్మే పరిస్థితుల్లో లేరని మంత్రులు జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారె డ్డి అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి అడుగడుగునా అడ్డుపడుతున్న ఆం ధ్రా టీడీపీ నేతలకు తెలంగాణ టీడీపీ నేత లు వత్తాసు పలకడం ద్వారా తెలంగాణ ద్రోహులుగా ముద్రపడ్డారని అన్నారు. సోమవారం స్థానిక జెడ్పీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో మంత్రి లక్ష్మారెడ్డి, జెడ్పీచైర్మన్ భాస్కర్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల పక్షాన నిలబడలేక పోలీసు రక్షణతో తిరిగిన నేతలు నేడు రైతుల కోసం ఉద్యమాలంటూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వం లో రెండేళ్లలో తెలంగాణలో అనూహ్య రీతిలో అభివృద్ధి జరిగిందని అన్నారు.
మిషన్ కాకతీయ, భగీరథ, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, ఆసరా పింఛన్లు వంటి పథకా లు తెలంగాణ పేదల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాయని ఈ పథకాలను బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రులు ప్రశంసిస్తుంటే ఇక్కడి టీడీపీ నేతలు విమర్శిస్తూ తమ స్థాయిని తగ్గించుకుంటున్నారని అన్నారు. ఆర్డీఎస్ గురించి ఉద్యమాలు చేస్తామన్న నాయకులు తెలంగాణ ఉద్య మ సమయంలో పోలీసు రక్షణతో తిరిగారని, ప్రస్తుతం ప్రాజెక్టుల పనులు వేగవంతం అవుతున్న సమయంలో రాజకీయ లబ్ధి కోసం ఉద్యమాలంటున్నారని ఆయ న విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావ సంబరా లు అంబరాన్నంటేలా చేస్తామని, అమరుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.
ఓర్వలేకనే పరువు తీస్తున్నారు
మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కొందరు సన్యాసులు రాష్ట్రం పరువు తీసేలా అవాకులు చవాకులు పేలుతున్నారని వారిని ప్రజలు క్షమించరన్నారు. జిల్లా వెనుకబాటుతనానికి కాంగ్రెస్, టీడీపీ పాలకులు అనుసరించిన విధానాలే కారణమని జిల్లాకు ఒక్క మంచి పని చేయలేని నేతలు నీతులు చెబితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.
టీడీపీ, కాంగ్రెస్‌ను ప్రజలు ప్రతి ఎన్నికలో తిరస్కరిస్తున్నా ఇంకా రాజకీయ ఉనికి కోసం పాకులాడుతూ అధికార పార్టీకి అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆరోపించారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, నాయకులు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కొల్లాపూర్ జెడ్పీటీసీ హన్మంతునాయక్, సురేందర్‌రెడ్డి, కిశోర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.