ఎల్ మడుగుకు మహర్దశ! | El lagoon boom! | Sakshi
Sakshi News home page

ఎల్ మడుగుకు మహర్దశ!

Published Sun, Oct 5 2014 3:49 AM | Last Updated on Sat, Sep 2 2017 2:20 PM

ఎల్ మడుగుకు మహర్దశ!

ఎల్ మడుగుకు మహర్దశ!

జలవిద్యుత్ కేంద్రం లేదా వాటర్‌గ్రిడ్ ఏర్పాటుకు సర్కారు యోచన
 
 మంథని :
 మంథని మండలం ఖాన్‌సాయిపేట సమీపంలో ఉన్న ఎల్ మడుగుకు మహర్దశ పట్టనుంది. తెలంగాణ లో విద్యుత్ కోతలను అధిగమించేందుకు విద్యుత్ ఉత్పాదక కేంద్రాలను నెలకొల్పాలని సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగా అపారమైన నీటినిల్వలున్న ఎల్ మడుగులో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని గత నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంథని ఎమ్మెల్యే పుట్ట మధుతో పాటు వివిధ శాఖల అధికారులు ఎల్ మడుగు సందర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది. గోదావరినది మంథని నియోజకవర్గాన్ని ఆనుకుని ప్రవహిస్తుండగా ఎల్ మడుగు ప్రాంతంలో నీటి నిల్వ అత్యధికంగా ఉంటుంది. వర్షాకాలంలో ఐదు టీఎంసీలు, ఎండాకాలంలో మూడు టీఎంసీల నీరు నిల్వ ఉంటుందని నీటిపారుదల అధికారులు తేల్చారు. ఎల్ మడుగులో నీటి ఊట (స్ప్రింగ్) ఉన్నట్లు గుర్తించారు. ఈ మడుగు 35 నుంచి 40 మీటర్ల లోతు ఉంటుందని అధికారులు సర్కారుకు నివేదించారు. అంతేగాకుండా తెలంగాణాలో వాటర్‌గ్రిడ్ కోసం ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఎల్ మడుగు వాటర్‌గ్రిడ్‌కు దోహదపడుతుందా అనే కోణంలోనూ అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అటవీప్రాంతంలో ఉన్న ఎల్ మడుగు రెండు గుట్టల నడుమ ప్రవహిస్తోంది. పర్యాటక అభివృద్ధికి సైతం ఈ ప్రాంతం అనువైనదిగా గత ప్రభుత్వం గుర్తించింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ ప్రతిపాదన పెండింగ్‌లో పడిపోయింది. నీటి లభ్యత అత్యధికంగా ఉన్న ఈ ప్రాంతంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిపడటం, తాను ఆ ప్రాంతాన్ని సందర్శిస్తానని చెప్పడంతో అధికారులు ఈ ప్రాంత ప్రతినిధులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే గురువారం మంథని ఎమ్మెల్యే పుట్ట మధు, ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, గోదావరిఖని ఏఎస్పీ ఫకీరప్ప, మంథని ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి, అటవీశాఖ అధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ముఖ్యమంత్రి రాక కోసం అవసరమైన ఏర్పాట్లు, హెలిప్యాడ్, ఇతరత్రా సౌకర్యాల కోసం స్థలాన్ని పరిశీలించారు. శుక్రవారం సైతం కరీంనగర్ ఓఎస్డీ సుబ్బారాయుడు, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన పలువురు అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ నెల రెండు లేదా మూడో వారంలో సీఎం కేసీఆర్ పర్యటన తేదీ ఖరారయ్యే అవకాశముందని తెలిసింది. సీఎం పర్యటన కోసం అధికారులు ఓవైపు ఏర్పాట్లలో నిమగ్నం అవుతూనే తమ శాఖలకు సంబంధించిన నివేదికల తయారీలో తలమునకలవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ మంథని పర్యటనకు రానుండటంతో ఈ ప్రాంతానికి మంచి రోజులు వస్తాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది.



 
 
 

Advertisement
Advertisement