ఆర్‌అండ్‌బీ సిబ్బంది ఆధ్వర్యంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరుగుతున్న దృశ్యం
మధిర : నిర్మాణాల్లో నాణ్యతా లోపాలకు రోడ్లు, భవనాలశాఖ కేరాఫ్ అడ్రస్‌గా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గ కేంద్రమైన మధిరలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నిర్మించేందుకు ప్రభుత్వం కోటిరూపాయలు నిధులు మంజూరు చేసింది. అయితే దీనికి ఓ కాంట్రాక్టర్ దక్కించుకొని, సబ్ కాంట్రాక్టర్‌కు అప్పజెప్పారు. సాక్షాత్తు ఎమ్మెల్యే నివసించే భవనమే నిబంధనలకు విరుద్ధంగా, నాణ్యతాలోపాలతో నిర్మిస్తుండటం గమనార్హం. బేస్‌మెంట్ లెవెల్‌లో పిల్లర్స్‌కు ఇనుపచువ్వలు వంకరగా ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ఇటీవల భవన నిర్మాణాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఈఈ గమనించి సిబ్బందిని మందలించారు. అంతేకాకుండా రాడ్ బైండింగ్ సక్రమంగా లేకపోతే భవనం పటుత్వం కోల్పోతుందని చెప్పారు. సరిచేసి పిల్లర్స్‌ను నిర్మించాలని ఆదేశించినప్పటికీ ఆయన ఆదేశాలను కిందిస్థాయి సిబ్బంది పాటించడం లేదు.
ఇనుపచువ్వలు వంకరగానే ఉంచి పిల్లర్ నిర్మించడం కొసమెరుపు. అదేవిధంగా మధిర పట్టణంలోని నాలుగులైన్ల రహదారి విస్తరణ పనుల్లో నాణ్యతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంబేడ్కర్ సెంటర్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ ఎత్తులో రింగు నిర్మించారు. దీనిని గమనించిన రోడ్లు భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశాఖ జిల్లా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నిర్మించిన రింగును పగులగొట్టారు. రూ.2.06కోట్ల నిధులతో డివైడర్, సీసీరోడ్లు, రాతికట్టుబడికి ప్రతిపాదనలు పంపగా మంజూరైన నిధులతో నాసిరకంగా నిర్మాణం చేస్తున్నారు. కోటిరూపాయల నిధులతో స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డు నుంచి బైపాస్‌రోడ్డు, కల్వర్టు నిర్మాణం చేపట్టారు. ఖమ్మంపాడు– తొండలగోపవరం, మీనవోలు–తొండలగోపవరం గ్రామాలకు రూ.5కోట్ల నిధులతో బీటీరోడ్డు నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయి. ఇల్లూరు–ఖమ్మంపాడు గ్రామాల మధ్య రూ.15.50కోట్ల నిధులతో వైరానదిపై బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
మాటూరు గ్రామసమీపంలో రూ.96లక్షల నిధులతో కల్వర్టు నిర్మించనున్నారు. మండలంలో జరుగుతున్న కోట్లాది రూపాయల పనుల వద్ద పర్యవేక్షణ కొరవడింది. ఇదిలా ఉండగా ఆర్‌అండ్‌బీశాఖ అధికారుల పర్యవేక్షణలో మధిర మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో రూ.3.20లక్షల నిధులతో కోర్టు హాలు, న్యాయమూర్తి చాంబర్, అదనపు కోర్టు హాలు, అదనపు కోర్టు న్యాయమూర్తి చాంబర్లకు మరమ్మతులు చేపడుతున్నారు. అయితే కొద్దిరోజులకే మరమ్మతులకు గురికావడంతో ఈ విషయాన్ని మధిర కోర్టు న్యాయమూర్తి జిల్లాకోర్టు న్యాయమూర్తికి విన్నవించారు. ఈ క్రమంలో ఇటీవల జిల్లా కోర్టు న్యాయమూర్తి మధిర కోర్టులో జరిగిన పనులను పరిశీలించారు. న్యాయస్థానంలో జరిగే పనుల్లోనే నాణ్యత లోపిస్తే ఎలా అని.. ఆర్‌అండ్‌బీ అధికారులను హెచ్చరించారు. ఇలా నాణ్యతా లోపంపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతాప్రమాణాల గురించి ప్రజలు ప్రశ్నిస్తే తమశాఖ మంత్రి జిల్లాకు చెందినవారేనని, తమకు ఇబ్బందులు ఉండవని ఆశాఖ అధికారులు చెబుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment