సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: మహాకూటమి పేరుతో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను నిండా ముంచి.. ఆ తర్వాత ముందస్తు వ్యూహంతో అదే కాంగ్రెస్ పార్టీలోకి తన మనుషుల్ని పంపిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. మరోసారి కాంగ్రెస్‌ను వంచించే పనిలో పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేకపోవడంతో, ఆ రాష్ట్రంలోని అన్ని పక్షాలను తనతో కలుపుకొని ప్రయత్నించాలనే వ్యూహంలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీని పావుగా వాడుకునేందుకు పక్కా స్కెచ్ వేశారని తెలుస్తోంది.
బాబు వ్యూహం ప్రకారమే.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన మనుషులు (టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన వారు) సమయానుకూలంగా సొంత గూటికి చేరుకుంటారనేది తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అలా చేరిన నేతలతో కూడిన టీటీడీపీతో జత కడితే తమకు ప్రయోజనం కలుగుతుందనే భావన తెలంగాణ బీజేపీలో కలిగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
ఈ ఎపిసోడ్‌కు సన్నాహకంగానే టీపీసీసీలో కమిటీల చిచ్చు రేగిన అనంతరం..కొందరు కాంగ్రెస్ నేతలు తమ పదవులకు రాజీనామాలు చేశారని, ఆ తర్వాత వ్యవహారమంతా బాబు కనుసన్నల్లోనే నడుస్తోందని రాజకీయ వర్గాలంటున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ తలనొప్పి నుంచి ఆ పార్టీ అధిష్టానం బయటపడక ముందే ఖమ్మం వేదికగా ‘షో’ చేసి, పాతకాపులను రప్పించి, బీజేపీని బుట్టలో వేసుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో అధికారానికి ప్రయత్నించాలనేది బాబు తాజా వ్యూహం అని ఆ వర్గాలు తేటతెల్లం చేస్తున్నాయి.
నేను చెబుతా .. మీరు రెడీగా ఉండండి
టీపీసీసీ కమిటీల ఏర్పాటు చిచ్చు రేగక ముందు నుంచే ఈ ఆలోచనలో ఉన్న బాబు.. తాజా పరిణామాల నేపథ్యంలో తదుపరి కార్యాచరణలో నిమగ్నమయ్యారు. మూడు రోజుల నుంచి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని టీడీపీ పాతకాపులు కొందరికి ఆయనే స్వయంగా ఫోన్లు చేస్తున్నారు. ‘తెలంగాణలో మళ్లీ మనం క్రియాశీలమవుదాం.. బీజేపీతో కలిస్తే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. నేను చెప్పినప్పుడు మళ్లీ టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉండండి..’ అని చెబుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బలంగా ఉండే కాంగ్రెస్ పార్టీని చీల్చడం ద్వారా బీజేపీకి ప్రయోజనం కలిగిస్తానని, అందుకు ప్రతిఫలంగా ఏపీలో తనతో జట్టు కట్టాలనేది బీజేపీ ముందు ఆయన ఉంచిన
క్విడ్‌ప్రోకో ప్రతిపాదనగా తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు బీజేపీని ఒప్పించేందుకు చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని సమాచారం. వైఎస్సార్‌సీపీ ఓడించలేమని తేలడంతో.. ప్రజాసంక్షేమ పాలనతో దూసుకెళుతున్న ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా అధికారం నుంచి దింపేసి తాను మళ్లీ సీఎం సీటు ఎక్కాలని చంద్రబాబు తహతహలాడుతున్నారు. అయితే ఒంటరిగా పోటీ చేసినా, జనసేనతో జట్టు కట్టినా ప్రయోజనం లేదని, వైఎస్సార్‌సీపీని ఓడించలేమని ఆయన చేయించుకున్న సర్వేల్లోనే తేలడంతో, బీజేపీని కూడా కలుపుకొంటే ప్రయోజనం ఉండొచ్చనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు.
అందుకే ఈసారి ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీని బుట్టలో వేసుకునేందుకు తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో ఆయన కుతంత్రాలకు తెరతీశారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. తెలంగాణలో తన సామాజిక వర్గ ప్రభావం ఉన్న చోట్ల బలప్రదర్శన చేసి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోని కొందరిని తన పార్టీలో చేర్చుకుని, వారి రాకతో తెలంగాణలో టీడీపీ బలంగా ఉందనే భావన కలిగించి, అనంతరం బీజేపీతో జట్టుకట్టి ఎన్నికలకు వెళ్లాలనేది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది.
ఆ విధంగా తెలంగాణ ఎన్నికల్లో తమ ద్వారా ప్రయోజనం కలుగుతున్నందున, ఏపీలోనూ తమతో కలిసి వచ్చేలా బీజేపీ అధినాయకత్వాన్ని ఒప్పించే వ్యూహాన్ని బాబు అమలు చేస్తున్నట్టు తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది. ఇదే జరిగితే తెలంగాణ కాంగ్రెస్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాత్ర ఏంటనేది అగమ్యగోచరంగా మారనుంది. పాత టీడీపీ నేతలను మళ్లీ సొంతగూటికి రమ్మంటూ చంద్రబాబు ఫోన్లు చేస్తున్న వ్యవహారం రేవంత్‌కు తెలిసే జరుగుతోందా? తెలియకుండా జరుగుతోందా? ఒకవేళ తెలిస్తే ఆయన వైఖరి ఎలా ఉండబోతోంది? రేవంత్‌ను ఆటలో అరటిపండులాగా, కూరలో కరివేపాకు లాగా చంద్రబాబు వాడుకున్నట్టేనా? అనే చర్చ కూడా తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది.
బీజేపీ నేతలకు బలప్రదర్శన బాధ్యతలు?
తెలంగాణలో తనకు ఇంకా బలముందని ప్రచారం చేసుకునేందుకు ఖమ్మం వేదికగా బుధవారం చంద్రబాబు పెద్ద ‘షో’(బలప్రదర్శన)నే చేయబోతున్నారు. ఇందుకోసం బీజేపీలోని తన మనుషులను రంగంలోకి దించారు. ఇక్కడి బహిరంగ సభ ఏర్పాట్లను పేరుకు స్థానిక టీడీపీ నేతలు చేస్తున్నా, తెరవెనుక మాత్రం బీజేపీ ముసుగు వేసుకున్న బాబు మనుషులే నడిపిస్తున్నారు.
తెలంగాణ టీడీపీలో కీలకంగా ఉన్న తన సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, ప్రస్తుతం బీజేపీలో ఉన్న అదే సామాజిక వర్గానికే చెందిన మాజీ ఎంపీ.. ఈ ఇద్దరి సమన్వయంతో తన సామాజిక వర్గానికి చెందిన సంఘం నేతలిద్దరు (ఒకరు బీజేపీ, మరొకరు టీడీపీ) ఖమ్మం షోలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఖమ్మం షో కోసం రాష్ట్రంలోని తన సామాజిక వర్గానికి చెందిన పారిశ్రామికవేత్తల నుంచి కోట్ల రూపాయల చందాలు వసూలు చేశారనే చర్చ కూడా ఖమ్మం టీడీపీ వర్గాల్లో జరుగుతోంది.
బహిరంగ సభకు ముందు వేల సంఖ్యలో కార్లు, ఆటోలు, మోటార్‌బైక్‌లతో ర్యాలీ నిర్వహించడం ద్వారా, పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, కటౌట్లు పెట్టడం ద్వారా ఖమ్మంలో టీడీపీ గట్టి పట్టు ఉందని అంతా భావించేలా బాబు అండ్ కో అన్ని ప్రయత్నాలూ చేస్తుండడం గమనార్హం.
చదవండి: Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్... మరో చార్జిషీట్‌లోనూ ఎమ్మెల్సీ కవిత
Comments
Please login to add a commentAdd a comment