మిషన్ కాకతీయలో మాయ | Mission Kakatiya magic | Sakshi
Sakshi News home page

మిషన్ కాకతీయలో మాయ

Published Tue, Apr 4 2017 7:07 AM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

మిషన్ కాకతీయలో మాయ - Sakshi

మిషన్ కాకతీయలో మాయ

► అవినీతి కాంట్రాక్టర్లకు వత్తాసు
► బ్లాక్‌ లిస్ట్‌పై జాప్యం
► జాబితా రాకముందే మూడోదశ టెండర్లు
► పనుల కోసం అక్రమ కాంట్రాక్టర్ల యత్నాలు
► సాగునీటి శాఖ తీరుపై విమర్శలు
 
మిషన్‌ కాకతీయలో మళ్లీ మాయ జరిగే పరిస్థితులు నెలకొన్నాయి. మొదటి దశ పనుల్లో అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్లు తాజాగా పనుల కోసం టెండర్లు వేస్తున్నారు. అక్రమార్కుల నుంచి నిధులను రికవరీ చేయాల్సి ఉండగా... టెండర్లలో మళ్లీ వారికే కొత్త పనులు వచ్చే పరిస్థితి ఉండడం సాగునీటి శాఖలో చర్చనీయాంశంగా మారింది.  
 
సాక్షి, వరంగల్‌ : చిన్న నీటి వనరుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్‌ కాకతీయ మొదటి దశ పనుల్లో... ఉమ్మడి వరంగల్‌లో భారీగా అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం గత సంవత్సరం నవంబర్‌లో నిర్ధారించింది. సాగునీటి శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు కలిసి ప్రభుత్వ నిధులను స్వాహా చేశారని విచారణలో గుర్తించింది. అక్రమాలకు బాధ్యులైన 13 మంది అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించింది.
 
ఉమ్మడి జిల్లాలో 19 మంది కాంట్రాక్టర్లు మిషన్‌ కాకతీయలో పనులు చేయకుండానే బిల్లులు తీసుకున్నారని, కొన్నిచోట్ల తక్కువగా పనులు చేసి ఎక్కువ నిధులు తీసుకున్నారని విజిలెన్స్‌ విభాగం గుర్తించింది. అక్రమాలకు పాల్పడిన వి.సోమేశ్వరరావు, ఇ.ఐలయ్య, కె.నాగరాజు, కె.వెంకటేశ్వరరెడ్డి, ఎస్‌.కొమురుమల్లు, ఎన్‌.శ్రావణ్‌కుమార్‌రెడ్డి, ఎస్‌.కె.మహమ్మద్, జి.జగదీష్‌రెడ్డి, ఎ.రాజేందర్, బి.మహేందర్, పి.శ్రీనివాసరెడ్డి, ఎ.క్రిష్ణారెడ్డి, ఎం.రాజు, ఎన్‌.వేణుగోపాల్‌రెడ్డి, జి.నర్సయ్య, సి.హెచ్‌.శ్రీనివాస్, సె.బిజామ్, జి.సంపత్‌రావు, ఎన్‌.వెంకన్న కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చాలని సూచించింది. వీరి నుంచి రూ.1.70 కోట్లు రికవరీ చేయాల్సి ఉండగా కాంట్రాక్టర్లపై చర్యల విషయంలో సాగునీటి శాఖ ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. మరోవైపు మిషన్‌ కాకతీయ మూడో దశ పనుల టెండర్ల ప్రక్రియ మొదలైంది. ఈ దశలో 630 చెరువులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 330 చెరువుల పనుల కోసం టెండర్ల ప్రక్రియ నడుస్తోంది. ఇదే అదనుగా అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్లు మూడో దశ పనులను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సాంకేతికంగా వీరిని బ్లాక్‌ లిస్టులో చేర్చకపోవడంతో వీరికీ పనులు దక్కించుకునే అవకాశం ఉంటోంది.
 
ఈ కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చాలని విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం తన విచారణ నివేదికను, ప్రతిపాదలను 2016 నవంబరులో ప్రభుత్వానికి సమర్పించింది. విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం, సాగునీటి శాఖ ఉన్నతాధికారులను ఆదేశించింది. సాగునీటి శాఖ అధికారులు నింపాదిగా నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఒత్తిడితో ఈ ఏడాది ఫిబ్రవరిలో స్పందించింది. విజిలెన్స్‌ విభాగం నివేదిక ఆధారంగా అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై 13 మంది అధికారులపై చర్యలు తీసుకున్నది. ఏడుగురు అధికారులను సస్పెండ్‌ చేసింది. మరో ఆరుగురు అధికారులపై శాఖా పరమైన చర్యలు తీసుకున్నది.
 
ఇంకా ఆదేశాలు రాలేదు 
మిషన్‌ కాకతీయ మొదటి దశ పనుల్లో అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విబాగం ఇచ్చిన నివేదిక ఆధారంగా సాగునీటి శాఖ ఉన్నత స్థాయిలో అధికారులపై చర్యలు తీసుకున్నది. కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్టులో చేర్చే విషయంలో ఇప్పటి వరకు మాకు ఎలాంటి సమాచారమూ లేదు. ఉన్నతస్థాయిలో తీసుకునే నిర్ణయం మేరకు ఇక్కడ నిబంధనలు అమలు చేస్తాం. 
-ఎ.శ్రీనివాస్‌రెడ్డి, సాగునీటి శాఖ జిల్లా అధికారి
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement