మిషన్.. కమీషన్
-
చెరువుల పునరుద్ధరణ పనుల్లో అవినీతి
-
అధికారుల సస్పెన్షన్‌తో వెలుగులోకి..
-
అక్రమాలను ముందే వెల్లడించిన ‘సాక్షి’
-
త్వరలో మరికొందరిపైనా చర్యలు
వరంగల్ : చిన్ననీటి వనరుల పునరుద్ధరణ కోసం చేపట్టిన మిషన్ కాకతీయ మొదటి, రెండవ విడత పనుల్లో జరిగిన అవినీతిపై ప్రభుత్వం దృష్టిసారించింది. అక్రమాలకు బాధ్యులైన వారిపై చర్యలు చేపట్టింది. చెరువుల పునరుద్ధరణ పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. అయితే స్థానిక నేతల ఒత్తిళ్లతో అధికారులు ఈ అక్రమాలను పట్టించుకోలేదు. ఈ పనుల్లో అధికారుల మధ్య వచ్చిన పంపకాల తేడాలతో ఇంజనీర్లే.. పత్రికలో ప్రచురితమైన కథనాలతో పాటు ఆధారాలు కూడా ప్రభుత్వానికి అందించారు.
ఈ విషయాలపై నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం రాష్ట్ర స్థాయి అధికారులతో తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి ఇంటలిజెన్స్ విభాగంతో విచారణ జరిపించింది. అక్రమాలు నిజమేనని విచారణలో తేలడంతో ప్రభుత్వం కొరడా ఝులిపిస్తోంది. గురువారం ఐదుగురు ఇంజనీర్లను సస్పెండ్ చేసింది. ఒకేసారి ఐదుగురు అధికారులపై చర్యలు తీసుకోవడం జిల్లా ఇరిగేషన్ చరిత్రలో మొదటిసారని తెలిసింది. మరో డివిజన్ స్థాయి అధికారితో పాటు పలువురు డీఈఈ, ఏఈఈలపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు విచారణ చేపట్టిన ప్రభుత్వం చర్యలు ప్రారంభించడంతో ఇంజనీర్ల గుండెళ్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి.
లెస్‌లపై దృష్టి
చెరువుల పునరుద్ధరణ పనులు నాణ్యతతో జరగాలని ప్రభుత్వం.. టెండర్లలో 10 శాతానికి ఎక్కువ లెస్ వేస్తే అడ్వాన్స్ సెక్యూరిటీ డిపాజిట్(ఎఎస్‌డీ) కట్టాలన్న నిబంధనలను పెట్టింది. అయినా ఎక్కువ మొదటి విడత పనుల్లో 25శాతం వరకు, రెండో విడతలో 35శాతం వరకు లెస్‌లకు పోవడంతో ప్రభుత్వం జరిగిన పనులపై సీరియస్‌గా దృష్టి పెట్టింది. పనుల దశల్లోనే అక్రమాలను అరికడితే లెస్‌లు తగ్గి నాణ్యత పెరుగుతుందని భావిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే మొదటి విడత జరిగిన పనులపై రెండు విడతల్లో తనిఖీలు జరిగాయి. బిల్లులు చెల్లించినా ఫైనల్ చేయని పనుల్లో పెద్ద మొత్తంలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. జరిగిన అక్రమాలకు బాధ్యులైన వారిపై వేటు వేయడం ప్రారంభమైంది.
గాడితప్పిన పూడిక తీతలు...
మిషన్ కాకతీయ పనుల్లో భారీగా పూడిక తీసేందుకు ప్రతిపాదనలు రూపొందించడంతో ఎక్కువ లెస్‌లకు కాంట్రాక్టర్లు పోటీ పడినట్లు ప్రభుత్వం గుర్తించింది. అందులో భాగంగా పూడికలు తీయకుండానే వేల క్యూబిక్ మీటర్లలో మట్టి తరలించినట్లు ఎంబీలు రికార్డు చేసి బిల్లులు చెల్లించిన వారికి తర్వలోనే శ్రీముఖాలు అంతుతాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ములుగు, మహబూబాబాద్‌తో సాటు ఇతర డివిజన్లలోని పలు పనులపై ఇప్పటికే విచారణ పూర్తికాగా చర్యలు త్వరలోనే చేపట్టే అవకాశాలున్నాయన్న చర్చ శాఖలో జరుగుతోంది.