మిషన్‌ కాకతీయ తీరిది! | quality less works in mission kakatiya | Sakshi
Sakshi News home page

మిషన్‌ కాకతీయ తీరిది!

Published Sun, Jul 24 2016 10:33 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

మిషన్‌ కాకతీయ తీరిది! - Sakshi

మిషన్‌ కాకతీయ తీరిది!

నాచుపల్లి(బీర్కూర్‌) : బీర్కూర్‌ మండలంలోని నాచుపల్లి గ్రామంలో ప్రభుత్వం మిషన్‌కాకతీయలో భాగంగా మూడు చెరువులను ఎంపిక చేసింది. వీటిలో పెద్దచెరువుకు రూ.52.25 లక్షలు, మల్క చెరువుకు రూ.43.35 లక్షలు, పాలకుంట చెరువుకు రూ.48.14 లక్షల చొప్పు నిధులు మంజూరు అయ్యాయి. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరిశ్‌రావు, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిలు పెద్దచెరువు పనులను ప్రారంభించారు. ఇరువురు మంత్రులు ప్రారంభించారనే భయంతో ఈ చెరువు మినహా మిగిలిన రెండు చెరువుల పనులు మాత్రం నాసిరకంగా, నత్తనడకన సాగుతున్నాయి. పలుమార్లు ఈ చెరువుల పనులు సక్రమంగా నిర్వహించడం లేదని రైతులు ఆందోళనలు సైతం నిర్వహించినా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు.
పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది...
పాలకుంట చెరువు పనులు చేపడుతున్న ఇరువురు బినామీ కాంట్రాక్టర్ల మధ్య గొడవలు తలెత్తడంతో పనులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అడపా దడపా కురిసిన వర్షంతో చెరువులో నీళ్లు వచ్చి చేరాయి. ఇక్కడ వారంరోజుల క్రితమే చెరువు తూము మర్మతుల కోసం కట్టను తవ్వారంటే పనుల వేగాన్ని అంచనా వేసుకోవచ్చు. పనులు పూర్తయ్యే వరకు పుణ్యకాలం కాస్తా గడిచిపోయేలా ఉందని ఆయకట్టు రైతులు వాపోతున్నారు. అధికారులు నిర్దేశించినట్లు చెరువులో పూడిక మట్టి తరలించలేదని గంతంలో ఉపాధిహామీలో భాగంగా తీసిన గుంతలనే చదునుచేసి బిల్‌రికార్డు చేసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
నాణ్యత నాకేం ఎరుక అన్న రీతిలో...
గ్రామంలోని మల్క చెరువు తూము పనుల నాణ్యత చూస్తే అధికారులు–కాంట్రాక్టర్లకు ఉన్న చిత్తశుద్ధి అర్థం అవుతోంది. ఈచెరువు పనులను ఇరువురు ‘మాజీలు’ బినామీ కాంట్రాక్టర్లుగా మారి చేపట్టారు. పనుల నాణ్యతను గాలికొదిలేశారు. చెరువు కట్టపై మొరానికి బదులు మట్టితో చదును చేసినా.. రోడ్డు రోలర్‌ తిప్పక పోవడంతో చిన్నపాటి వర్షాలకే మట్టి కొట్టుకు పోతోంది. పూడిక మట్టి తొలగించడం దేవుడెరుగు, అలుగు నిర్మాణం కోసం తవ్విన మట్టి, రాళ్లను తిరిగి చెరువులోనే  డంప్‌చేశారు. అలుగు నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయి. 
ఆందోళనలో రైతులు....
పనుల తీరును చూసి చెరువు కింద భూములున్న  రైతులు తీవ్ర అందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే రెండు సంవత్సరాలుగా వర్షాలు లేక పంటలు కోల్పోయిన రైతులు తెరిచి వున్న  చెరువు కట్టను చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీవర్షాలు కురిసి చెరువులోకి వరద వస్తే తెరిచివున్న తూములు, అలుగుల ద్వారా విలువైన సాగునీరు వృథా అయ్యే అవకాశం వుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి పనులును యుద్ధ ప్రాతిపదికన, నాణ్యతతో  పూర్తిచేయించాలని, లేదంటే ఆందోళనబాట పట్టాల్సి వస్తుందని  రైతులు హెచ్చరిస్తున్నారు. 
పట్టించుకోవడం లేదు : భూమన్న ,ఏఈ బీర్కూర్‌.
పనులను వేగవంతంగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్లకు పలుమార్లు సూచించినా సాకులు చెబుతూ దాటవేస్తున్నారు. పనుల నాణ్యత విషయంలో రాజీపడేది లేదు. గ్రామంలోని పాలకుంట, మల్క చెరువు పనులపై వస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుంటాం. పనులు పరిశీలించిన తరువాతే బిల్లులు చెల్లిస్తాం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement