పనితీరు మెరుగుపడకపోతే చర్యలు
• మిషన్‌కాకతీయ, వాటర్‌గ్రిడ్
• పనులపై నిర్లక్ష్యం తగదు
• ఫిబ్రవరి 15నాటికి 288 గ్రామాలకు నల్లా నీరు ఇవ్వాలి
• మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి
మహబూబ్‌నగర్ న్యూటౌన్ :
అధికారుల తడబాటు, ప్రణాళిక లేకుండా పొంతనలేని సమాధానాలిచ్చిన మిషన్‌కాకతీయ, మిషన్ భగీరథ అధికారులపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి మండిపడ్డారు. పనితీరు మెరుగుపడకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం స్థానిక రెవెన్యూ సమావేశ మందిరంలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు, హరితహారం కార్యక్రమాలపై జిల్లా అధికారులతో ఆయన సమీక్షించారు. సమావేశానికి వివరాలు లేకుండా హాజరుకావడంపై మంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ కాకతీయ పథకం కింద మూడో విడతకు జిల్లాలో 800 చెరువులు గుర్తించాలన్నారు.
మిషన్ కాకతీయ మూడో విడతకు చెరువుల ఎంపికకు ఆయకట్టు సమస్య వస్తోందని ఇరిగేషన్ అధికారులు చెప్పడంతో స్పందించిన మంత్రి పొంతన లేని సమాధానాలు చెప్పవద్దన్నారు. 20 ఎకరాల కంటే ఎక్కువున్న చెరువుల లిస్టు చెప్పాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అధికారులను కోరడంతో వివరాలు తమ వెంట తీసుకురాలేదని వారు సమాధానం చెప్పారు. దీంతో అధికారుల తీరుపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికి నల్లా కనెక్షన్ ద్వారా నీళ్లిచ్చే కార్యక్రమానికి సంబందించిన పనుల పురోగతిపై మంత్రి వివరాలడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో పనుల నిర్వహణలో జాప్యాన్ని తెలుసుకున్న మంత్రి ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈని నిలదీశారు. నిర్ణీత గడువు ఫిబ్రవరి 15 వరకు 288 గ్రామాలకు తాగునీరు అందించే విధంగా పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. హరితహారం లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను సిద్ధం చేసుకొని వర్షాలు రాగానే మొక్కలు నాటేలా ప్రణాళిక రూపొందించుకోవాలని డీఎఫ్‌ఓ గంగారెడ్డికు మంత్రి లక్ష్మారెడ్డి సూచించారు.
పనులు చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టండి : కలెక్టర్ రొనాల్డ్‌రోస్
మిషన్ కాకతీయ మొదటి, రెండో విడత పనుల ను చేపట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్న కాంట్రాక్టర్ల ను బ్లాక్ లిస్టులో పెట్టాలని కలెక్టర్ అధికారుల ను ఆదేశించారు. 20 ఎకరాలకు పైగా ఆయకట్టున్న చెరువులు, కుంటలను మూడో విడతకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. పాత పాలమూర్‌లో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ 100 గజాలు స్థలం కలిగిన లబ్ధిదారులకు ముందు గా ఇళ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని హౌజింగ్ పీడీ రమణారావును ఆదేశించారు. స మావేశంలో ట్రైనీ ఐఏఎస్ గౌతం, ఆర్డీఓ లక్ష్మీ నారాయణ, చిన్ననీటి పారుదల, ఆర్‌డబ్ల్యూఎస్, హౌజింగ్, పంచాయతీరాజ్, ఫారెస్టు, గ్రా మీణాభివృద్ధి శాఖ అధికారులు పాల్గొన్నారు.