స్వయంపాలనతో స్వర్ణయుగం | Balka Suman Guest Column On Fourth Telangana Formation Day | Sakshi
Sakshi News home page

Published Thu, May 31 2018 12:59 AM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM

Balka Suman Guest Column On Fourth Telangana Formation Day - Sakshi

2014, జూన్‌ 2 తెలంగాణ చరిత్రలో మైలురాయి. ఆరు దశాబ్దాల పాటు అరిగోస పడ్డ తెలంగాణకు పరాయి పాలన నుంచి విముక్తి లభించిన రోజు. రాష్ట్రాన్ని సాధించిన నాటి ఉద్యమ దళపతి, నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్వపరిపాలనకు శ్రీకారం చుట్టిన రోజు. తన పాలనా దక్షత, పట్టుదల, దూరదృష్టి, తన ప్రజానీకంపై ప్రేమతో తెలంగాణను అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా మార్చేందుకు, ప్రజా సంక్షేమమే పరమావధిగా జనరంజక పాలన సాగిస్తూ దేశంలోని ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా నిలుస్తున్నారు. ఈ నాలుగేళ్లలో అందరి మన్ననలు అందుకున్నారు. అందుకే ఇప్పుడు యావత్‌ భారతదేశం తెలంగాణవైపు చూస్తోంది.

స్వయం పాలనతో స్వర్ణయుగం / ఎదపైన దిగులు బండ జరిగి బాధ తొలిగెనో / ఎండిన చెలిమె నిండిన అనుభూతి కలిగెనో / శరవెట్టినట్టి 60 ఏళ్ల బలిమి ఓడెనో / కల నిజమాయెనని నేల తనను తడుముకున్నదో / వేరువడ్డ తెలంగాణ పేరు మోగగా / ఎగసిపారే గోదావరి మురిపెమంపెనో / తనువార నీళ్లనిస్తనని అభయమొసగెనో / అణువణువున తరుమడుల సిరులు దొర్లనున్నయో /పరుగూల రాణి కృష్ణవేణి దారి మళ్లగా / కరువన్నదింక నిఘంటువుల దాగనున్నదో / ఐదేండ్లలో అటుఇటై ఇడుములొచ్చినా / పదేండ్లలో జపానోలే ప్రగతి విరుయునో.... ఇదీ ప్రజాకవి గోరటి వెంకన్న  స్వరాష్ట్రంలో స్వయం పాలనపై రాసిన పాట.

ప్రపంచంలో ప్రతి ప్రాంతానికీ ఓ కథ ఉంటుంది. కానీ కొన్నింటికి మాత్రమే చరిత్రలో స్థానం దక్కుతుంది. దశాబ్దాల తరబడి పరాయిపాలనలో మగ్గి, శాంతియుత ఉద్యమంతో స్వరాష్ట్రాన్ని సాధించుకుని, అద్భుతరీతిలో అభివృద్ధిపథంలో దూసుకుపోతున్న తెలంగాణ కథ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయదగినది. సవాళ్లను ఎదుర్కొంటూ, అవాంతరాలను అధిగమిస్తూ ప్రజాసేవే పరమావధిగా ముందుకెళ్తున్న ఆయన పాలనలో తమమార్కు చూపిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. 

2014 జూన్‌ 2. తెలంగాణ చరిత్రలో మైలు రాయి. ఆరు దశాబ్దాల పాటు అరిగోసపడ్డ తెలంగాణకు పరాయి పాలన నుంచి విముక్తి లభించిన రోజు. స్వపరిపాలనకు శ్రీకారం చుట్టిన రోజు. స్వరాష్ట్రాన్ని సాధించిన నాటి ఉద్యమ దళపతి... నేటి రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు పూర్తి కాబోతోంది. 

సమైక్య పాలనలో తెలంగాణ ప్రజలు పడ్డ కష్టాలకు కొదవ లేదు. వాటి గురించి రాస్తే రామాయణం చెబితే భారతం. పాలకుల శీతకన్ను తెలంగాణకు శాపంగా మారింది. వ్యవసాయం కుంటుపడింది. రైతులు కూలీలయ్యారు. కూలీలు రోడ్డున పడ్డారు. కానీ స్వరాష్ట్రం సిద్ధించి కేసీఆర్‌ పాలనాపగ్గాలు చేపట్టిన ఈ 4 ఏళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 6 దశాబ్దాల సమైక్య పాలనలో అభివృద్ధి అందనంత దూరంలో నిలిచిన తెలంగాణ నాలుగేళ్లలోనే ప్రగతి పథంలో దూసుకుపోతోంది. రాష్ట్రం విడిపోతే తెలం గాణ అంధకారమవుతుంది. నీళ్లు ఎక్కడినుంచి వస్తాయని ప్రశ్నించిన వారి నోళ్లు మూయించింది.

చిమ్మ చీకట్లు అలముకున్న దుస్థితి నుంచి నాలుగేళ్లలో వెలుగు జిలుగుల తెలంగాణ ఆవిష్కరించడానికి సీఎం కేసీఆర్‌ చేసిన ప్రయత్నం ప్రశంసనీయం. విద్యుత్‌ లోటుతో అల్లాడుతున్న రాష్ట్రం ఇప్పుడు మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మారింది. ఇప్పుడు కరెంటు కోతలు లేవు. పవర్‌ హాలిడేలను నిరసిస్తూ పారిశ్రామికవేత్తల ఆందోళనలు లేవు. దేశంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ.  

పరాయి పాలనలో బీడువారిన భూములకు కృష్ణా, గోదావరి నీళ్లు పారించేందుకు కేసీఆర్‌ ప్రాజెక్టులను రీడిజైన్‌ చేశారు. ఆ నదుల్లో తెలంగాణ వాటా 1330 టీఎంసీల నీళ్లను తెలంగాణ బీడు భూములకు మళ్లించడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం, పాలమూరు– రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల, సీతారామ, తుపాకులగూడెం, ఎల్లంపల్లి నుంచి వరద కాలువ ద్వారా రివర్స్‌ పంపింగ్‌లో ఎస్సారెస్పీకి నీళ్లు తరలించే బృహత్తర కార్యక్రమంతో పాటు మిగతా ప్రాజెక్టులన్నీ శరవేగంగా పూర్తి చేస్తోంది. కేసీఆర్‌ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. దేశంలో నదీజలాల పంపిణీ విషయంలో వివిధ రాష్ట్రాల మధ్య వివాదాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి.

కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరి జలాలు– కేరళ, తమిళనాడు మధ్య ముళ్ల పెరియార్‌ డ్యాం వివాదాలే ఇందుకు ఉదాహరణ. అయితే గోదావరి జలాల విషయంలో కేసీఆర్‌ చూపిన చొరవతో మహారాష్ట్ర, తెలంగాణ మధ్య చారిత్రక ఒప్పందం సాధ్యమైంది. ఈ మహా ఒప్పందం కేసీఆర్‌ రాజనీతిజ్ఞతకు నిదర్శనం. దేశంలో ఇతరులకు ఆదర్శం. నీటి పారుదల శాఖకు ప్రతి సంవత్సరం దాదాపు 25వేల కోట్ల బడ్జెట్‌ కేటాయిస్తూ ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తున్న ప్రభుత్వ తపనను ప్రపంచం గమనిస్తోంది.

మిషన్‌ కాకతీయ పేరుతో 46 వేల చెరువుల్లో పూడికతీసే బృహత్తర కార్యాన్ని నాలుగు దశల్లో అమలుచేస్తోంది. చెరువులకు జీవం పోసే ప్రతిష్టాత్మక మిషన్‌ కాకతీయ పథకాన్ని నోబెల్‌ అవార్డు గ్రహీత కైలాష్‌ సత్యార్థితో పాటు వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా రాజేందర్‌ సింగ్‌ ప్రశంసించారు. 

వ్యవసాయం దండగ కాదు పండగలా మార్చాలని కంకణం కట్టుకున్న కేసీఆర్‌ సర్కారు  రైతు సంక్షేమమే థ్యేయంగా పనిచేస్తోంది. దాదాపు 17 వేల కోట్ల రూపాయల రైతు రుణాలు మాఫీ చేసింది. రైతులకు 24 గంటలపాటు ఉచితంగా నాణ్యమైన కరెంటును అందిస్తోంది. సకాలంలో విత్తనాలు, ఎరువులు అందిస్తోంది. దాదాపు 20 లక్షల మెట్రిక్‌ టన్నుల గోదాములు నిర్మించింది. మద్దతు ధర కోసం, రైతు సమస్యల పరిష్కారం కోసం రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేసింది. వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్నదాతలకు సంబంధించి దేశంలో ఏ రాష్ట్రం కూడా సాహసించని పథకానికి శ్రీకారం చుట్టింది.

రైతు బంధు పథకం ద్వారా ఏడాదికి ఎకరాకు 8 వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తోంది. ఏటా 12 వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న ఈ పథకం ద్వారా 58 లక్షల మందికిపైగా రైతులు లబ్ధి పొందుతున్నారు. దేశానికి అన్నం పెట్టే  రైతన్న హఠాత్తుగా మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం మరో బృహత్తర పథకాన్ని అమలుచేసేందుకు సిద్ధమవుతోంది. ఆగస్టు 15 నుంచి ప్రతి రైతుకు 5 లక్షల రూ‘‘ల జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించాలని సీఎం కేసీఆర్‌ సంకల్పిం చారు. రైతుల కోసం కేసీఆర్‌ చేస్తున్న ఈ కార్యక్రమాలను చూసి దేశం అబ్బురపడుతోంది. కేసీఆర్‌ అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు మాత్రమే కాదు కిసాన్‌ చంద్రశేఖర్‌ రావు అని యావత్‌ దేశం కీర్తిస్తోంది. 

42,300 కోట్లతో మిషన్‌ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టారు. మంచినీరు అందించడం ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యంగా భావించిన సర్కారు మిషన్‌ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ నల్లా ద్వారా నీరందించేందుకు సమాయత్తమైంది. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథను ప్రధానమంత్రి, నీతి ఆయోగ్, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర రాష్ట్రాల అధికారులు ప్రశంసిస్తున్నారు. 

తెలంగాణ సమాజంలో 91 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం కోసం అనేక  పథకాలు– కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల ఏర్పాటు, ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌లు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, భూపంపిణీ, ఆసరా పెన్షన్లు, ఎంబీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు, ఎస్సీ–ఎస్టీ ప్రత్యేక ప్రగతినిధి చట్టం, రిజర్వేషన్ల పెంపుకై అసెంబ్లీ తీర్మానం, హైదరాబాద్‌ నడిబొడ్డున అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు (125 అడుగులు), గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ, నవీన క్షౌరశాలలు, చేనేతలకు చేయూత లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. 

ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు అంటూ పాడుకున్న జనం ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ చర్యల ఫలితంగా సర్కారు దవాఖానాల్లోనూ కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందుతోంది. కేసీఆర్‌ కిట్‌ పథకంలో భాగంగా ఆర్థిక సాయం అందిస్తుండటంతో భ్రూణహత్యలు తగ్గాయి. జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్‌ సెంటర్లు, ఐసీయూలు ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా త్వరలోనే కంటి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

