
అప్రమత్తంగా ఉండండి
- మంత్రులు, అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
- పంట నష్టం అంచనాలు సిద్ధం చేయండి
- నగర మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండాలి
- జిల్లా కేంద్రాల్లో కంట్రోల్‌రూంలు ఏర్పాటు చేయండి
- మిషన్ కాకతీయ సత్ఫలితాలిచ్చింది
- ప్రాజెక్టుల వద్ద 24 గంటల పర్యవేక్షణ ఉండాలి
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో మంత్రులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం శుక్రవారం రాత్రి.. రాష్ట్రంలో వర్షాలపై సమీక్ష జరిపారు. మంత్రులందరితో స్వయంగా ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, జీహెచ్‌ఎంసీ క మిషనర్ జనార్దన్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు తదితరులతో మాట్లాడారు. మరో రెండ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని మంత్రులకు సూచించారు.
హైదరాబాద్‌లో రేయింబవళ్లు పరిస్థితిని పర్యవేక్షించాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను ఆదేశించారు. నగరానికి చెందిన మంత్రులంతా ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయక చర్యల్లో పాలు పంచుకోవాలన్నారు. జిల్లాల్లో మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి ప్రజల సూచనలు, ఫిర్యాదులపై స్పందించాలని ఆదేశించారు. ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని సూచించారు.
చెరువులు, ప్రాజెక్టుల్లోకి నీటిపై సంతృప్తి
భారీ వర్షాలతో చాలా ప్రాజెక్టుల్లోకి నీరు వస్తోందని, చెరువులు నిండుతున్నాయని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల వద్ద ప్రవాహ ఉధృతిని గమనిస్తూ, నీటి నిల్వ స్థారుులను బట్టి నీటిని బయటకు వదలాలని మంత్రి హరీశ్‌కు సీఎం సూచించారు. ఎస్సారెస్పీ, ఎల్‌ఎండీ, నిజాంసాగర్, సింగూరు, ఎల్లంపల్లి, మిడ్ మానేరు తదితర రిజర్వాయర్ల వద్ద 24 గంటల పర్యవేక్షణ ఉంచాలని పేర్కొన్నారు. మిషన్ కాకతీయ పనులు సత్ఫలితాలిచ్చాయని, దీంతో చెరువులు నిండడంతో పాటు, కట్టలు కూడా బలంగా తయారయ్యాయన్నారు. లేకుంటే చాలా కట్టలు తెగి ఉండేవన్నారు.
చెరువు కట్టలు తెగినా, గండ్లు పడినా వెంటనే స్పందించాలని పేర్కొన్నారు. సీఎం ఆదేశం మేరకు మంత్రి హరీశ్ ప్రాజెక్టుల వారీగా పర్యవేక్షణాధికారులను నియమించారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువుల పరిస్థితిని గమనించి, సమాచారం సేకరించి, తగు ఆదేశాలు ఇవ్వడానికి జలసౌధలో కంట్రోల్ రూమ్ (040-23390794) ఏర్పాటు చేశారు. నిజాంసాగర్, ఎల్‌ఎండీ, ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ, సింగూరు, మిడ్ మానేరు వద్ద కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి సీఈ స్థారుు అధికారులను నియమించారు.
అంటువ్యాధులపై జాగ్రత్త
జనావాసాల్లో నీరు రావడంతో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి లక్ష్మారెడ్డిని సీఎం ఆదేశించారు. దోమలు వ్యాపించకుండా, నీటి కాలుష్యంతో రోగాలు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని ప్రాంతాల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, అత్యవసర సేవలకు అధికారులను సిద్ధం చేయాలని పేర్కొన్నారు. విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని జెన్‌కో సీఎండీ ని సీఎం ఆదేశించారు. జెన్‌కో, ట్రాన్ ్స కో కూడా కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసుకుని, ప్రజల నుంచి వచ్చే వినతులు, సలహాలు స్వీకరించాలన్నారు.
పోలీస్ శాఖ కూడా అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. హైదరాబాద్ బయల్దేరేందుకు ముందు ఢిల్లీ నుంచి కూడా సీఎం అధికారులతో సమీక్ష జరిపారు. వర్షాలతో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని సూచించారు. పంట నష్టం వివరాలు సేకరించిన నివేదిక సిద్ధం చేయాలని, ఆ నివేదికను కేంద్రానికి సమర్పించి తగిన సాయం కోరుతామని చెప్పారు.