vatargrid
-
పనితీరు మెరుగుపడకపోతే చర్యలు
• మిషన్‌కాకతీయ, వాటర్‌గ్రిడ్ • పనులపై నిర్లక్ష్యం తగదు • ఫిబ్రవరి 15నాటికి 288 గ్రామాలకు నల్లా నీరు ఇవ్వాలి • మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి మహబూబ్‌నగర్ న్యూటౌన్ : అధికారుల తడబాటు, ప్రణాళిక లేకుండా పొంతనలేని సమాధానాలిచ్చిన మిషన్‌కాకతీయ, మిషన్ భగీరథ అధికారులపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి మండిపడ్డారు. పనితీరు మెరుగుపడకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం స్థానిక రెవెన్యూ సమావేశ మందిరంలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, డబుల్బెడ్రూమ్ ఇళ్లు, హరితహారం కార్యక్రమాలపై జిల్లా అధికారులతో ఆయన సమీక్షించారు. సమావేశానికి వివరాలు లేకుండా హాజరుకావడంపై మంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ కాకతీయ పథకం కింద మూడో విడతకు జిల్లాలో 800 చెరువులు గుర్తించాలన్నారు. మిషన్ కాకతీయ మూడో విడతకు చెరువుల ఎంపికకు ఆయకట్టు సమస్య వస్తోందని ఇరిగేషన్ అధికారులు చెప్పడంతో స్పందించిన మంత్రి పొంతన లేని సమాధానాలు చెప్పవద్దన్నారు. 20 ఎకరాల కంటే ఎక్కువున్న చెరువుల లిస్టు చెప్పాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అధికారులను కోరడంతో వివరాలు తమ వెంట తీసుకురాలేదని వారు సమాధానం చెప్పారు. దీంతో అధికారుల తీరుపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికి నల్లా కనెక్షన్ ద్వారా నీళ్లిచ్చే కార్యక్రమానికి సంబందించిన పనుల పురోగతిపై మంత్రి వివరాలడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో పనుల నిర్వహణలో జాప్యాన్ని తెలుసుకున్న మంత్రి ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈని నిలదీశారు. నిర్ణీత గడువు ఫిబ్రవరి 15 వరకు 288 గ్రామాలకు తాగునీరు అందించే విధంగా పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. హరితహారం లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను సిద్ధం చేసుకొని వర్షాలు రాగానే మొక్కలు నాటేలా ప్రణాళిక రూపొందించుకోవాలని డీఎఫ్ఓ గంగారెడ్డికు మంత్రి లక్ష్మారెడ్డి సూచించారు. పనులు చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టండి : కలెక్టర్ రొనాల్డ్‌రోస్ మిషన్ కాకతీయ మొదటి, రెండో విడత పనుల ను చేపట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్న కాంట్రాక్టర్ల ను బ్లాక్ లిస్టులో పెట్టాలని కలెక్టర్ అధికారుల ను ఆదేశించారు. 20 ఎకరాలకు పైగా ఆయకట్టున్న చెరువులు, కుంటలను మూడో విడతకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. పాత పాలమూర్లో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ 100 గజాలు స్థలం కలిగిన లబ్ధిదారులకు ముందు గా ఇళ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని హౌజింగ్ పీడీ రమణారావును ఆదేశించారు. స మావేశంలో ట్రైనీ ఐఏఎస్ గౌతం, ఆర్డీఓ లక్ష్మీ నారాయణ, చిన్ననీటి పారుదల, ఆర్డబ్ల్యూఎస్, హౌజింగ్, పంచాయతీరాజ్, ఫారెస్టు, గ్రా మీణాభివృద్ధి శాఖ అధికారులు పాల్గొన్నారు. -
సచివాలయంలో నేడు కేబినెట్ భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆదివారం సాయంత్రం సచివాలయంలో జరుగనుంది. అసెంబ్లీ సమావేశాలను మరో ఐదు రోజులు పొడిగించిన నేపథ్యంలో ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహం, వివిధ శాఖలకు కేటాయించిన పద్దులు, బిల్లులు, డిమాండ్లు తదితర అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించనున్నట్టు తెలిసింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర పారిశ్రామిక విధానం బిల్లును కూడా ఆమోదించే అవకాశాలున్నాయి. దీంతోపాటు చెరువుల పునరుద్ధరణ, రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, వాటర్‌గ్రిడ్, ఇసుక విధానం వంటి అంశాలపైనా చర్చించనున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరుపెట్టకుండా యథాతథ స్థితిని కొనసాగించడంపై మంత్రివర్గం తీర్మానించే అవకాశమున్నట్లు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. తొలుత కేబినెట్ సమావేశాన్ని సోమవారం ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నట్లుగా మంత్రులకు సమాచారం అందింది. కానీ, అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10 గంటలకే ప్రారంభం కానుండడంతో ఆ లోపు భేటీ సాధ్యంకాదని అభిప్రాయం వచ్చింది. దీంతో ఆదివారం సాయంత్రమే కేబినెట్ భేటీ నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. -
ఎల్ మడుగుకు మహర్దశ!
జలవిద్యుత్ కేంద్రం లేదా వాటర్‌గ్రిడ్ ఏర్పాటుకు సర్కారు యోచన మంథని : మంథని మండలం ఖాన్సాయిపేట సమీపంలో ఉన్న ఎల్ మడుగుకు మహర్దశ పట్టనుంది. తెలంగాణ లో విద్యుత్ కోతలను అధిగమించేందుకు విద్యుత్ ఉత్పాదక కేంద్రాలను నెలకొల్పాలని సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగా అపారమైన నీటినిల్వలున్న ఎల్ మడుగులో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని గత నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంథని ఎమ్మెల్యే పుట్ట మధుతో పాటు వివిధ శాఖల అధికారులు ఎల్ మడుగు సందర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది. గోదావరినది మంథని నియోజకవర్గాన్ని ఆనుకుని ప్రవహిస్తుండగా ఎల్ మడుగు ప్రాంతంలో నీటి నిల్వ అత్యధికంగా ఉంటుంది. వర్షాకాలంలో ఐదు టీఎంసీలు, ఎండాకాలంలో మూడు టీఎంసీల నీరు నిల్వ ఉంటుందని నీటిపారుదల అధికారులు తేల్చారు. ఎల్ మడుగులో నీటి ఊట (స్ప్రింగ్) ఉన్నట్లు గుర్తించారు. ఈ మడుగు 35 నుంచి 40 మీటర్ల లోతు ఉంటుందని అధికారులు సర్కారుకు నివేదించారు. అంతేగాకుండా తెలంగాణాలో వాటర్‌గ్రిడ్ కోసం ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఎల్ మడుగు వాటర్‌గ్రిడ్‌కు దోహదపడుతుందా అనే కోణంలోనూ అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అటవీప్రాంతంలో ఉన్న ఎల్ మడుగు రెండు గుట్టల నడుమ ప్రవహిస్తోంది. పర్యాటక అభివృద్ధికి సైతం ఈ ప్రాంతం అనువైనదిగా గత ప్రభుత్వం గుర్తించింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ ప్రతిపాదన పెండింగ్‌లో పడిపోయింది. నీటి లభ్యత అత్యధికంగా ఉన్న ఈ ప్రాంతంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిపడటం, తాను ఆ ప్రాంతాన్ని సందర్శిస్తానని చెప్పడంతో అధికారులు ఈ ప్రాంత ప్రతినిధులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే గురువారం మంథని ఎమ్మెల్యే పుట్ట మధు, ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎస్ఈ వెంకటేశ్వర్లు, గోదావరిఖని ఏఎస్పీ ఫకీరప్ప, మంథని ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి, అటవీశాఖ అధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ముఖ్యమంత్రి రాక కోసం అవసరమైన ఏర్పాట్లు, హెలిప్యాడ్, ఇతరత్రా సౌకర్యాల కోసం స్థలాన్ని పరిశీలించారు. శుక్రవారం సైతం కరీంనగర్ ఓఎస్డీ సుబ్బారాయుడు, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన పలువురు అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ నెల రెండు లేదా మూడో వారంలో సీఎం కేసీఆర్ పర్యటన తేదీ ఖరారయ్యే అవకాశముందని తెలిసింది. సీఎం పర్యటన కోసం అధికారులు ఓవైపు ఏర్పాట్లలో నిమగ్నం అవుతూనే తమ శాఖలకు సంబంధించిన నివేదికల తయారీలో తలమునకలవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ మంథని పర్యటనకు రానుండటంతో ఈ ప్రాంతానికి మంచి రోజులు వస్తాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది.