‘మిషన్ భగీరథ’ అక్రమాల పుట్ట! | Congress claims irregularities in Mission Bhagiratha | Sakshi
Sakshi News home page

‘మిషన్ భగీరథ’ అక్రమాల పుట్ట!

Published Wed, Dec 21 2016 4:39 AM | Last Updated on Mon, Sep 4 2017 11:12 PM

‘మిషన్ భగీరథ’ అక్రమాల పుట్ట!

‘మిషన్ భగీరథ’ అక్రమాల పుట్ట!

టెండర్లన్నీ ముందస్తు ఒప్పందంపై జరిగాయంటూ కాంగ్రెస్‌ ఫైర్‌
►  సభా సంఘం లేదా సీవీసీతో విచారణ జరిపించాలి: భట్టి
నీళ్ల కోసం పైపులా.. పైపుల కోసం నీళ్లా
టెండర్లు అంత తక్కువ లెస్‌కు ఎందుకు వచ్చాయి?
ఇందులో భారీగా నిధుల దుర్వినియోగం జరుగుతోంది
అంచనాలు, టెండర్లను సభ ముందుంచాలని డిమాండ్‌  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా చెప్పుకొంటున్న ‘మిషన్ భగీరథ’ పథకం అక్రమాల పుట్ట అని.. టెండర్ల ప్రక్రియ అంతా ముందస్తు ఒప్పందంపై జరిగినట్లుగా సందే హాలున్నాయని శాసనసభలో విపక్ష కాంగ్రెస్‌ ఆరోపించింది. దీనిపై సభా సంఘం వేయా లని లేదా కేంద్ర విజిలెన్స్ కమిషన్ తో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేసింది. అసలు ఈ పథకం డీపీఆర్‌పైనే అనేక అనుమానాలు ఉన్నాయని.. పనుల అంచనాలను రెండు మూడు రెట్లు పెంచి టెండర్లు పిలిచారనే ఆరో పణలున్నాయని కాంగ్రెస్‌ సభ్యుడు భట్టి విక్ర మార్క పేర్కొన్నారు. స్థానిక వనరులను విని యోగించుకోకుండా ఎక్కడో రిజర్వాయర్లు నిర్మించి.. అక్కడి నుంచి పైపులైన్ల ద్వారా రివర్స్‌ పంపింగ్‌ చేసి నీళ్లివ్వడంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు. ఇలా కిలోమీటర్ల మేర పైపులైన్లు వేసి నీళ్లివ్వడం ద్వారా ఖమ్మం జిల్లాలోని పాలేరు, వైరా రిజర్వాయర్ల పరిధిలోనే రూ.110 కోట్ల మేర నిధులు దుర్వినియోగం అవుతున్నాయన్నారు.

చెరువులను ఎందుకు వినియోగించుకోరు?
రాష్ట్రవ్యాప్తంగా చెరువులను మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరిస్తున్నప్పుడు.. వాటి ల్లో పెద్ద వాటిని రిజర్వాయర్లుగా మార్చి నీటిని సరఫరా చేయవచ్చు కదా అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. మిషన్ కాకతీయకు రూ.25 వేల కోట్లు ఖర్చు పెడుతు న్నారని.. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టు లకు రూ.1.2 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నా రని చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టులకు రూ.1.4 లక్షల కోట్లు ఖర్చు చేసి తెలంగాణ మొత్తం నీటిని పారిస్తామంటున్న ప్రభుత్వం... మళ్లీ రూ.45 వేల కోట్లతో ‘మిషన్ భగీరథ’ను ఎందుకు చేపట్టిందని ప్రశ్నించారు.

చెరువులు, ప్రాజెక్టుల్లోకి నీళ్లు వస్తాయని ప్రభుత్వం భావించడం లేదా అని ఎద్దేవా చేశారు. ఒకవేళ నీళ్లు వస్తాయనుకుంటే ఈ 45 వేల కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించారు. అసలు వైఎస్సార్‌ హయాంలో నిర్మించిన శ్రీపాదరావు ఎల్లంపల్లి ప్రాజెక్టు పైప్‌లైన్ నుంచే నీటిని తీసుకుని ‘మిషన్ భగీరథ’గా చెబుతూ గజ్వేల్‌ నియోజకవర్గానికి మళ్లించారన్నారు. పైగా దానిని ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించి, తమ ఘనతేనని చెప్పుకొంటున్నారని భట్టి ఎద్దేవా చేశారు.

టెండర్లలో గోల్‌మాల్‌
మిషన్ భగీరథ టెండర్లలోనే గోల్‌మాల్‌ జరిగిందని, ముందస్తు అవగాహనతో ఇంటి దగ్గర కూర్చుని టెండర్లు రాసుకున్నట్టు ఉందని భట్టి ఆరోపించారు. మిషన్ కాకతీయకు 20–35 శాతం వరకు లెస్‌కు టెండర్లు వస్తే.. ‘భగీరథ’కు కేవలం 0.2 – 0.5 శాతం వరకు మాత్రమే లెస్‌ టెండర్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. టెండర్ల ప్రక్రియ పైనే తమకు అనుమానాలు ఉన్నాయని, దీనికి సంబంధించిన వివరాలన్నీ సభ ముందుంచాలని డిమాండ్‌ చేశారు. ఈ పథకం కోసం 11 శాతం వడ్డీతో బ్యాంకుల నుంచి అప్పులు తెస్తున్నట్లుగా కాగ్‌ నివేదికలో పేర్కొందని.. ఆ అప్పులకు వడ్డీలు కట్టేందుకే ఏటా రూ.4,500 కోట్లు అవసరమని భట్టి పేర్కొన్నారు.

ఈ వడ్డీతోపాటు అసలు చెల్లించేందుకు, పథకం నిర్వహణకు కలిపి ఏటా సుమారు రూ.12 వేల కోట్ల వరకు భారం పడుతుందన్నారు. ఇంత భారాన్ని ప్రజలపై మోపితే ఎలాగని, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేవారు ఏం చేయాలని నిలదీశారు. రాష్ట్రం విడిపోయినప్పుడు రూ.62 వేల కోట్ల అప్పులుంటే ఈ రెండేళ్లలో అవి రూ.1.25 లక్షల కోట్లకు పెరిగాయని... ఇంత అడ్డగోలుగా ఎలా ఖర్చు పెడతారని ప్రశ్నించారు. దీనిపై హౌజ్‌ కమిటీ వేయాలని లేదా సీవీసీతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

భగీరథ మంచిదే
మిషన్ భగీరథ పథకం మంచిదని.. రాజకీయాల కోసం దీనిని విమర్శించడం మంచిది కాదని బీజేపీ సభ్యుడు ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌కు నీరిచ్చే జంట జలాశయాల వద్ద అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించాలని, సింగూరు ద్వారా నీళ్లివ్వాలని మజ్లిస్‌ సభ్యుడు ముంతాజ్‌ఖాన్ కోరారు. ఉత్పాదక రంగాలపై ఖర్చు పెడితే ఫలితం ఉంటుందని, మిషన్ భగీరథలాంటి అనుత్పాదక పథకాన్ని కేంద్రం ఇచ్చే గ్రాంట్లతో దశలవారీగా పూర్తి చేయా లని.. ఇన్ని వేల కోట్లు ఆ పథకానికి ఖర్చు చేయడం మంచిది కాదని టీడీపీ సభ్యుడు ఆర్‌. కృష్ణయ్య సూచించారు. పారదర్శ కతతో వేగంగా పథకాన్ని అమలు చేయాలని.. గిరిజన ఆవాసాలన్నింటికీ నీరందేలా చర్యలు తీసుకోవాలని సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య కోరారు. ఈ పథకం దళితుల ఆత్మగౌరవ పథకమని అధికార పక్ష సభ్యుడు రసమయి పేర్కొన్నారు. ఆయన విపక్ష సభ్యులనుద్దేశించి విమర్శలు చేయడంతో కాంగ్రెస్‌ సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement