quality less works
-
నాసిరకం కేరాఫ్ ఆర్అండ్బీ
మధిర : నిర్మాణాల్లో నాణ్యతా లోపాలకు రోడ్లు, భవనాలశాఖ కేరాఫ్ అడ్రస్‌గా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గ కేంద్రమైన మధిరలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నిర్మించేందుకు ప్రభుత్వం కోటిరూపాయలు నిధులు మంజూరు చేసింది. అయితే దీనికి ఓ కాంట్రాక్టర్ దక్కించుకొని, సబ్ కాంట్రాక్టర్‌కు అప్పజెప్పారు. సాక్షాత్తు ఎమ్మెల్యే నివసించే భవనమే నిబంధనలకు విరుద్ధంగా, నాణ్యతాలోపాలతో నిర్మిస్తుండటం గమనార్హం. బేస్మెంట్ లెవెల్లో పిల్లర్స్‌కు ఇనుపచువ్వలు వంకరగా ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ఇటీవల భవన నిర్మాణాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఈఈ గమనించి సిబ్బందిని మందలించారు. అంతేకాకుండా రాడ్ బైండింగ్ సక్రమంగా లేకపోతే భవనం పటుత్వం కోల్పోతుందని చెప్పారు. సరిచేసి పిల్లర్స్‌ను నిర్మించాలని ఆదేశించినప్పటికీ ఆయన ఆదేశాలను కిందిస్థాయి సిబ్బంది పాటించడం లేదు. ఇనుపచువ్వలు వంకరగానే ఉంచి పిల్లర్ నిర్మించడం కొసమెరుపు. అదేవిధంగా మధిర పట్టణంలోని నాలుగులైన్ల రహదారి విస్తరణ పనుల్లో నాణ్యతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంబేడ్కర్ సెంటర్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ ఎత్తులో రింగు నిర్మించారు. దీనిని గమనించిన రోడ్లు భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశాఖ జిల్లా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నిర్మించిన రింగును పగులగొట్టారు. రూ.2.06కోట్ల నిధులతో డివైడర్, సీసీరోడ్లు, రాతికట్టుబడికి ప్రతిపాదనలు పంపగా మంజూరైన నిధులతో నాసిరకంగా నిర్మాణం చేస్తున్నారు. కోటిరూపాయల నిధులతో స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డు నుంచి బైపాస్‌రోడ్డు, కల్వర్టు నిర్మాణం చేపట్టారు. ఖమ్మంపాడు– తొండలగోపవరం, మీనవోలు–తొండలగోపవరం గ్రామాలకు రూ.5కోట్ల నిధులతో బీటీరోడ్డు నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయి. ఇల్లూరు–ఖమ్మంపాడు గ్రామాల మధ్య రూ.15.50కోట్ల నిధులతో వైరానదిపై బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మాటూరు గ్రామసమీపంలో రూ.96లక్షల నిధులతో కల్వర్టు నిర్మించనున్నారు. మండలంలో జరుగుతున్న కోట్లాది రూపాయల పనుల వద్ద పర్యవేక్షణ కొరవడింది. ఇదిలా ఉండగా ఆర్‌అండ్‌బీశాఖ అధికారుల పర్యవేక్షణలో మధిర మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో రూ.3.20లక్షల నిధులతో కోర్టు హాలు, న్యాయమూర్తి చాంబర్, అదనపు కోర్టు హాలు, అదనపు కోర్టు న్యాయమూర్తి చాంబర్లకు మరమ్మతులు చేపడుతున్నారు. అయితే కొద్దిరోజులకే మరమ్మతులకు గురికావడంతో ఈ విషయాన్ని మధిర కోర్టు న్యాయమూర్తి జిల్లాకోర్టు న్యాయమూర్తికి విన్నవించారు. ఈ క్రమంలో ఇటీవల జిల్లా కోర్టు న్యాయమూర్తి మధిర కోర్టులో జరిగిన పనులను పరిశీలించారు. న్యాయస్థానంలో జరిగే పనుల్లోనే నాణ్యత లోపిస్తే ఎలా అని.. ఆర్అండ్బీ అధికారులను హెచ్చరించారు. ఇలా నాణ్యతా లోపంపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతాప్రమాణాల గురించి ప్రజలు ప్రశ్నిస్తే తమశాఖ మంత్రి జిల్లాకు చెందినవారేనని, తమకు ఇబ్బందులు ఉండవని ఆశాఖ అధికారులు చెబుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
లీకేజీలపర్వం
మదనాపురం : బీడు భూములను సాగులోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ సంకల్పం.. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఎత్తిపోతల పథకాలు శిథిలావస్థకు చేరాయి. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కమీషన్లకు కక్కుర్తిపడి దశాబ్దాల పాటు పనిచేయాల్సిన ఎత్తిపోతల పథకాలు ఆదిలోనే మొరాయిస్తున్నాయి. కాంట్రాక్టర్లు కాసులకు కక్కుర్తిపడి నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడంతో లిఫ్టుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి పాలమూరు జిల్లాకే తలమానిగా ఉన్న సరళాసాగర్ ఎత్తిపోతల పథకాన్ని రామన్‌పాడ్ బ్యాలెన్స్ రిజర్వాయర్ నుంచి నాబార్డు ఆర్థికసాయంతో రూ.1,292 లక్షలు వెచ్చించి 2006లో నిర్మించారు. ఈ లిఫ్టు ద్వారా సరళాసాగర్ ప్రాజెక్టును నింపి 4200 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా అధికారులు డిజైనింగ్ రూపొందించారు. తరచూ లీకేజీలు మదనాపురం మండలంలోని శంకరమ్మపేట, దంతనూర్, మదనాపురం, తిర్మలాయపల్లి, రామన్‌పాడు, అజ్జకొల్లు, నర్సింగాపురం, నెల్విడి, వడ్డెవాట గ్రామాలకు సాగునీరు అందించాలని సరళాసాగర్ ఎత్తిపోతల పథకాన్ని రూపకల్పనచేశారు. పథకాన్ని ప్రారంభించిన నాటినుంచి ఇప్పటివరకు ప్రధాన పైప్‌లైన్‌కు 30లీకేజీలు ఉన్నాయి. గత వేసవిలో 20లీకేజీలను సరిచేయగా ఇంకా పదింటిని సరిచేయాల్సి ఉంది. మూడున్నరేళ్లలో నాలుగుసార్లు పైప్‌లైన్ పగిలింది. మొదటిసారి మదనాపురం చిన్నవాగులో, రెండవ సారి ప్రధాన పంప్‌హౌస్ వద్ద తిర్మలాయపల్లి శివారు, మూడవ సారి మదనాపురం వాగులోని మొదట పగిలిన స్థానంలోనే మళ్లీ పగిలింది. నాలుగోసారి నర్సింగాపురం శివారు కావలి రాములు పొలంలో పైప్‌లైన్ పగిలింది. ఎప్పుడు ఎక్కడ ఏ పైప్‌లైన్ పగులుతుందోనని ఇటు లిఫ్టు నిర్వాహణ కమిటీ, ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల పగిలిన పైప్లైన్లకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తన సొంత నిధుల నుంచి రూ.3లక్షలు వెచ్చించి మరమ్మతు చేయించారు. నాణ్యతలేని పైపులు వేశారు. తరతరాలుగా రైతులకు అన్నంపెట్టే లిఫ్టును కాంట్రాక్టర్లు కమీషన్ల కోసం నిర్మాణంలో నాణ్యతలేని పైపులు వేశారు. అధికారులు కుమ్మక్కై ఎత్తిపోతల పథకం లక్ష్యాన్ని నీరుగార్చారు. నాటి సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి ఆశయానికి తూట్లు పొడిచారు. తరచూ లీకేజీలతో పొలాలకు నీళ్లు రాక సతమతమవుతున్నాం.. లిఫ్టు మూతపడితే మా పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతుంది. – వెంకటయ్య, రైతు, నర్సింగాపురం కాంట్రాక్టర్లు దోచుకున్నారు లిఫ్టు నిర్మాణ సమయంలో అధికారులు కాంట్రాక్టర్లు కలిసి దోచుకున్నారు. నాణ్యమైన పైపులు, మోటార్లు వేయకపోవడంతో తరచూ ఇబ్బందులు ఎదుర్కుంటున్నాం.. లిఫ్టు నడవకుంటే ప్రస్తుతం వరినాట్లు వేసుకున్న 1600ఎకరాల పంట ఎండిపోతుంది. అధికారులు స్పందించి ఎత్తిపోతల పథకాలను మరమ్మతు చేసి ప్రారంభించారు. – సూరిబాబు, రైతు, మదనాపురం నాణ్యతలేని పైపుల వాడకంతోనే.. 4,200ఎకరాలకు సాగునీరు అందించే లిఫ్టు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం, నాణ్యత లేని పైపులు, నాసిరకమైన విద్యుత్ మోటార్లను బిగించకపోవడంతోనే అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రధాన పైప్‌లైన్ గుండా ప్రారంభించిన నాటినుంచి తరచూ లీకేజీలు ఏర్పడుతున్నాయి. కొన్నిసార్లు నీటి ఉధృతిని తట్టుకోలేక పైపులు పగిలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 1600 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుంది. -
వేసిన వారానికే..
నాణ్యత లోపంతో లేచిపోయిన తారు నాసిరకం పనులతో ప్రజల అవస్థలు అధ్వానంగా పంచాయతీరాజ్ రోడ్డు కాంట్రాక్టర్లకు అధికారుల సహకారం వర్ధన్నపేట : పంచాయతీరాజ్ శాఖ తీరు మరీ అధ్వానంగా మారుతోంది. ఈ శాఖ నిర్మిస్తున్న రోడ్లు నాసిరకంగా ఉంటున్నాయి. నాణ్యత అనేది మచ్చుకైనా ఉండడం లేదు. ఇష్టారాజ్యంగా పనులు చేసే కాంట్రాక్టర్లకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు తోడవుతున్నారు. దీంతో రోడ్డు నిర్మించిన వారంలోపే తారు మొత్తం పోతోంది. నాసిరకం పనులు, అధికారుల ఉదాసీనత వల్లే ఈ పరిస్థితి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అభివృద్ధి పనుల్లో నాణ్యత కోసం సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నట్లు జిల్లా కలెక్టరు వాకాటి కరుణ ఈ ఏడాది మొదట్లో ప్రకటించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం నిర్మిస్తున్న రోడ్ల పనులతోనే దీన్ని మొదలుపెట్టినట్లు ప్రకటించారు. సామాజిక తనిఖీ విషయం ఏమోగానీ.. ఈ శాఖ నిర్మించిన రోడ్ల పరిస్థితి మాత్రం విమర్శలకు దారితీస్తోంది. వర్ధన్నపేట మండలం డీసీతండా నుంచి ల్యాబర్తి వరకు ఉన్న మట్టి రోడ్డును తారు రోడ్డు(డాంబర్) మార్చే పనులు ఇటీవలే చేపట్టారు. దాదాపు ఆరు కిలో మీటర్లు ఉండే ఈ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.2 కోట్లు కేటాయించింది. ఆగస్టు 26న మొత్తం పనులు పూర్తయ్యాయి. పనులు పూర్తయి వారం గడవకముందే తారు లేచిపోతోంది. చేయి తీస్తే పైకి లేస్తోంది. రోడ్డు నిర్మాణం విషయంలో ఎలాంటి ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని డీసీ తండావాసులు చెబుతున్నారు. రోడ్డు పనులు మొదలుపెట్టినప్పుడు క్యూరింగ్ చేయలేదని... నిర్దేశిత మందంతో తారు వేయలేదని అంటున్నారు. పనుల్లో కక్కుర్తి... వర్ధన్నపేట–అన్నారం మధ్య ప్రధాన రహదారిగా ఉన్న ఈ రోడ్డు పూర్తిగా పాడైంది. భారీగా గుంతలు పడ్డాయి. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం దశాబ్దకాలం ఈ రోడ్డును పట్టించుకోలేదు. రోడ్డును అభివృద్ధి చేయాలని టేకులతండాకు చెందిన గిరిజనులు 2013లో సర్పంచ్ ఎన్నికలను బహిష్కరించారు. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అప్పటి జిల్లా కలెక్టర్ జి.కిషన్ వెంటనే రెవెన్యూ అధికారులను తండాకు పంపించారు. వీలైనంత త్వరగా రోడ్డు అభివృద్ధి చేయిస్తామని అధికారులు హమీ ఇచ్చారు. అప్పుడు అధికారుల విజ్ఞప్తితో గిరిజనులు ఎన్నికల్లో పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. అయినా నిర్మాణం విషయంలో పంచాయతీరాజ్ శాఖ, టెండర్లు పూర్తి చేశాక కాంట్రాక్టరు పట్టింపులేకుండా వ్యవహరించారు. రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని డీసీ తండా, టేకుల తండా వాసులు మళ్లీ ధర్నాలు చేశారు. దీంతో గత ఏడాది జూలైలో పనులు మొదలుపెట్టారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పనులను ప్రారంభించారు. అయితే కేవలం మట్టి పనులు చేసి వదిలేశారు. దీనిపై గిరిజనులు పలుసార్లు ధర్నాలు చేసి నిరసన తెలిపారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు నిదానంగా స్పందించారు. వర్షాకాలంలో రోడ్డు పనులు పూర్తయ్యాయి. కానీ, పనుల్లో నాణ్యత పాటించకపోవడంతో వారం రోజులకే రోడ్డుపై కంకర తేలింది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే రోడ్డు పనుల్లో నాణ్యత లేకుండాపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాణ్యత పరిశీలించాకే బిల్లులు – బి.సత్యనారాయణ, ఎస్ఈ, పీఆర్ డీసీ తండా రోడ్డు పనులు ఇటీవలే పూర్తయ్యాయి. ఈ పనులును నేను స్వయంగా పరిశీలించాను. నాణ్యత లోపాలపై కాంట్రాక్టరును పిలిచి చెప్పాను. రోడ్డు పక్కన మట్టిపోపే పనులు వేగంగా చేయాలని ఆదేశించాను. నాణ్యత పరమైన పరీక్షలు నిర్వహించిన తర్వాతే బిల్లులు చెల్లిస్తాము. నాణ్యతలోపాలు ఉంటే కఠినంగా వ్యవహరిస్తాము. -
మిషన్ కాకతీయ తీరిది!
నాచుపల్లి(బీర్కూర్) : బీర్కూర్ మండలంలోని నాచుపల్లి గ్రామంలో ప్రభుత్వం మిషన్‌కాకతీయలో భాగంగా మూడు చెరువులను ఎంపిక చేసింది. వీటిలో పెద్దచెరువుకు రూ.52.25 లక్షలు, మల్క చెరువుకు రూ.43.35 లక్షలు, పాలకుంట చెరువుకు రూ.48.14 లక్షల చొప్పు నిధులు మంజూరు అయ్యాయి. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరిశ్‌రావు, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిలు పెద్దచెరువు పనులను ప్రారంభించారు. ఇరువురు మంత్రులు ప్రారంభించారనే భయంతో ఈ చెరువు మినహా మిగిలిన రెండు చెరువుల పనులు మాత్రం నాసిరకంగా, నత్తనడకన సాగుతున్నాయి. పలుమార్లు ఈ చెరువుల పనులు సక్రమంగా నిర్వహించడం లేదని రైతులు ఆందోళనలు సైతం నిర్వహించినా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది... పాలకుంట చెరువు పనులు చేపడుతున్న ఇరువురు బినామీ కాంట్రాక్టర్ల మధ్య గొడవలు తలెత్తడంతో పనులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అడపా దడపా కురిసిన వర్షంతో చెరువులో నీళ్లు వచ్చి చేరాయి. ఇక్కడ వారంరోజుల క్రితమే చెరువు తూము మర్మతుల కోసం కట్టను తవ్వారంటే పనుల వేగాన్ని అంచనా వేసుకోవచ్చు. పనులు పూర్తయ్యే వరకు పుణ్యకాలం కాస్తా గడిచిపోయేలా ఉందని ఆయకట్టు రైతులు వాపోతున్నారు. అధికారులు నిర్దేశించినట్లు చెరువులో పూడిక మట్టి తరలించలేదని గంతంలో ఉపాధిహామీలో భాగంగా తీసిన గుంతలనే చదునుచేసి బిల్రికార్డు చేసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. నాణ్యత నాకేం ఎరుక అన్న రీతిలో... గ్రామంలోని మల్క చెరువు తూము పనుల నాణ్యత చూస్తే అధికారులు–కాంట్రాక్టర్లకు ఉన్న చిత్తశుద్ధి అర్థం అవుతోంది. ఈచెరువు పనులను ఇరువురు ‘మాజీలు’ బినామీ కాంట్రాక్టర్లుగా మారి చేపట్టారు. పనుల నాణ్యతను గాలికొదిలేశారు. చెరువు కట్టపై మొరానికి బదులు మట్టితో చదును చేసినా.. రోడ్డు రోలర్ తిప్పక పోవడంతో చిన్నపాటి వర్షాలకే మట్టి కొట్టుకు పోతోంది. పూడిక మట్టి తొలగించడం దేవుడెరుగు, అలుగు నిర్మాణం కోసం తవ్విన మట్టి, రాళ్లను తిరిగి చెరువులోనే డంప్‌చేశారు. అలుగు నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఆందోళనలో రైతులు.... పనుల తీరును చూసి చెరువు కింద భూములున్న రైతులు తీవ్ర అందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే రెండు సంవత్సరాలుగా వర్షాలు లేక పంటలు కోల్పోయిన రైతులు తెరిచి వున్న చెరువు కట్టను చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీవర్షాలు కురిసి చెరువులోకి వరద వస్తే తెరిచివున్న తూములు, అలుగుల ద్వారా విలువైన సాగునీరు వృథా అయ్యే అవకాశం వుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి పనులును యుద్ధ ప్రాతిపదికన, నాణ్యతతో పూర్తిచేయించాలని, లేదంటే ఆందోళనబాట పట్టాల్సి వస్తుందని రైతులు హెచ్చరిస్తున్నారు. పట్టించుకోవడం లేదు : భూమన్న ,ఏఈ బీర్కూర్. పనులను వేగవంతంగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్లకు పలుమార్లు సూచించినా సాకులు చెబుతూ దాటవేస్తున్నారు. పనుల నాణ్యత విషయంలో రాజీపడేది లేదు. గ్రామంలోని పాలకుంట, మల్క చెరువు పనులపై వస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుంటాం. పనులు పరిశీలించిన తరువాతే బిల్లులు చెల్లిస్తాం.