పూతపూసి మాయ! | corruption in mission kakatiya works | Sakshi
Sakshi News home page

పూతపూసి మాయ!

Published Tue, Jun 28 2016 2:35 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

పూతపూసి మాయ! - Sakshi

పూతపూసి మాయ!

మిషన్ కాకతీయ పనుల్లో అవినీతి
పాత పనులకే పైపై మెరుగులు
సిమెంట్ పూతపూసి నిధులు స్వాహా
పనులు పూర్తికాకుండానే డబ్బులు డ్రా
పాత పనులకు కొత్తగా ఎంబీ రికార్డులు
ఆయకట్టు రైతులకు ప్రయోజనం శూన్యం

‘మిషన్ కాకతీయ’లో అవినీతి ఏరులై పారుతోంది. చేయని పనులు చేసినట్టు చూపి కాంట్రాక్టర్లు దర్జాగా బిల్లులు కాజేస్తున్న వైనం అక్కడక్కడా వెలుగుచూస్తోంది. తాజాగా పాత పనులకే సిమెంట్ పూత పూసి బిల్లులు మింగేసిన వైనం, దానికి అధికారులు నోరు మెదపని తీరు ధారూరు మండలంలో బయటపడింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం నీరుగారుతోందని ఆ చెరువు కింది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.       

ధారూరు: మిషన్ కాకతీయ పనులు అవినీతికి కేరాఫ్‌గా మారాయి. ధారూరు మండలంలోని మున్నూరుసోమారం కొత్త చెరువు పనుల్లో జరిగిన అవినీతి చూసి స్థానిక రైతులు ముక్కున వేలేసుకుంటున్నారు. ‘మిషన్ కాకతీయ పథకం’ కింద ఈ చెరువు నిర్మాణానికి రూ.35 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో పనులు చేపట్టిన కాంట్రాక్టర్ పాత కాల్వలకు, పాత పైపులకు సిమెంట్ పూత పూసి చేతులు దులుపుకున్నాడు. చెరువు కింద ఉన్న కాల్వలన్నీ నిర్మాణానికి నోచుకోకుండా అలాగే ఉన్నాయి. చెరువు నుంచి పంట పొలాలకు నీళ్లు వెళ్లే కాల్వలను నిర్మించాల్సి ఉంది.

అయితే కాల్వలను ఎత్తుగా నిర్మించడంతో నీరు చెరువులోకే వచ్చే విధంగా నిర్మాణాలు తయారయ్యాయి. ఎంబీ రికార్డుల్లో మాత్రం రెండు కిలోమీటర్ల కాల్వలో బ్యాకింగ్ పనులు, మూడు చిన్న కల్వర్టులు, గైడ్‌వాల్‌ను నిర్మించినట్లు ఉంది. అలాగే వాగులకు అడ్డంగా రెండు చోట్ల కల్వర్టులు నిర్మించినట్లు రికార్డుల్లో నమోదు చేసినట్లు తెలిసింది. ఈ పనులకు సంబంధించి ఇప్పటివరకు కాంట్రాక్టర్‌కు రూ.30 లక్షలు చెల్లించేశారు. కానీ వాస్తవానికి చెరువు వద్ద పనులు పూర్తిస్థాయిలో చేపట్టలేదు.

పాత పనులనే కొత్తగా చేసినట్లు చూపి డబ్బులు డ్రా చేసుకున్నారు. ఈ చెరువుపై ఇప్పటికే రూ.30 లక్షలు ఖర్చు చేసినప్పటికీ రైతులకు ఏ మాత్రం ప్రయోజనం సమకూరలేదు. చెరువు ఆయకట్టుకు ఈ ఏడాది కూడా నీరందే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. అధికారులు సైతం కాంట్రాక్టర్‌తో కుమ్మక్కు కావడం వల్ల నిధులు దుర్వినియోగం అయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 పనులు తీరుపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు
గత రెండు ధారూరు మండల సర్వసభ్య సమావేశాల్లో మున్నూరుసోమారం గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుడు చెరువు నిర్మాణ పనుల్లో జరుగుతున్న అవినీ తిని స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అయినా పనుల్లో మాత్రం నాణ్యత కనిపించలేదు. 

నాకు తెలీదు: కొత్త ఏఈ.. 
పాత ఏఈనే అడగండి: డీఈ

మున్నూరు సోమారం కొత్త చెరువు పనుల గురించి తనకేమీ తెలియదని కొత్తగా వచ్చిన ఏఈ సుకుమార్ పేర్కొన్నారు. ధారూరు మండలంలోని చెరువుల వివరాలన్నీ పాత ఏఈ పార్థసారథి వద్దే ఉన్నాయని డీఈ వెంకటేశం చెప్పరు.

 ఈ విషయమై పాత ఏఈ పార్థసారథిని ప్రశ్నించగా.. పొంతనలేని సమాధానం ఇచ్చారు. చేపట్టిన పనులు.. ఎంబీ రికార్డుల్లో నమోదుపై సమాధానం దాటవేశారు. సిమెంట్ పూత పూసిన విషయాన్ని ప్రస్తావించగా.. వాటిని ఇంకా రికార్డు చేయలేదని చెప్పుకొచ్చారు. పనులు జరగకున్నా కాంట్రాక్టర్‌కు రూ.30 లక్షలు ఎలా చెల్లించారని ప్రశ్నిస్తే.. కాంట్రాక్టర్‌నే అడగండి.. అంటూ సలహా ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement