వేసిన వారానికే..
-
నాణ్యత లోపంతో లేచిపోయిన తారు
-
నాసిరకం పనులతో ప్రజల అవస్థలు
-
అధ్వానంగా పంచాయతీరాజ్ రోడ్డు
-
కాంట్రాక్టర్లకు అధికారుల సహకారం
వర్ధన్నపేట : పంచాయతీరాజ్ శాఖ తీరు మరీ అధ్వానంగా మారుతోంది. ఈ శాఖ నిర్మిస్తున్న రోడ్లు నాసిరకంగా ఉంటున్నాయి. నాణ్యత అనేది మచ్చుకైనా ఉండడం లేదు. ఇష్టారాజ్యంగా పనులు చేసే కాంట్రాక్టర్లకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు తోడవుతున్నారు. దీంతో రోడ్డు నిర్మించిన వారంలోపే తారు మొత్తం పోతోంది. నాసిరకం పనులు, అధికారుల ఉదాసీనత వల్లే ఈ పరిస్థితి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అభివృద్ధి పనుల్లో నాణ్యత కోసం సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నట్లు జిల్లా కలెక్టరు వాకాటి కరుణ ఈ ఏడాది మొదట్లో ప్రకటించారు.
పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం నిర్మిస్తున్న రోడ్ల పనులతోనే దీన్ని మొదలుపెట్టినట్లు ప్రకటించారు. సామాజిక తనిఖీ విషయం ఏమోగానీ.. ఈ శాఖ నిర్మించిన రోడ్ల పరిస్థితి మాత్రం విమర్శలకు దారితీస్తోంది. వర్ధన్నపేట మండలం డీసీతండా నుంచి ల్యాబర్తి వరకు ఉన్న మట్టి రోడ్డును తారు రోడ్డు(డాంబర్) మార్చే పనులు ఇటీవలే చేపట్టారు. దాదాపు ఆరు కిలో మీటర్లు ఉండే ఈ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.2 కోట్లు కేటాయించింది. ఆగస్టు 26న మొత్తం పనులు పూర్తయ్యాయి. పనులు పూర్తయి వారం గడవకముందే తారు లేచిపోతోంది. చేయి తీస్తే పైకి లేస్తోంది. రోడ్డు నిర్మాణం విషయంలో ఎలాంటి ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని డీసీ తండావాసులు చెబుతున్నారు. రోడ్డు పనులు మొదలుపెట్టినప్పుడు క్యూరింగ్ చేయలేదని... నిర్దేశిత మందంతో తారు వేయలేదని అంటున్నారు.
పనుల్లో కక్కుర్తి...
వర్ధన్నపేట–అన్నారం మధ్య ప్రధాన రహదారిగా ఉన్న ఈ రోడ్డు పూర్తిగా పాడైంది. భారీగా గుంతలు పడ్డాయి. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం దశాబ్దకాలం ఈ రోడ్డును పట్టించుకోలేదు. రోడ్డును అభివృద్ధి చేయాలని టేకులతండాకు చెందిన గిరిజనులు 2013లో సర్పంచ్ ఎన్నికలను బహిష్కరించారు. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అప్పటి జిల్లా కలెక్టర్ జి.కిషన్ వెంటనే రెవెన్యూ అధికారులను తండాకు పంపించారు. వీలైనంత త్వరగా రోడ్డు అభివృద్ధి చేయిస్తామని అధికారులు హమీ ఇచ్చారు. అప్పుడు అధికారుల విజ్ఞప్తితో గిరిజనులు ఎన్నికల్లో పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది.
అయినా నిర్మాణం విషయంలో పంచాయతీరాజ్ శాఖ, టెండర్లు పూర్తి చేశాక కాంట్రాక్టరు పట్టింపులేకుండా వ్యవహరించారు. రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని డీసీ తండా, టేకుల తండా వాసులు మళ్లీ ధర్నాలు చేశారు. దీంతో గత ఏడాది జూలైలో పనులు మొదలుపెట్టారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పనులను ప్రారంభించారు. అయితే కేవలం మట్టి పనులు చేసి వదిలేశారు. దీనిపై గిరిజనులు పలుసార్లు ధర్నాలు చేసి నిరసన తెలిపారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు నిదానంగా స్పందించారు. వర్షాకాలంలో రోడ్డు పనులు పూర్తయ్యాయి. కానీ, పనుల్లో నాణ్యత పాటించకపోవడంతో వారం రోజులకే రోడ్డుపై కంకర తేలింది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే రోడ్డు పనుల్లో నాణ్యత లేకుండాపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నాణ్యత పరిశీలించాకే బిల్లులు
– బి.సత్యనారాయణ, ఎస్‌ఈ, పీఆర్
డీసీ తండా రోడ్డు పనులు ఇటీవలే పూర్తయ్యాయి. ఈ పనులును నేను స్వయంగా పరిశీలించాను. నాణ్యత లోపాలపై కాంట్రాక్టరును పిలిచి చెప్పాను. రోడ్డు పక్కన మట్టిపోపే పనులు వేగంగా చేయాలని ఆదేశించాను. నాణ్యత పరమైన పరీక్షలు నిర్వహించిన తర్వాతే బిల్లులు చెల్లిస్తాము. నాణ్యతలోపాలు ఉంటే కఠినంగా వ్యవహరిస్తాము.