నాలుగేళ్లలో కొత్తగా 577 రెసిడెన్షియల్‌ పాఠశాలు ప్రారంభించిన ఘనత కేసీఆర్‌ సొంతం. ఆనాడు ఒక విద్యార్థిపై సం‘‘నికి 20వేలు ఖర్చు చేస్తే ప్రస్తుతం ఒక్కో విద్యార్థిపై ఏటా లక్షా 20 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పెద్ద ఎత్తున అధికార వికేంద్రీకరణ జరగాలని కొత్తగా 21 జిల్లాలు, 25  రెవెన్యూ డివిజన్లు, 125 మండలాలు ఏర్పాటు చేసి ప్రజల చెంతకు పాలన తీసుకుపోయింది. ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉద్యోగుల సహకారంతో భూరికార్డుల ప్రక్షాళన సహా అనేక రకాల కార్యక్రమాలను విజయవంతంగా పూర్తిచేస్తోంది. 

విశ్వనగరంగా హైదరాబాద్‌ ప్రపంచవ్యాప్తంగా పలువురు పెట్టుబడిదారుల్ని ఆకర్షిస్తోంది. శాంతి భద్రతలు, సులభతరమైన అనుమతులు, వాతావరణ పరిస్థితులు, అవినీతిరహిత పారదర్శక పాలన కారణంగా సింగిల్‌ విండో ఇండస్ట్రియల్‌ పాలసీ ద్వారా పరిశ్రమలకు అనుమతులు వేగంగా ఇస్తుండటంతో పలు కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఐటీ, ఏరోస్పేస్, డిఫెన్స్, ఫార్మా, ఎలక్ట్రానిక్, హార్డ్‌వేర్‌ రంగాల్లో తెలంగాణ దూసుకుపోతోంది. బడా కంపెనీలు సైతం హైదరాబాద్‌ వైపు చూస్తున్నాయి. హైదరాబాద్‌ ఇమేజ్‌ పెరగడంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడంలో అనేక ప్రపంచస్థాయి సదస్సులకు హైదరాబాద్‌ వేదిక కావడంలో అద్భుతమైన విజన్, డెడికేషన్, కమిట్‌మెంట్‌ ఉన్న మంత్రి కేటీఆర్‌ పాత్ర ప్రశంసనీయం.

నాలుగేళ్ల పాలనలో అందరి మన్ననలు అందుకునే రీతిలో పాలన సాగిస్తున్నారు సీఎం కేసీఆర్‌. అందుకే దేశంలో నంబర్‌వన్‌ సీఎం ఎవరంటే ఆయన పేరే వినిపిస్తోంది. ఉద్యమనేతగా.. రాజకీయవేత్తగా.. పలు అంశాలపై పట్టున్న మేధావిగా... సమస్యలకు పరిష్కారం చూపే దార్శనికుడిగా కేసీఆర్‌ సేవలు అనన్యసామాన్యం. కొత్తగా పురుడుపోసుకున్న రాష్ట్రానికి తొలి సీఎంగా ఎన్నికైన నాటి నుంచి విప్లవాత్మక నిర్ణయాలతో బంగారు తెలంగాణ నిర్మాణంలో ఆయన చేస్తున్న ప్రయత్నం అమూల్యం.

దీక్ష, పట్టుదల, చిత్తశుద్ధితో ప్రతి పనిలోనూ విజయం సాధిస్తూ పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరి ప్రశంసలు అందుకుంటున్న కేసీఆర్‌ అంతర్జాతీయ యువనికపై తెలంగాణ కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. స్వరాష్ట్రంలో స్వర్ణయుగానికి బాటలు పరుస్తున్నారు. నిజంగా ఇవాళ తెలంగాణలో కేసీఆర్‌ విప్లవం నడుస్తోంది. దేశవ్యాప్తంగా కేసీఆర్‌ విప్లవం అన్ని రాష్ట్రాల్లో కూడా వస్తే భారతదేశ స్వరూపమే మారిపోతుంది. దేశ ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పు వస్తుంది.

బాల్క సుమన్‌, వ్యాసకర్త పార్లమెంట్‌ సభ్యులు, పెద్దపల్లి, (జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement