
మిషన్.. కొట్టుకుపోతోంది!
♦ యాలాలలో నాసిరకంగా చెరువు అభివృద్ధి పనులు
♦ చిన్నపాటి వర్షానికే చెరువు కట్టలకు పగుళ్లు
♦ రైతుల ఆవేదన పట్టించుకోని అధికారులు
♦ ఇష్టారాజ్యంగా పనులు చేపట్టి
♦ చేతులు దులిపేసుకుంటున్న కాంట్రాక్టర్లు
మిషన్ కాకతీయ పనులు నాసిరకంగా జరుగుతున్నాయి. చిన్నపాటి వర్షానికే చెరువు కట్టలకు పగుళ్లు ఏర్పడి ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ విషయంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి, నాణ్యమైన పనులు జరిగే విధంగా చూడాల్సిన ఇరిగేషన్ అధికారులు.. ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేపడుతున్నారు.
యాలాల: మిషన్ కాకతీయలో భాగంగా యాలాల మండ లంలో 47 చెరువుల అభివృద్ధి పనులకు అనుమతి లభించింది. ఇందులో యాలాల శివారులోని బాకారం ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లేమార్గంలో ఉన్న మాలకుంట చెరువు అభివృద్ధి పనులకు రూ.44 లక్షలు మంజూరయ్యాయి. చెరువు ఆయకట్టు కింద సుమారు 50 ఎకరాలకు పైగా భూములున్నాయి. అయితే రెండు వారాలుగా కురుస్తున్న వర్షాలకు చెరువు తూము నిర్మించిన ప్రదేశంతో పాటు కట్టపై చాలాచోట్ల బీటలు ఏర్పడ్డాయి.
తూము ప్రదేశంలో సగం మట్టి కొట్టుకుపోయి ప్రమాదకరంగా మారింది. దీనికితోడు చెరువు కింద నిర్మించాల్సిన కాలువ పనులు కూడా అసంపూర్తిగానే ఉన్నాయి. కాలువ నిర్మాణం కోసం పొలాల నుంచి చేపట్టిన పనుల్లో మూడు చోట్ల కల్వర్టు పనులు చేపట్టకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పనుల విషయమై గతంలో చాలాసార్లు ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హాజీపూర్ ఊరచెరువు కూడా..!
యాలాల మాలకుంట చెరువుతో పాటు పొరుగున ఉన్న హాజీపూర్ ఊరచెరువు పనులు కూడా నాసిరకంగా చేపట్టారు. ఊరచెరువు అభివృద్ధి పనులకు గాను రూ.49.98 లక్షలు మంజూరయ్యాయి. అయితే చెరువు తూముతో పాటు కట్ట పనుల్లో నాసిరకం విలయ తాండవం చేస్తుంది. చెరువు కట్ట వెడల్పు పనులు ఏ మాత్రం జరగలేదు. ఎదురుగా ఎడ్లబండి వస్తే దారి వదలని పరిస్థితిలో చెరువు కట్ట ఉంది. ఈ విషయమై రైతులు అప్పట్లో గగ్గోలు పెట్టినా ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని రైతులు వాపోతున్నారు. ఇటీవల జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో హాజీపూర్ సర్పంచ్ లక్ష్మి చెరువు కట్ట విషయమై సభ దృష్టికి తీసుకువచ్చినా అధికారుల్లో మాత్రం చలనం ఉండడం లేదని ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు.
ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాం..
ఊరచెరువు కట్ట విషయమై గతంలో ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాం. కానీ మా విషయాన్ని అధికారులు, కాంట్రాక్టరు పట్టించుకోలేదు. ఇష్టారాజ్యంగా పనులు చేసుకుంటూ వెళ్లారు. కట్టపై నుంచి ఎడ్లబండ్లలో ధానాన్ని తీసుకెళ్లడానికి భయపడే పరిస్థితి నెలకొంది. చెరువు పనులు కూడా సక్రమంగా జరగలేదు. - బాకారం సాయన్న, ఆయకట్టు రైతు, హాజీపూర్
కట్ట తెగిపోయే ప్రమాదం ఉంది..
నాసిరకంగా చేపట్టిన పనులతో ఈసారి వర్షాలు వస్తే చెరువు కట్ట తెగే ప్రమాదం ఉంది. చిన్నపాటి వర్షానికి కట్టపై పగుళ్లు ఏర్పడి మట్టి కొట్టుకుపోతోంది. చెరువు బాగు పడితే ఆయకట్టు బాగుపడుతుంది అనుకున్నా. కానీ కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేసి చేతులు దులుపుకున్నారు. - పోతుల మల్లేషం, ఆయకట్టు రైతు, హాజీపూర్